ఊ..లలలా..
వింటర్ కేర్
చలికాలం పిల్లల చర్మం కూడా ముడతలు పడటం గమనిస్తుంటాం. తాగే నీరు, తీసుకునే ఆహారాన్ని బట్టి చర్మం పొడిబారుతుంది. పొడి చర్మం గలవారికి చలికాలం ఈ సమస్య మరీ ఎక్కువ ఉంటుంది. ఒక ఏడాది చలికాలంలో చర్మ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోకపోతే ఐదేళ్లు వయసు పై బడినట్టుగా కనిపించే అవకాశాలు ఎక్కువ.
శుభ్రత ముఖ్యం...
పొడిచర్మం గలవారికి చలికాలం సమస్యగానే ఉంటుంది. చలి కాబట్టి దాహం కూడా తక్కువే. అందుకే తక్కువ నీళ్లు తాగుతారు. దీంట్లో ఒంట్లో నీటి శాతం తగ్గిపోతుంది. ఫలితంగా చర్మం ఇంకా పొడిబారుతుంది. అందుకని ఈ కాలం నీళ్లు ఎక్కువ తాగడానికి ప్రయత్నించాలి. కనీసం 2-5 లీటర్ల నీళ్లు తాగాలి. ప్రతి మూడు గంటలకు ఒకసారి మాయిశ్చరైజర్‌ని రాసుకోవాలి. అయితే కోల్డ్ క్రీమ్ మొటిమలు, యాక్నెకు కారణం కావచ్చు. అందుకని... {Mీమ్ రాసుకోవడానికి ముందుగా ముఖాన్ని, చేతులను శుభ్రపరుచుకోవడం మరచిపోవద్దు. వారానికి ఒకసారి బాగా మగ్గిన అరటిపండు గుజ్జుతో ముఖాన్ని, చేతులను మసాజ్ చేసుకోవాలి. అలాగే వారానికి ఒకసారి పెరుగులో ఆలివ్ ఆయిల్ కలిపి శరీరానికి మసాజ్ చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలికాలం చర్మం పొడిబారడం సమస్య బాధించదు.
నూనెలు వాడద్దు...
చర్మం పొడిబారుతుంది కదా అని నూనెలు, మాయిశ్చరైజర్లు ఎక్కువగా రాసేస్తుంటారు. తర్వాత సబ్బులు, స్క్రబ్‌లతో చర్మాన్ని బాగా తోముతుంటారు. పైగా విపరీతమైన ఆవిరి పడుతుంటారు. దీంతో పోర్స్ ఓపెన్ అయి, చర్మం సాగుతుంది.ఆవిరి వల్ల లాభం తక్కువ, నష్టం ఎక్కువ అని గ్రహించాలి. ఈ కాలం చర్మానికి స్క్రబ్ కూడా ఎక్కువ చేస్తుంటారు. ఫలితంగా చర్మం మండుతుంటుంది. ర్యాష్ కూడా వస్తుంటుంది. వీటన్నింటి వల్ల చర్మం ఇంకా డల్‌గా, డ్రైగా అయిపోతుంది.ముఖ చర్మం ముడతలు తగ్గాలంటే సరైన మార్గం ఫేస్ ఎక్సర్‌సైజ్‌లు. నుదురు, బుగ్గలు, కళ్లు, గడ్డం.. ఇలా ఒక్కో పార్ట్‌ని సాగదీస్తూ 5-10 నిమిషాలు ఫేస్ ఎక్సర్‌సైజులు చేయాలి. శరీరంలో ఉండే మెకానిజమ్ వల్ల కాలాలను తట్టుకునే శక్తి ఉంటుంది. కాలానుగుణంగా సమతుల ఆహారం తీసుకుంటే చర్మం పొడిబారే సమస్య ఉండదు.
కేశసంరక్షణ తప్పనిసరి...
చలికాలంలో జుట్టు పొడిబారడానికి కారణం మాడు ఎక్కువ తేమను కోల్పోవడం. చలికాలం చుండ్రుకు కూడా కారణం అవుతుంది. అందుకని గోరువెచ్చని ఆలివ్ ఆయిల్‌ను మాడుకు పట్టించి, మసాజ్ చేసుకోవాలి. తర్వాతనే షాంపూతో తలస్నానం చేయాలి. అయితే రసాయనగాఢత తక్కువగా ఉన్న షాంపూలనే వాడాలి.వారానికి ఒకసారి పెరుగును మాడుకు పట్టించి, తర్వాత శుభ్రపరుచుకోవాలి. పెరుగు శిరోజాలకు మంచి కండిషనర్‌గా ఉపయోగపడుతుంది.బాదం నూనెలో విటమిన్ ‘ఇ’ ఉండటం వల్ల మాడు త్వరగా పొడిబారదు. అందుకని బాదం నూనెతో మాడుకు మసాజ్ చేసుకోవచ్చు. మృదుత్వం కోసం కండిషనర్‌ని వాడేవారు మాడుకు తగలకుండా జాగ్రత్తపడాలి.
మేకప్‌లో జాగ్రత్తలు
చలికాలంలో ఏ చర్మతత్వం గలవారైనా మేకప్ విషయంలో పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయితే పొడిచర్మం గలవారు మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. పొడిచర్మం గలవారు: మేకప్‌కిముందుగా ముఖమంతా మాయిశ్చరైజర్ రాయాలి. టిష్యూపేపర్‌తో అదనపు మాయిశ్చరైజర్‌ని తీసేయాలి. వీరు ఫౌండేషన్‌ని అస్సలు ఉపయోగించకూడదు. వాడితే చర్మం ఇంకా డ్రై అయిపోతుంది. కన్సీలర్‌ను, ఆయిల్ మేకప్‌ను వాడాలి. ఇది బేస్‌లా ఉపయోగపడుతుంది. వీటి వల్ల ముఖం ఎక్కువ సేపు తాజాగా ఉంటుంది. మేకప్‌లో ముఖ్యమైనవి మస్కారా, లైనర్. వీటితో కళ్లను తీర్చిదిద్దుకోవాలి. తర్వాత పెదవులకు లిప్ లైనర్, గ్లాస్‌ను ఉపయోగించాలి. బుగ్గలకు బ్లష్‌ను అది, టిష్యూ పేపర్‌తో టచ్ చేస్తూ అదనపు రంగును తీసేయాలి. తర్వాత మ్యాచ్ అయ్యే బిందీ, ఇతరత్రా అలంకరణ జాగ్రత్తలు తీసుకోవచ్చు. జిడ్డు చర్మం గలవారు: చలికాలంలో ఆయిల్ స్కిన్ వారిది కూడా కొద్దిగా పొడిబారుతుంది. అలాగని వీరు మేకప్‌కు ముందు మాయిశ్చరైజర్‌ను ముఖానికి ఉపయోగించకూడదు. మేకప్‌కు ముందు బేస్ కోసం ప్రైమర్‌లోషన్(మార్కెట్లో లభిస్తుంది)ను ఉపయోగించాలి. దాని మీద కాంపాక్ట్, ఫౌండేషన్ వాడకుండా వాటర్ బేస్డ్ పాన్‌కేక్స్‌ను మేకప్‌కోసం వాడాలి. దీంట్లో నీళ్లు కలిపి వాడతారు. తప్పనిసరిగా బ్రష్‌తోనే మేకప్ చేసుకోవాలి. ఎందుకంటే చేత్తో అయితే అదనంగా ఆయిల్ వస్తుంది. త్వరగా మేకప్‌ను డల్ చేస్తుంది. తర్వాత కళ్లు, పెదవులు, బుగ్గలు తీరుగా తీర్చిదిద్దుకోవాలి. అయితే బేస్ మాత్రం పర్‌ఫెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి.
సాధారణ చర్మంగలవారు: చాలామంది సాధారణ చర్మతత్వం గలవారు అంటుంటారు. కాని వీరిని కాంబినేషన్ స్కిన్ అనవచ్చు. ముఖంలో నుదురు, గడ్డం జిడ్డు అవుతుంది. మిగతా చర్మం పొడిబారుతుంది. అందుకని వీరు మేకప్‌కు ముందు నుదురు, గడ్డం మినహా మిగతా భాగానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. నుదురు, గడ్డానికి ప్రైమర్ లోషన్‌ని బేస్‌గా వాడాలి. కళ్లు, పెదవులు, బుగ్గలను అందంగా తీర్చిదిద్దుకోవాలి.