Bacterias
-
ముంచుకొస్తున్న మరో ముప్పు, ఈ నల్లని మేఘాలు ప్రమాదకరం ఎందుకంటే?
ఆకాశంలో దట్టమైన నల్లటి మేఘాలు కమ్ముకుంటే? మామూలుగా అయితే వాన రాకడకు సూచిక. కానీ, జీవజలాన్ని కాక ప్రమాదకరమైన బ్యాక్టీరియాను మోసుకొచ్చే మేఘాలున్నాయని తెలుసా? నిజం. ఇలాంటి మేఘాలున్నాయని కెనడా, ఫ్రాన్స్ పరిశోధకులు చెబుతున్నారు. ఔషధాల శక్తిని తట్టుకొని మరీ నిక్షేపంగా జీవించే బ్యాక్టీరియా ఈ మేఘాల్లో నిండి ఉంటుందని, వాటితో పాటే అది సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తుందని తాజా అధ్యయనంలో గుర్తించారు. ఒకరకంగా చెప్పాలంటే ప్రపంచమంతటినీ చుట్టేస్తుందన్నమాట! ఈ అధ్యయనం వివరాలను సైన్స్ ఆఫ్ ద టోటల్ ఎన్విరాన్మెంట్ పత్రికలో ప్రచురించారు. ► కెనడాలో క్విబెక్ సిటీలోని లావల్ యూనివర్సిటీ, సెంట్రల్ ఫ్రాన్స్‌లోని క్లెర్మాంట్ అవెర్జిన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు మేఘాల నమూనాలను సేకరించి పరీక్షించారు. ► 8,000 ఒక మిల్లీలీటర్ మేఘంలో సగటున ఉన్న బ్యాక్టీరియా సంఖ్య. ► మేఘాల్లోని ఈ బ్యాక్టీరియాలో 29 ఉపవర్గాలకు చెందిన యాంటీబయాటిక్‌ను తట్టుకునే జన్యువులు ఉన్నట్టు గుర్తించారు. ► ఈ మేఘాల్లో యాంటీబయాటిక్స్‌ను తట్టుకొనే జన్యువులతో కూడిన బ్యాక్టీరియా ఉన్నట్టు గుర్తించారు. ► 2019 సెప్టెంబర్ నుంచి 2021 అక్టోబర్ దాకా ఈ పరిశోధన నిర్వహించారు. ► చెట్లపై, భూమిలో ఉన్న బ్యాక్టీరియా గట్టి గాలుల ద్వారా వాతావరణంలోకి, అటునుంచి మేఘాల్లోకి చేరుతుంది. వాటితో పాటు సుదూరాలకు పయనిస్తుంది. ► సముద్ర మట్టానికి 1,465 మీటర్ల(4,806 అడుగులు) ఎత్తులో ఉన్న మేఘాల నుంచి నమూనాలను సేకరించారు. ► మిల్లీలీటర్ పరిమాణంలో 330 నుంచి ఏకంగా 30,000కు పైగా బ్యాక్టీరియా ఉన్నట్టు తేలింది. ► వర్షంగా కురిసిన చోట మేఘాల నుంచి భూమిపైకి చేరుతుంది. ► మేఘాల ద్వారా ఇలా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యాప్తి చెందే బ్యాక్టీరియాతో మానవళి ఆరోగ్యానికి ఉన్న ముప్పుపై పూర్తిస్థాయి పరిశోధనలు జరగాల్సి ఉంది. ► ఈ బ్యాక్టీరియాలో 5 నుంచి 50 శాతం దాకా మాత్రమే క్రియాశీలకంగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. మేఘాల బ్యాక్టీరియా వల్ల మనుషులకు ముప్పు స్వల్పమేనని పరిశోధకురాలు ఫ్లోరెంట్ రోసీ అభిప్రాయపడ్డారు. ‘వర్షంలో బయట నడవాలంటే భయపడాల్సిన అవసరం లేదన్నమాట’ అంటూ చమత్కరించారు! ► మేఘాల్లోని బ్యాక్టీరియా జన్యువులు ఇతర బ్యాక్టీరియాతో కలుస్తాయా, లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదని రోసీ వెల్లడించారు. ► డ్రగ్–రెసిస్టెంట్‌ను కలిగిన బ్యాక్టీరియాల మూలాలను కనుగొనేందుకు ఈ పరిశోధన దోహదపడుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బరితెగించిన అమర రాజా ఫ్యాక్టరీ యాజమాన్యం
-
ఇదో మంచి 'బ్యాక్టీరియా'..
సాక్షి, విశాఖపట్నం: నగరంలో నిత్యం వస్తున్న మురుగునీటిని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) శుద్ధిచేసి పరిశ్రమలకు కొంత, మిగిలినది సముద్రంలోకి విడిచిపెడుతుంది. ఈ క్రమంలో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)లు.. వాటి పరిసరాలు చాలా దుర్వాసన వెదజల్లేవి. పాదచారులు, వాహనచోదకులు ఆ మార్గంలో వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే. ఈ తరుణంలో జీవీఎంసీ అధునాతన బయో సాంకేతికతను అందిపుచ్చుకుంది. అదే బయోరెమిడేషన్. అంటే.. మంచి బ్యాక్టీరియాలతో మురుగునీటిని శుభ్రంచేయడం. ఇందుకోసం పయోనీర్ ఎన్విరాన్ కేర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని మూడు పద్ధతుల్లో.. ఈ మురుగునీటిని శుభ్రం చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే.. మానవాళికి మంచి చేసే బ్యాక్టీరియాలుంటాయి. ఇందులో ఫొటోట్రోఫిక్, లాక్టోబాసిలస్, రోడో సుడోమాస్ అనే బ్యాక్టీరియాలను పయోనీర్ సంస్థ తమ ల్యాబ్‌లో ఉత్పత్తి చేస్తుంది. వీటిని అప్పుఘర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు తీసుకొచ్చి మంచినీటిలో పెంచుతారు. ఇవి పెరిగేందుకు మొలాసిస్‌ను ఆహారంగా వేస్తారు. 5–7 రోజుల్లో ఇవి పెరుగుతాయి. వీటికి కావల్సిన ఉష్ణోగ్రతను కూడా దశల వారీగా అందిస్తారు. మొదటి నాలుగు రోజులు 1–5 డిగ్రీలు, తర్వాత 5–15 డిగ్రీల ఉష్ణోగ్రతలో పెంచుతారు. ఇలా వారం రోజుల్లో 0–50 డిగ్రీల ఉష్ణోగ్రతని తట్టుకునేలా వీటిని తయారుచేస్తారు. ఫొటోట్రోఫిక్ బ్యాక్టీరియా చెత్తనీటిలో ఆక్సిజన్ లెవల్స్‌ను పెంచుతుంది. లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా సీవేజ్ వాటర్‌లో 80 శాతం ఆర్గానిక్ వ్యర్థాలను తినేస్తుంది. రోడో సుడోమాస్ కొన్ని ఎంజైమ్‌లు విడుదల చేసి.. మిగిలిన రెండు బ్యాక్టీరియాలకు అవసరమైన శక్తిని అందించి.. శుద్ధిచేసే పనిని వేగవంతం చేస్తుంది. వీటిని పెద్దపెద్ద డ్రమ్ముల్లో పెంచుతారు. 1 లీటర్ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసేందుకు రూ.200 నుంచి రూ.300 వరకు ఖర్చవుతుంది. ఎరేషన్ ట్యాంకులో శుభ్రమవుతుందిలా.. వెయ్యి లీటర్ల మురుగుకు లీటర్ బ్యాక్టీరియా ఇలా పెరిగిన బ్యాక్టీరియాని ఎస్టీపీలోకి విడిచి పెడతారు. వెయ్యి లీటర్ల మురుగు నీటికి బ్యాక్టీరియా ఉన్న లీటర్ నీటిని కలుపుతారు. వివిధ మురుగు కాలువలు, మరుగుదొడ్ల నుంచి వచ్చిన నీరు స్టోర్ అయిన ఇన్లెట్లోకి బ్యాక్టీరియాని పంపిస్తారు. అక్కడి నుంచి ఎరేషన్ ట్యాంకులోకి వెళ్తుంది. ఈ ట్యాంకులో ఆక్సిజన్ శాతం సరైన మోతాదులో ఉంటే.. ఈ బ్యాక్టీరియాలు తమ పనిని వేగవంతం చేస్తాయి. చెత్తను, మురుగుని తినేయడం ప్రారంభిస్తాయి. మొత్తంగా నీటిని 4 గంటల వ్యవధిలోనే శుభ్రం చేసేస్తాయి. ఇలా శుభ్రం చేసిన నీటిని అవుట్లెట్లోకి పంపిస్తారు. అక్కడ మరోసారి శుభ్రంచేసి అక్కడి నుంచి సముద్రంలోకి విడిచిపెట్టడం, పరిశ్రమలకు అందించడం చేస్తారు. ఇన్లెట్లోకి బ్యాక్టీరియాని ఇలా విడిచిపెడతారు.. పర్యావరణహితంగా అమలుచేస్తున్నాం.. మురుగునీటిని శుద్ధిచేశాకే బయటకి విడిచిపెట్టాలన్నది నిబంధన. ఈ మేరకు ఎస్టీపీల్లో శుద్ధిచేస్తున్నాం. అయితే, మరింత అత్యాధునిక పద్ధతుల్లో మురుగునీటిని పునర్వినియోగం చేసేందుకు జీవీఎంసీ కమిషనర్ సంకల్పించారు. ఆమె సూచనల మేరకు రెండు ఎస్టీపీల్లో బయో రెమిడేషన్ అమలుచేశాం. సత్ఫలితాలిస్తోంది. వారం రోజుల్లోనే దుర్వాసన దాదాపు తగ్గిపోయింది. ఇక నగరంలోని అన్ని ఎస్టీపీల్లో దీనిని అమలుచేసేందుకు ప్రయత్నిస్తాం. – వేణుగోపాలరావు, జీవీఎంసీ నీటి సరఫరా విభాగం ఎస్ఈ ప్రాణవాయువు విడుదల చేసి స్వచ్ఛంగా మారుస్తాయి రసాయనాలతో పనిలేకుండా బయో టెక్నాలజీతో మురుగునీటి వనరుల్ని శుభ్రంచేస్తున్నాం. మానవాళికి మంచిచేసే బ్యాక్టీరియాలు నీటిలోని కాలుష్య కారకాల్ని ఆహారంగా తీసుకుని ప్రాణవాయువుని విడిచిపెట్టి.. వాటిని స్వచ్ఛంగా మారుస్తాయి. కేవలం నాలుగైదు గంటల్లోనే మురుగునీరు మంచి నీరుగా మారిపోతుంది. ఫార్మా కాలుష్యాలను కూడా దీని ద్వారా శుద్ధిచేయగలం. – దండు వెంకటవర్మ, పయోనీర్ ఎన్విరాన్ కేర్ సీఈఓ -
అన్ని బాక్టీరియాలూ చెడ్డవి కావు
సాక్షి, అమరావతి: మన శరీరంలోనూ, శరీరం బయటా లక్షల బాక్టీరియాలు ఉంటాయి. బాక్టీరియా అనగానే చాలామందికి చెడు చేస్తాయనే అభిప్రాయం ఉంటుంది. కానీ మంచి చేసే బాక్టీరియాలు చెడు బాక్టీరియాల కంటే ఎక్కువగా ఉన్నాయని.. ఇలాంటి బాక్టీరియా కోవిడ్‌ను నియంత్రించేందుకు ఇమ్యూనిటీని పెంచుతాయని చెబుతున్నారు ఔషధ నియంత్రణ శాఖకు చెందిన మైక్రో బయాలజిస్ట్ డా. ప్రవీణ్‌కుమార్. ► పాలు పెరుగుగా మారే ప్రక్రియ వల్ల లాక్టొబాసిల్లస్ అనే బాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. ఈ బాక్టీరియా ఇమ్యూనిటీకి దోహదపడే లాక్టిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ► వెన్న తయారయ్యే ప్రక్రియలో లాక్టోబాసిల్లస్, లాక్టోకోకస్, ప్రాపియాన్ బాక్టీరియం, బ్రేవి బాక్టీరియం వంటివి ఉత్పత్తి అవుతాయి. హానికారక వైరస్‌లను నియంత్రించేందుకు ఉపయోగపడతాయి. ఇడ్లీ, దోశ వంటివి పులియడం ద్వారాజీర్ణ ప్రక్రియకు ఉపయోగçపడే బాక్టీరీయా ఉత్పత్తి అవుతుంది. ► మనిషి పేగుల్లో బాక్టీరియాడిస్, ఎంటర్కోకస్, క్లెబ్సిల్లా, బైఫిడో బాక్టీరియం వంటివి ఉంటాయి. వీటివల్ల వైరస్‌ను ఎదుర్కొనే శక్తి వస్తుంది. ► పండ్లు, కూరగాయలు తినడం వల్ల ఉత్పత్తి అయ్యే బాక్టీరియా హానికర బాక్టీరియాను, వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొంటాయి.మనిషి శరీరంలో 2వేలకు పైగా మేలు చేసే బాక్టీరియా జాతులుంటాయని ‘నేచర్ జర్నల్’ ప్రచురించింది. -
పేగుల్లోని బ్యాక్టీరియాతో మధుమేహ నియంత్రణ
పేగుల్లోని బ్యాక్టీరియాపై శాస్త్రవేత్తల దృష్టి ఎక్కువవుతున్న కొద్దీ.. వీటి ద్వారా మనకు కలుగుతున్న ప్రయోజనాల చిట్టా పెరిగిపోతోంది. తాజాగా కెనడాకు చెందిన శాస్త్రవేత్తలు కొందరు పేగుల్లోని బ్యాక్టీరియా.. రక్తంలోని గ్లూకోజ్ మోతాదును నియంత్రిస్తున్నట్లు పరిశోధన పూర్వకంగా గుర్తించారు. పేగుల్లో సెరటోనిన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా బ్యాక్టీరియా మనకు మేలు చేస్తున్నట్లు వెల్లడించారు. సంతోషంగా ఉండే ఫీలింగ్ ఇచ్చే సెరటోనిన్ జీవక్రియల్లోనూ కీలకపాత్ర పోషిస్తుంటుంది. శరీరంలో ఉత్పత్తయ్యే మొత్తం సెరటోనిన్‌లో 90 శాతం పేగుల్లోనే ఉండటం గమనార్హం. ఊబకాయుల రక్తంలో సెరటోనిన్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు.. పేగుల్లో దీని ఉత్పత్తిని బ్యాక్టీరియా నియంత్రిస్తుందన్న అంచనాతో జంతువులపై పరిశోధనలు మొదలుపెట్టారు. బ్యాక్టీరియా వైవిధ్యత, సంఖ్యల్లో తేడా వస్తే సెరటోనిన్ ఉత్పత్తిలోనూ మార్పులు ఉన్నట్లు గుర్తించారు. ఈ మార్పులు రక్తంలో గ్లూకోజ్ నిర్వహణపై కూడా ప్రభావం చూపుతున్నట్లు తెలిసింది. రక్తం, పేగుల్లో సెరటోనిన్ ఎంత ఎక్కువగా ఉంటే.. గ్లూకోజ్ నిర్వహణ అంత అధ్వానంగా ఉన్నట్లు స్పష్టమైంది. వెంట్రుకలకు కరెంట్ షాక్ వెంట్రుకలు ఊడిపోతున్నాయని ఇబ్బంది పడుతున్న వారందరికీ ఓ శుభవార్త. వెంట్రుకలు వేగంగా పెరిగేందుకు యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ శాస్త్రవేత్తలు ఓ వినూత్నయంత్రాన్ని తయారు చేశారు. స్వల్పస్థాయి కరెంటు షాక్‌లు ఇవ్వడం (దీన్నే ఎలక్ట్రోట్రైకోజెనిసిస్ అంటారు) ద్వారా ఇది పనిచేస్తుంది. ఇందుకు అవసరమైన యంత్రాలు భారీ సైజులో ఉంటాయి. విద్యుత్ అవసరాలూ ఎక్కువే. ఇప్పుడా యంత్రాన్ని ఓ టోపీలో ఇమిడ్చేయడం ఈ కొత్త పరికరం విశేషం. అంతేకాదు.. శరీర కదలికలను విద్యుత్‌గా మార్చుకోగలగడం ఇంకో ముఖ్యమైన విషయం. శరీరంలోని వివిధ ప్రక్రియలను ప్రేరేపించేందుకు కరెంటు షాకులు ఉపయోగపడతాయి. అయితే ఇందుకు తగ్గ పరికరాలు మాత్రం అందుబాటులో లేవని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త షుడాంగ్ వాంగ్ తెలిపారు. వెంట్రుకల తయారీ పరికరం తనంతటతానే సూక్ష్మస్థాయి విద్యుత్‌ను తయారు చేసుకుంటుందని వివరించారు. ఇప్పటికే బట్టతల వచ్చిన వారికి ఈ యంత్రం పెద్దగా ఉపయోగపడకపోవచ్చనేది శాస్త్రవేత్తల మాట.! పరిశోధన వివరాలు ఏసీఎస్ నానో జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
డెంగ్యూ దోమపై విజయం
లండన్: పరిశోధకులు చేపట్టిన ఓ ప్రయోగం వల్ల డెంగ్యూ రహిత పట్టణం ఆవిర్భవించింది. నాలుగేళ్ల క్రితం డెంగ్యూ వైరస్‌ను అదుపు చేసేందుకు దోమల్లో ప్రవేశ పెట్టిన వోల్బచియా బ్యాక్టీరియా ప్రయోగం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ దీవిలో 66 చదరపు కి.మీ విస్తీర్ణంలో ఉన్న టౌన్స్‌విల్లే వేదికైంది. ఆస్ట్రేలియా పరిశోధకులు దోమల్లో వోల్బచియా బ్యాక్టీరియాను ప్రవేశపెట్టి ఇతర దోమలతో జత కూడేలా చేయడంతో డెంగ్యూ వైరస్‌ను నివారించగలిగారు. 2014 నుంచి టౌన్స్‌విల్లేలో ఒక్క డెంగ్యూ కేసు కూడా నమోదు కాలేదు. ప్రపంచానికి వణుకు పుట్టిస్తున్న డెంగ్యూ, జికా వ్యాధులను అదుపు చేయాలనే లక్ష్యంతో ఈ పరిశోధన మొదలు పెట్టామని, ఈ ఫలితాలతో తమకు నమ్మకం పెరిగిందని వరల్డ్ మస్కిటో ప్రోగ్రామ్ డైరెక్టర్ స్కాట్ ఓ నీల్ చెప్పారు. ప్రస్తుతం వీటిని ఇండోనేషియాలో ప్రయోగిస్తున్నారు. జికా వైరస్‌ను నివారించేందుకు వీటిని బ్రెజిల్ రాజధాని రియో డీ జెనీరోలో ప్రయోగించనున్నారు. ‘టౌన్స్‌విల్లే కన్నా రెట్టింపు విస్తీర్ణం, 15 లక్షల జనాభా ఎక్కువగా ఉన్న రియోలో ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రపంచంలో ఎక్కడైనా మేం విజయం సాధిస్తాం’ అని నీల్ అన్నారు. ఈ బ్యాక్టీరియా మలేరియాను నివారించగలదా అన్న కోణంలో శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. -
పిల్లలు వేళ్లు చీకడం మంచిదే!
మెల్బోర్న్: మీ పిల్లలకు వేళ్లు చీకడం, గోళ్లు కొరకడం లాంటి అలవాట్లున్నాయా? అవి చేయవద్దని మీరు పిల్లల్ని వారిస్తున్నారా? అయితే ఇది చదవండి. చిన్నతనంలో వే ళ్లు చీకడం, గోళ్లు కొరకడం వంటివి చేసే పిల్లలు అలర్జీల బారిన పడే ప్రమాదం తక్కువని పరిశోధనలో తేలింది. పెద్దయ్యాక కూడా వారి వ్యాధి నిరోధక శక్తి మెరుగ్గా ఉంటుందట. పిల్లలకు గనుక ఈ రెండు అలవాట్లూ ఉంటే వారు మరింత ఎక్కువ నిరోధకతను పొందుతారు. ఇంట్లోని దుమ్ము, తలలో ఉండే పేలు, గడ్డి, పిల్లులు, కుక్కలు, గుర్రాలు ఇంకా గాలి ద్వారా వ్యాపించే సూక్ష్మజీవులు వీరిపై తక్కువ ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలంటున్నారు. చిన్నతనంలో దుమ్ము, సూక్ష్మజీవులను నిరోధించే శక్తిని పొందితే అది పెద్దయ్యాక కూడా ఉపయోగపడుతుందని, అలాంటి వారికి అలర్జీలు సోకే ప్రమాదం తక్కువని కెనడాలోని మెక్ మాస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు మాల్కోమ్ సియర్స్ చెప్పారు. -
నేల తల్లి వైద్యుడు నటరాజన్
విష రసాయనాల చెర నుంచి నేల తల్లికి విముక్తి కల్పించేందుకు నడుంకట్టిన వైద్యుడాయన. సత్తువ కోల్పోయిన సూక్ష్మజీవులకు సజీవ శక్తిని నింపిన శక్తి ప్రదాత. గుక్కపట్టిన పుడమి కల్మషం లేని పసిపాపలా నవ్వుతోందంటే అది ఆ వైద్యుని చలవే. పంటకు మేలు చేసే సూక్ష్మజీవులకు ప్రాణశక్తిని ఇచ్చేది పంచగవ్యమని రైతులకు నచ్చ జెప్పి, ఒప్పించి, మెప్పించి విశ్వవ్యాప్తం చేయటంలో ఆయన కృషి భగీరథుని తలపిస్తే, తను మూడు సంవత్సరాలు పగలూ, రేయనకా కష్టపడి సంపాదించిన జ్ఞానంపై పేటెంట్ కూడా పొందకుండా రైతులకు అందించిన వైనం పురాణాల్లో దధీచిని తలపిస్తుంది. పంచగవ్యకు రైతులోకంలో వేదంలా గౌరవం కల్పించిన వ్యక్తి తమిళనాడులోని కోడుమూడికి చెందిన డా. కె. నటరాజన్. ఎంబీబీఎస్ చేసి వైద్యవృత్తిలో స్థిరపడిన నటరాజన్ యాదృచ్ఛికంగా జరిగిన ఓ ఘటనతో పంచగవ్య తయారీ, దాన్ని ప్రచారం చేసే పనిని తన కర్తవ్యంగా ఎంచుకున్నారు. పదిహేనేళ్ల క్రితం మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఆయన కోడిమూడిలోని శివాలయానికి వెళ్లారు. పూజాకార్యక్రమం పూర్తయ్యాక ప్రసాదంగా పంచగవ్యను ఇవ్వటం అక్కడి సంప్రదాయం. పంచగవ్యను ప్రసాదంగా ఇవ్వటం వల్ల కలిగే ప్రయోజనాలేమిటని నటరాజన్ పూజారిని ప్రశ్నించారు. పూజారి పంచగవ్యతో జీవరాశులకు కలిగే ప్రయోజనాలు, మొక్కలపై అది చూపే ప్రభావాన్ని నటరాజన్‌కు వివరించారు. ఇదంతా విన్న నటరాజన్‌కు ఆ క్షణంలో అదే తన జీవిత లక్ష్యంగా, భగవంతుడే తనకు కర్తవ్యాన్ని బోధిస్తున్న భావన కలిగింది. తన జీవిత పరమార్థం దానితోనే ముడిపడి ఉన్నట్టు ఆయనకు అనిపించింది. ఒక వైద్యుడిగా ప్రస్తుతం జరుగుతున్న అనారోగ్యకర పరిణామాల పట్ల అవగాహన ఉన్న ఆయనకు ఈ ప్రక్రియ సరైన పరిష్కారంగా అనిపించింది. అలా ఆయన పంచగవ్య గురించి తెలుసుకొని రైతులకు ఉపయోగపడేలా దాన్ని అందించాలని నిశ్చయించుకున్నారు. మూడేళ్ల శోధన.. పంచగవ్యకు సంబంధించిన వివరాల కోసం నటరాజన్ వేదాల ను శోధించి సమాచారాన్ని సేకరించారు. రకరకాల నిష్పత్తుల్లో వివిధ రకాల పదార్థాలను కలపి ద్రావణాన్ని తయారు చేయటం. తయారుచేసిన ద్రావణాన్ని రైతులకు ఇచ్చిపంటలపై పిచికారీ చేయించటం, వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకొని కొన్ని పదార్థాలను కలపటం, మరి కొన్నింటిని తొలగించటం, వాటిని కలిపే నిష్పత్తుల్లో మార్పులు, చేర్పులు చేయటం, ఇలా రాత్రనకా, పగలనకా కష్టపడ్డారు. ప్రతి రోజూ పరిశోధనలతోనే గడిచింది. మూడేళ్ల శ్రమ తరువాత పంచగవ్య వెలుగులోకొచ్చింది. నిర్ణీత ప్రమాణాలతో దానికి తుదిరూపునిచ్చారు. దీన్ని వినియోగించడంతో అన్ని పంటల్లోనూ మంచి ఫలితాలు వస్తున్నాయని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు వచ్చి చెబుతుండటంతో దీనిపై మరింత నమ్మకం కలిగింది. విస్తృత ప్రచారం, ఉచిత శిక్షణా తరగతులు పంచగవ్యను తయారు చేసింది మొదలు, శరవేగంతో దాని ప్రయోజనాలను రైతుల్లోకి తీసుకెళ్లారు నటరాజన్. పంచగవ్య వాడటం వల్ల కలిగే లాభాల గురించి రైతుల మనస్సుల్లో బలంగా నాటుకునేలా ప్రచారం చేశారు. ఉచిత శిక్ష ణా తరగతులు నిర్వహించి వారికి అవగాహన కల్పించారు. ఖండాంతరాల నుంచి శిక్షణ కోసం.. ఒక్క భారతదేశంలోని రైతులే గాక, విదేశాల నుంచి సైతం వచ్చి పంచగవ్య తయారీ, వాడే పద్ధతులపై నటరాజన్ వద్ద శిక్షణ పొందుతున్నారు. క్యూబా, మలేషియా, అమెరికా, దక్షిణాఫ్రికా సహా పలు దేశాల నుంచి వస్తున్నారు. పంచగవ్య తయారీ వెనుక ఆయన కృషిని ఎవరైనా ప్రశంసిస్తే తను నిమిత్త మాత్రుడనని, పంచగవ్యకు సంబంధించిన సమాచారమంతా వేదాల్లోనే ఉందని ఎంతో వినయంగా చెబుతారాయన. పంచగవ్య అనేది ఒక అద్భుత సంపద. తరగని గని. ఎవరైనా, ఎంతైనా ఉపయోగించుకోవచ్చు అంటారాయన. పంచగవ్యను చాలా తక్కువ ఖర్చుతోనే తయారు చేసుకోవచ్చని, సొంత ఆవులుంటే ఈ ఖర్చు మరింత తగ్గుతుందని అంటారాయన. రైతులు మరింత సమయం కేటాయించి, శ్రద్ధతో పంచగవ్యను తయారుచేసుకుంటే మంచి ఫలితాలు పొందగలుగుతార ని నటరాజన్ సూచిస్తున్నారు. పంటలపై పిచికారీ ఇలా.. వంద లీటర్ల నీటికి మూడు లీటర్ల పంచగవ్యను కలిపి పంటలపై పిచికారీ చేయాలి. పిచికారీకి ముందు ద్రావణాన్ని వడకట్టాలి. సాగు నీటి ద్వారానూ పంచగవ్యను పంటలకు అందించవచ్చు. తడులు ఇచ్చేటప్పుడు నీటివెంట ఎకరాకు 20 లీటర్ల పంచగవ్యను అందించాలి. డ్రిప్ ద్వారాను పంచగవ్యను అందించవచ్చు. విత్తనాలకు పంచగవ్యను పట్టించి విత్తుకోవచ్చు. పంచగవ్యతో నాణ్యమైన పండ్ల దిగుబడి దీన్ని పిచికారీ చేయటం వల్ల పంటల్లో పూత బాగా వస్తుంది.. ఉద్యాన పంటల్లో దీనిని పిచికారీ చేస్తే పండ్ల రసాలు మంచి రుచిగా ఉండటమే కాక నిల్వ ఉండే కాలం పదిరోజులు వరకూ పెరిగింది. మామిడి తోటల్లో పూత బాగా రావటంతోపాటు పండ్ల నిల్వ కాలం పెరిగింది. రుచి కూడా ఎక్కువ రోజుల పాటు నిలిచి ఉన్నట్టు రైతులు గుర్తించారు. సువాసన దీర్ఘకాలం పాటు నిలిచి ఉంటుంది. పంచగవ్య మొక్కల పెరుగుదలకు ఉపయోగపడటమే కాక మొక్కల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ప్రకృతి వ్యవసాయంలోనే కాక రసాయన సేద్యం చేస్తున్న పొలాల్లో పంచగవ్యను క్రిమిసంహారిణిగా వాడుతుండటం విశేషం. పంచగవ్య తయారీ, శిక్షణ, మార్కెటింగ్ వివరాలకోసం డా.కె.నటరాజన్ (+91 94433 58379)ను సంప్రదించవచ్చు. - దండేల కృష్ణ, సాగుబడి డెస్క్ పంచగవ్య తయారీకి కావలసిన పదార్థాలు.. తాజా ఆవు పేడ - 5 కిలోలు ఆవు మూత్రం - 3 లీటర్లు ఆవు పాలు - 2 లీటర్లు ఆవు నెయ్యి - 1/2 కేజీ ఆవు పెరుగు - 2 లీటర్లు చెరకు రసం - 3 లీటర్లు లేత కొబ్బరి నీళ్లు - 3 లీటర్లు పండిన అరటి పండ్లు - 12 కల్లు లేదా ద్రాక్షరసం - 2 లీటర్లు పంచగవ్య తయారీ ఇలా.. పంచగవ్య తయారీకి ఒక కుండ, ప్లాస్టిక్ క్యాన్ లేదా కాంక్రీట్‌తో కట్టిన తొట్టెను కాని ఉపయోగించాలి. లోహపు పాత్రలు వాడకూడదు. మొదట తాజా ఆవుపేడను కుండలో వేయాలి. దానిపై ఆవునెయ్యిని వేయాలి. మూడు రోజుల పాటు రోజుకు రెండు సార్లు కలియబెట్టాలి. నాలుగో రోజు మిగిలిన పదార్థాలను ఈ మిశ్రమానికి కలపాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని పదిహేను రోజుల పాటు, రోజూ రెండుసార్లు కలియబెట్టాలి. కుండపైన మూత ఉంచి వ్యాధికారక శిలీంధ్రాలు ఆశించకుండా కాపాడాలి. -
తడిజుట్టుతో తిరిగితే జలుబు చేస్తుందా?
జలుబుకి సంబంధించి బాగా ప్రచారంలో ఉన్న అనేక మూఢనమ్మకాల్లో తడి జుట్టుతో బయట తిరిగితే జలుబు చేస్తుందనేది కూడా ఉంది. అంతేకాదు, తలంటు స్నానం చేసిన వెంటనే జుట్టు తుడిచి ఆరబెట్టుకోకపోయినా జలుబు చేస్తుందనే నమ్మకమూ జనంలో ఉంది. వానలో తడిసినా, చలిలో తిరిగినా, ఎక్కువసేపు ఈత కొట్టినా కూడా జలుబు చేస్తుందనే అభిప్రాయం ఉంది. జలుబు అనేది సూక్ష్మజీవుల వల్ల వస్తుంది. వందల రకాల వైరస్లు అందుకు కారణమవుతాయి. ఆ వైరస్లు మన శరీరంలోకి ప్రవేశించి, రోగనిరోధక వ్యవస్థపై ఆధిపత్యం సాధిస్తాయి. అందువల్ల మనకు జలుబు వస్తుంది. ఎక్కువసేపు నీళ్లలో నానినందుకో లేదా తడిజుట్టుతో బయట తిరిగినందుకో రాదు. జలుబుకు కారణమయ్యే వైరస్లు దాదాపు అన్ని ప్రదేశాల్లోనూ, అన్ని రుతువుల్లోనూ ఉంటాయి. మన శరీర ఆరోగ్య వ్యవస్థ అంతో ఇంతో బలహీనపడినపుడు మాత్రమే ఇవి ప్రభావాన్ని చూపగలవు. అలాగే జలుబుతో బాధపడుతున్న వారి దగ్గర ఎక్కువసేపు ఉండటం కూడా ప్రమాదమే. అందుకే తుమ్ము వచ్చినపుడు రుమాలు అడ్డుపెట్టుకోవడం, చేతులు కడుక్కోవడం వంటివి తప్పనిసరిగా చేయాలంటున్నారు డాక్టర్లు. -
చనిపోయిన సమయం... సూక్ష్మజీవులు చెప్పేస్తాయ్!
వాషింగ్టన్: ఒక వ్యక్తి ఏ సమయంలో చనిపోయాడన్నది ఇకపై కచ్చితంగా తెలుసుకోవచ్చట. మృతదేహం బాగా కుళ్లిపోయినా.. చనిపోయి నెల రోజులు దాటినా కూడా మరణ సమయాన్ని సరిగ్గా అంచనా వేయొచ్చట. మృతదేహంపై ఉండే సూక్ష్మజీవుల అభివృద్ధిని బట్టి ఈ విషయాన్ని కనుగొనవచ్చని కొలరాడో, చామినేడ్, బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీల ఫోరెన్సిక్ సైన్స్ పరిశోధకులు వెల్లడించారు. జీన్ సీక్వెన్సింగ్ టెక్నిక్స్ ఉపయోగించి 40 ఎలుకలపై చేసిన పరిశోధనలో అవి చనిపోయిన సమయాన్ని తాము 48 రోజుల తర్వాత కూడా అత్యంత కచ్చితత్వంతో గుర్తించామని వారు తెలిపారు. మనిషి శరీరంలో, బయట కోట్లాది సూక్ష్మజీవులు నివసిస్తుంటాయి. అయితే చనిపోయిన క్షణం నుంచే సూక్ష్మజీవుల చర్యల్లో నిరంతరం మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పులను జీన్ సీక్వెన్సింగ్ ద్వారా అంచనావేసి చనిపోయిన సమయాన్ని గుర్తించవచ్చని పరిశోధనలో పాల్గొన్న జెస్సికా మెట్కాఫ్ తెలిపారు. అనేక కేసుల దర్యాప్తులో వ్యక్తి కచ్చితంగా ఎప్పుడు చనిపోయాడన్నది చాలా కీలకం కాబట్టి.. శవపరీక్షల కోసం ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుందన్నారు.