మహిళలకు నిత్యం వేధింపులే! | Women are eternal torture | Sakshi
Sakshi News home page

మహిళలకు నిత్యం వేధింపులే!

Mar 8 2018 12:49 AM | Updated on Jul 23 2018 9:11 PM

Women are eternal torture - Sakshi

అక్కినేని అమల

ఇటీవల ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడానికి విశాఖపట్నానికి వెళ్లగా అక్కడ తన వ్యక్తిగత స్వేచ్ఛ(ప్రెవేట్‌ స్పేస్‌)కు భంగం కలిగే విధంగా కొందరు ప్రవర్తించారని ప్రముఖ సినీ నటి, బ్లూ క్రాస్‌ సంస్థ వ్యవస్థాపకురాలు అక్కినేని అమల ఆవేదన వ్యక్తం చేశారు. చాలా కాలం తర్వాత తన వ్యక్తిగత స్వేచ్ఛపై దాడి జరిగిందని, తీవ్ర ఆగ్రహాన్ని, ఆవేదనను కలిగించిందన్నారు. ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛకు విలువ ఇచ్చే విజ్ఞత దేశంలో కరువైందన్నారు. ఒకరి ప్రెవేట్‌ స్పేస్‌లోకి వెళ్లి బాధ కలిగించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. సెలబ్రిటీలైన తాము ఎక్కడికి వెళ్లినా జన సందోహం ఉంటుందని, జనం అత్యంత సమీపంగా వచ్చి భౌతిక వేధింపులకు గురి చేస్తారని తెలిపారు. నిత్యం చాలా మంది సెలబ్రిటీలు ఈ వేధింపులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కేవలం భౌతికంగానే కాకుండా మానసికంగా, భావోద్వేగ పరంగా సైతం వేధింపులుంటా యని,  24 గంటల పాటు నలువైపులా నుంచి వీటిని ఎదుర్కోక తప్పదన్నారు. దీంతో జీవితంలో తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మహిళాభ్యున్నతికి సాక్షి చేపట్టిన ‘నేను శక్తి’ ఉద్యమం ముగింపు సందర్భంగా బుధవారం ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చిన్న పిల్లలు, మహిళలతో ప్రతి ఒక్కరి ప్రెవేట్‌ స్పేస్‌ను గౌరవించాలని ఆమె పిలుపునిచ్చారు.

మహిళల కోసం నేను శక్తి అక్షర ఉద్యమాన్ని చేపట్టినందుకు సాక్షి గ్రూపుకు, సంస్థ చైర్మెన్‌ వైఎస్‌ భారతీరెడ్డికి అభినందనలు తెలిపారు. నేను శక్తి శీర్షిక పేరు ఎంతో అందంగా ఉందని అభినందించారు. విద్యా, ఆర్థిక స్వాతంత్య్రంతోనే మహిళలు వేధింపులు, గహ హింస, లింగ వివక్ష నుంచి బయటపడగలరని, సాధికారత సాధించగలరని ఐక్యరాజ్య సమితి పేర్కొందని గుర్తు చేశారు. విద్యతోనే ఉద్యోగ, ఉపాధి అకవాశాలు లభిస్తాయని, అప్పుడే ఆర్థిక స్వాతంత్య్రం సాధించగలమన్నారు. వృత్తి జీవితంలో గొప్ప విజయాలు సాధించిన మహిళలు ఇతర మహిళల అభివృద్ధికి విస్తృత కషి చేయాలని పిలుపునిచ్చారు. 15 ఏళ్ల కిందే నటన వృత్తికి స్వస్తి చెప్పిన తాను ప్రస్తుతం బ్లూ క్రాస్‌ సంస్థ ద్వారా జంతువుల హక్కులు, ప్రధానంగా వీధి కుక్కల సంతానోత్పత్తిని నిరోధించేందుకు పని చేస్తున్నానన్నారు. తన మామ అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన అన్నపూర్ణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఫర్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా సంస్థకు డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నానని తెలిపారు. సినిమాలు, సీరియళ్ల నిర్మాణానికి ఎలాంటి అర్హతలు అవసరం లేవని, అందుకే వాటిలో మహిళలను చిత్రీకరించే విధానం సరిగ్గా ఉండదన్నారు. సమాజానికి దిశానిర్దేశం చేసే ఈ కీలక రంగంలో ప్రవేశించేందుకు ఎలాంటి అర్హతలు అక్కర్లేని పరిస్థితి ఉందని గుర్తించిన తన మామ అక్కినేని నాగేశ్వరరావు దూరదృష్టితో ఈ శిక్షణ సంస్థను నెలకొల్పారన్నారు. శిక్షణ ద్వారా రైటర్లు, డైరెక్టర్లు, సినిమాటోగ్రాఫర్లకు దిశానిర్దేశం చేస్తే సినిమాలు మెరుగవుతాయని అక్కినేని నాగేశ్వరరావు భావించా రన్నారు.  మహిళలను కించపరిచే విధంగా చిత్రీకరించవద్దని ఈ శిక్షణ సంస్థ ద్వారా భవిష్యత్తు నటులు, సాంకేతిక నిపుణులకు మనస్తత్వ, సామాజిక బాధ్యత అంశాలపై శిక్షణ అందిస్తున్నామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement