పి.పి.ఎఫ్ చిలకరించండి... మొలకలేస్తుంది
ఉమన్ ఫైనాన్స్
మహిళలు అతి తక్కువ మొత్తంతో తక్కువ రిస్క్‌తో కూడిన సాంప్రదాయిక దీర్ఘకాలిక పెట్టుబడి మార్గాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పి.పి.ఎఫ్.) ఒకటి. దీని గురించి తెలుసుకుందాం. పి.పి.ఎఫ్ స్కీమును మన దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ వారు 1968లో పన్ను మినహాయింపు పథకంగా ప్రవేశపెట్టారు. ప్రజల్లో పొదుపును ప్రోత్సహించి వాటి ద్వారా రిటైర్‌మెంట్ సమయానికి తగిన మొత్తాన్ని ఏర్పరచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
పి.పి.ఎఫ్. ఖాతాను ప్రారంభించాలంటే ...
భారతదేశంలో నివాసం ఉంటూ కనీసం 18 సం॥వయస్సు కలవారై ఉండాలి. ఎన్.ఆర్.ఐ.లు, హెచ్.యు.ఎఫ్.లు ఈ ఖాతాను ప్రారంభించడానికి వీలు కాదు. అలాగే దీనిని జాయింట్ అకౌంట్‌గా తెరవలేము. ఒకవేళ ఎవరైనా ఖాతాను ప్రారంభించిన తర్వాత వారు ఎన్.ఆర్.ఐ. అయితే వారి ఖాతా 15 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత క్లోజ్ చేయడం జరుగుతుంది. పొడిగించడానికి వీలుపడదు. పి.పి.ఎఫ్. ఖాతాను పోస్ట్ ఆఫీసు వారు, బ్యాంకులు తమ నిర్ణీత శాఖలలో అందజేస్తున్నాయి.ఖాతాను ప్రారంభించడానికి 100 రూపాయలు కట్టవలసి ఉంటుంది. కనీస మొత్తంగా 500 రూపాయలు జమ చేయాలి.ఖాతా తెరిచాక సంవత్సరానికి రు.500 మొదలుకొని రూ.1,50,000 వరకు ఒక్కసారైనా జమ చేయాలి. ఒకవేళ జమ చేయకపోతే ఖాతా ‘ఇన్ యాక్టివ్’లోకి మారుతుంది. మళ్లీ యాక్టివ్ చేయాలంటే జమ చేయవలసిన కనీస మొత్తంతో పాటు 50 రూపాయల జరిమానాను చెల్లించవలసి ఉంటుంది.ఖాతా ఇన్‌యాక్టివ్‌లో ఉన్నప్పుడు వడ్డీ వర్తించదు.
{పస్తుతం పి.పి.ఎఫ్. ఖాతాలో ఉన్న మొత్తానికి ఏడాదికి సుమారు 8.7 శాతం చొప్పున చక్రవడ్డీని అందజేస్తున్నారు. వడ్డీరేటును ప్రతి సంవత్సరం ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.వడ్డీని ప్రతి సంవత్సరం మార్చి 31వ తేదీన ఖాతాకు జమ చేస్తారు. పి.పి.ఎఫ్. ఖాతాకు మీరు జమ చేసేటప్పుడు ఏ నెలైనా కానీ 1వ తేదీ నుండి 5వ తేదీ లోపు జమ చేయండి. ఒకవేళ 5 తర్వాత జమ చేసినట్లయితే ఆ నెలకు ఆ జమ చేసిన మొత్తానికి వడ్డీ రాదు. తర్వాతి నెల నుండి మాత్రమే వడ్డీని లెక్క కడతారు.ఈ ఖాతాను మైనరు పేరు మీద కూడా తల్లిదండ్రులు లేదా గార్డియన్ ప్రారంభించవచ్చు.ఒకసారి ఖాతాను ప్రారంభించిన తర్వాత, వెంటనే క్లోజ్ చేయడానికి వీలుండదు. 15 సంవత్సరాల తర్వాత మాత్రమే క్లోజ్ చెయ్యడానికి వీలవుతుంది. కనుక ప్రతి సంవత్సరం తప్పని సరిగా కనీస మొత్తాన్ని జమ చేయడం మంచిది.15 సంవత్సరాల తర్వాత కూడా ఖాతాని పొడిగించదలచుకుంటే మరో 5 సంవత్సరాలు పొడిగించుకునే వెసులుబాటు ఉంది.ఖాతా ప్రారంభించిన 7వ సంవత్సరం నుండి కొంత మేర డిపాజిట్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే సౌలభ్యం ఉంది. ఇందులో సమకూరే మొత్తానికి నామినీని కూడా నమోదు చేసుకోవచ్చు.ఖాతాని ప్రారంభించిన 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు లోన్ తీసుకునే సదుపాయం ఉంది. ఖాతాలో జమ చేసే మొత్తాన్ని డబ్బు, చెక్, డి.డి., ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ రూపంలో జమ చేయవచ్చు.
ఖాతా ప్రయోజనాలు
ప్రతి సంవత్సరం పి.పి.ఎఫ్. ఖాతాలో మీరు జమ చేసే మొత్తానికి సెక్షన్ 80 సి కింద రూ.1,50,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఒకవేళ మీరు మైనర్ ఖాతాలో కూడా జమ చేసి ఉంటే మైనరు ఖాతా, మీ ఖాతా కలిసి రూ.1,50,000 మించకూడదు.వడ్డీకి కూడా పన్ను భారం పడదు.మెచ్యూరిటీ సమయానికి ఈ ఖాతా ద్వారా లభించే మొత్తానికి కూడా పన్ను వర్తించదు.అలాగే ఈ ఖాతాలోని మొత్తానికి కోర్టు ఎటాచ్‌మెంట్ వర్తించదు. అంటే మీరు ఒకవేళ రుణభారంతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ రుణమాఫీకి మీ పి.పి.ఎఫ్. ఖాతాలోని మొత్తాన్ని మాఫీకి వాడేందుకు వీలుండదు.ఏ వ్యక్తై చిన్న మొత్తంలో ప్రతి నెల క్రమం తప్పకుండా ఈ పథకంలో పెట్టే పెట్టుబడి దీర్ఘకాలం కొనసాగించినట్లయితే వారికున్న.. పిల్లల ఉన్నత విద్య, పెళ్లి, ఇల్లు కట్టుకోవడం, రిటైర్‌మెంట్.. వంటి భారీ లక్ష్యాలను చేరుకోవడం సులభతరం అవుతుంది. పొదుపు మదుపు పథకాలు కొన్నిట్లోనయినా ఈ పథకంలో ఉన్నట్లు ‘లాక్-ఇన్’ లేనట్లయితే నిధిని సమకూర్చుకోవడం కష్టతరం అవుతుంది. కాబట్టి చిన్న, మధ్య తరగతి కుటుంబాలకు ఈ పి.పి.ఎఫ్ ఒక చక్కటి పథకంగా ఉపయోగపడుతుంది.