ఆకు కూరలతో రక్తహీనతకు చెక్!
హోమియో కౌన్సెలింగ్
నా వయసు 52 సంవత్సరాలు. ఇటీవల కొద్దికాలంగా మూత్రంలో మంట, చీము, రక్తం పడటం, నడుంనొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నాను. డాక్టర్‌ని సంప్రదిస్తే కిడ్నీల ఇన్ఫెక్షన్ అని చెప్పారు. ఎన్నో మందులు వాడుతున్నాను కానీ, అంతగా ఫలితం కనిపించడం లేదు. నా సమస్యకు హోమియో చికిత్స ద్వారా అయినా పరిష్కారం లభిస్తుందా? సలహా ఇవ్వగలరు. - రామారావు, పాలకొల్లు
మన శరీరంలో మూత్రపిండాలది కీలకమైన పాత్ర. సాధారణంగా రక్తప్రవాహం ద్వారా కానీ, మూత్రకోశ ఇన్ఫెక్షన్స్ ద్వారా కానీ మూత్రపిండాలకు ఇన్ఫెక్షన్ సంభవిస్తుంది.
కారణాలు: 80 శాతం వరకు బ్యాక్టీరియా, 15 శాతం, వైరస్‌లు మరికొంత శాతం ఫంగల్, కొన్ని పరాన్నజీవులు. మూత్రం ఎక్కువ సమయం విసర్జించకుండా ఉన్న సమయంలో బ్యాక్టీరియా అధికంగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. మూత్ర వ్యవస్థలో రాళ్లు మూత్రవిసర్జనకు అడ్డుగా నిలిచి ఈ సమస్య ఉత్పన్నం అయేలా చేస్తాయి. మూత్రకోశం ఇన్ఫెక్షన్లను స్త్రీలలోనే ఎక్కువగా గమనించవచ్చు. ముఖ్యంగా రజస్వల అయ్యే సమయంలోనూ, డెలివరీ అప్పుడు ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఎక్కువ. వీటితోబాటు కృత్రిమ మూత్ర గొట్టాలు(క్యాథెటర్స్), స్టెంట్స్, థైరాయిడ్ సమస్యలు, డయాబెటిస్, హార్మోన్ల అసమతుల్యత మలబద్దకం వలన కూడా మూత్ర మార్గం ఇన్ఫెక్షన్లు క లుగుతాయి.
లక్షణాలు: రోగికి తరచు జ్వరం, కడుపు నొప్పి వస్తుంది. ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నప్పుడు కడుపునొప్పి గజ్జలలోకి, అటుపైన తొడల వరకు కూడా పాకుతుంది. కొన్ని సందర్భాల్లో మూత్రంలో చీము, రక్తం కూడా పడుతుంటాయి. ఆకలి మందగించటం, ఒళ్ళు నొప్పులు, నీరసంతో పాటు మూత్రవిసర్జన సమయంలో విపరీతమైన మంట వంటి సమస్యలూ ఉంటాయి.
జాగ్రత్తలు: వ్యక్తిగత శుభ్రత పాటించ డం, ఎక్కువ నీరు తాగటం, మూత్రాన్ని నియంత్రించకుండా ఉండటం, కృత్రిమ గర్భనిరోధక సాధనాలు వాడేటప్పుడు జాగ్రత్త వహించడం, మలబద్ధకం లేకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తల ద్వారా ఈ వ్యాధి కలగకుండా నియంత్రించుకోవచ్చు.
హోమియో చికిత్స: హోమియోకేర్ ఇంటర్‌నేషనల్‌లో జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా వ్యాధి లక్షణాలతో పాటు రోగి మానసిక, శరీర సమస్యలను పరిగణనలోకి తీసుకుని, రోగనిరోధక శక్తిని ప్రేరేపించడం వల్ల ఇన్ఫెక్షన్ తాలూకు సమస్యలు సంపూర్ణంగా పరిష్కరించబడతాయి. మీరు వెంటనే మంచి హోమియో నిపుణుని సంప్రదించండి.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
ఫౌండర్ చైర్మన్
హోమియోకేర్ ఇంటర్నేషనల్
హైదరాబాద్
న్యూరో కౌన్సెలింగ్
మా అమ్మకు 60 ఏళ్లు. తనకు కుడికాలు, చెయ్యి విపరీతంగా కొట్టుకుంటోంది. నిద్రపోయినప్పుడే అవి ఆగుతున్నాయి. మళ్లీ మెలకువ వచ్చినా ఆపలేనంతగా కొట్టుకుంటున్నాయి. పరిష్కారం చెప్పండి. - నవనీతమ్మ, గూడూరు
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ అమ్మగారు హెమీబాలిస్మస్ అనే జబ్బుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఉన్నవారిలో ఒక పక్క కాలు, చేయి ఆపలేనంతగా కొట్టుకుంటాయి. ఈ జబ్బు సాధారణంగా మెదడులో రక్తనాళం ముసుకుపోయి, నరాల కణాలు దెబ్బతినడం వల్ల వస్తుంది. మెదడులోని కణుతుల వల్ల కూడా రావచ్చు. మెదడులో రక్తస్రావం జరిగినా కూడా ఇది రావచ్చు. కొంతమంది డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో షుగర్ ఎక్కువగా కూడా ఇలా జరగవచ్చు. వీటిల్లో ఏ కారణం వల్ల మీ అమ్మగారికి ఇలా జరిగిందో రక్తపరీక్షల ద్వారానూ, బ్రెయిన్ స్కాన్ ద్వారానూ తెలుసుకోవచ్చు. కారణం తెలుసుకొని సరైన మందులు వాడటం ద్వారా మీ అమ్మగారి జబ్బును నయం చేయవచ్చు.
నా వయసు 60 ఏళ్లు. నాకు పక్షవాతం వచ్చి నాలుగేళ్లు అయ్యింది. గత నెల రోజులుగా ఫిట్స్ వస్తున్నాయి. డాక్టర్ గారికి చూపిస్తే పెద్దాసుపత్రికి వెళ్లమని చెప్పారు. నాకు సరైన సలహా ఇవ్వగలరు. - అప్పారావు, విశాఖపట్నం
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ఇస్కిమిక్ సీజర్స్ అనే ఫిట్స్‌తో బాధపడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఒకసారి పక్షవాతం వచ్చినవారిలో ఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు సీటీస్కాన్, ఈఈజీ పరీక్షలు చేయించుకొని, కొన్ని కార్బమైజిపైన్ అనే మందు వాడటం ద్వారా ఫిట్స్‌ను తగ్గించవచ్చు. అయితే మీరు కనీసం మూడేళ్ల పాటు ఇది వాడాల్సి ఉంటుంది. కొంతమందికి జీవితాంతం కూడా వాడాల్సి రావచ్చు.
డాక్టర్ మురళీధర్ రెడ్డి
కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్
కేర్ హాస్పిటల్, బంజారా హిల్స్, హైదరాబాద్
అనీమియా కౌన్సెలింగ్
మా పాప వయసు పదకొండేళ్లు. గత మూడు నెలలుగా రక్తహీనతతో బాధపడుతోంది. దీనికి కారణాలు, లక్షణాలతో పాటు రక్తహీనత రాకుండా జాగ్రత్తలు తెలపండి. - సౌజన్య, ఒంగోలు
మన శరీరంలో రక్తం ఎర్రగా ఉంటుంది. దీనికి కారణం అందులోని హీమోగ్లోబిన్ అనే పదార్థం. ఒకవేళ హీమోగ్లోబిన్ తగ్గితే రక్తహీనతతో బాధపడుతున్నట్లు పరిగణించవచ్చు. రక్తహీనత (అనీమియా)కు గురైన వ్యక్తికి రక్తంలోని ఎర్రరక్తకణాల సంఖ్య (రెడ్ బ్లడ్ సెల్స్ లేదా ఆర్‌బీసీ లేదా ఎరిథ్రోసైట్స్) సంఖ్య తగ్గిపోతుంది. రక్తపరీక్ష ద్వారా రోగి రక్తంలో ఎర్ర రక్తకణాలు ఎన్ని ఉన్నాయన్న విషయం తెలుస్తుంది. రక్తహీనత ఉన్న వ్యక్తిలో అవసరమైన స్థాయిలో ఎర్రరక్తకణాలు ఉండవు. ఫలితంగా శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందదు. దీనివల్ల రోగి అలసటగా ఫీల్ కావడం జరుగుతుంది. రక్తహీనత తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో శ్వాసతీసుకోవడం కూడా కష్టమవుతుంది.
రక్తహీనత ముఖ్యంగా మూడు కారణాల వల్ల వస్తుంది. అవి...
1) పౌష్టికాహారలోపం - ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు (తోటకూర, గోంగూర) బెల్లం, మాంసాహారంలోనూ ఎక్కువగా ఉంటాయి. అవి తగినంతగా తీసుకోకపోవడం.
2) రక్తం నష్టపోతుండటం - స్త్రీలలో రుతుస్రావం వల్ల, పిల్లల కడుపుల్లో నులి పురుగుల వంటి క్రిములు ఉండటం వల్ల.
3) రక్తం తయారీలో అవరోధం - ఏవైనా జబ్బుల (ఉదాహరణకు మలేరియా) వల్ల రక్తంలోని ఎర్రరక్తకణాలు ధ్వంసం అయి మరల పెరగకపోవడం. దీంతో రక్తం తయారవ్వక రక్తహీనత కనపడుతుంది.
లక్షణాలు : తీవ్రమైన నిస్సత్తువ, సాధారణ పనులకే ఆయాసం రావడం, నాలుక, కనురెప్పల లోపలి భాగాలు పాలిపోవడం, అలసట, చికాకు, ఆకలి లేకపోవడం, మైకం, కళ్లు తిరగడం, అరచేతుల్లో చెమట, చేతుల గోళ్లు వంగి గుంటలు పడటం, పాదాలలో నీరుచేరడం, చిన్నపిల్లల్లో అయితే చదువులో అశ్రద్ధ, ఆటల్లో అనాసక్తి.
అనీమియాను అధిగమించడం ఇలా : తాజా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం రక్తహీనత నివారణకు సులభమైన మార్గం. బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరం, మాంసం, కాలేయం వంటి పదార్థాలలో కూడా ఇనుము పుష్కలంగా ఉంటుంది. రోజూ తీసుకునే ఆహారంలో మొలకెత్తిన పప్పు ధాన్యాలు, విటమిన్-సి పాళ్లు ఎక్కువగా ఉండే నిమ్మ, ఉసిరి, జామ లాంటివి కలిపి తీసుకోవడం వల్ల కూడా రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు.
డాక్టర్ శైలేశ్ ఆర్ సింగీ
సీనియర్ హిమటో
ఆంకాలజిస్ట్, బీఎమ్‌టీ స్పెషలిస్ట్, సెంచరీ
హాస్సిటల్స్, హైదరాబాద్