చనిపోయిన సమయం... సూక్ష్మజీవులు చెప్పేస్తాయ్!
వాషింగ్టన్: ఒక వ్యక్తి ఏ సమయంలో చనిపోయాడన్నది ఇకపై కచ్చితంగా తెలుసుకోవచ్చట. మృతదేహం బాగా కుళ్లిపోయినా.. చనిపోయి నెల రోజులు దాటినా కూడా మరణ సమయాన్ని సరిగ్గా అంచనా వేయొచ్చట. మృతదేహంపై ఉండే సూక్ష్మజీవుల అభివృద్ధిని బట్టి ఈ విషయాన్ని కనుగొనవచ్చని కొలరాడో, చామినేడ్, బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీల ఫోరెన్సిక్ సైన్స్ పరిశోధకులు వెల్లడించారు. జీన్ సీక్వెన్సింగ్ టెక్నిక్స్ ఉపయోగించి 40 ఎలుకలపై చేసిన పరిశోధనలో అవి చనిపోయిన సమయాన్ని తాము 48 రోజుల తర్వాత కూడా అత్యంత కచ్చితత్వంతో గుర్తించామని వారు తెలిపారు.
మనిషి శరీరంలో, బయట కోట్లాది సూక్ష్మజీవులు నివసిస్తుంటాయి. అయితే చనిపోయిన క్షణం నుంచే సూక్ష్మజీవుల చర్యల్లో నిరంతరం మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పులను జీన్ సీక్వెన్సింగ్ ద్వారా అంచనావేసి చనిపోయిన సమయాన్ని గుర్తించవచ్చని పరిశోధనలో పాల్గొన్న జెస్సికా మెట్కాఫ్ తెలిపారు. అనేక కేసుల దర్యాప్తులో వ్యక్తి కచ్చితంగా ఎప్పుడు చనిపోయాడన్నది చాలా కీలకం కాబట్టి.. శవపరీక్షల కోసం ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుందన్నారు.