ఫెడరర్... మరో రికార్డు
అత్యధిక గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లు గెలిచిన ప్లేయర్‌గా గుర్తింపు
వింబుల్డన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి
నేడు దిమిత్రోవ్‌తో పోరు సాయంత్రం గం. 5.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం
లండన్: తనకెంతో కలిసొచ్చిన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ వేదికగా స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మరో రికార్డు తిరగరాశాడు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో ఏడుసార్లు చాంపియన్ ఫెడరర్ 7–6 (7/3), 6–4, 6–4తో 27వ సీడ్ మిషా జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచాడు. ఈ క్రమంలో అత్యధికంగా 317 గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ప్లేయర్‌గా అతను గుర్తింపు పొందాడు.
సెరెనా విలియమ్స్ (అమెరికా–316 విజయాలు) పేరిట ఉన్న రికార్డును ఫెడరర్ అధిగమించాడు. మార్టినా నవ్రతిలోవా (అమెరికా–306), క్రిస్ ఎవర్ట్ (అమెరికా–296), స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ–280), వీనస్ విలియమ్స్ (అమెరికా–254), జొకోవిచ్ (సెర్బియా–236), జిమ్మీ కానర్స్ (అమెరికా–233), అగస్సీ (అమెరికా–224), ఇవాన్ లెండిల్ (చెకోస్లొవేకియా/అమెరికా–222 విజయాలు) టాప్–10లో ఉన్నారు.
వింబుల్డన్ టోర్నీలో వరుసగా 19వ ఏడాది ఆడుతోన్న ఫెడరర్ ఈ టోర్నీలో మొత్తం 98 సింగిల్స్ మ్యాచ్‌లు ఆడి 87 విజయాలు సాధించాడు. అంతేకాకుండా 15వసారి ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించాడు. ఆదివారం విశ్రాంతి దినం తర్వాత సోమవారం పురుషుల, మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్ జరగనున్నాయి. ప్రిక్వార్టర్ ఫైనల్లో 13వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)తో ఫెడరర్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ఫెడరర్ 5–0తో ఆధిక్యంలో ఉన్నాడు. మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జంట ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగిన రెండో రౌండ్‌లో సానియా–డోడిగ్ ద్వయం 7–6 (7/5), 6–2తో యుసుకె వటానుకి–మకోటో నినోమియా (జపాన్) జోడీపై విజయం సాధించింది.