
ప్రతీకాత్మక చిత్రం
‘సింగ్‌పూర్ అనగానే నాకు అందమైన అనుభవం సినిమా గుర్తుకొస్తుందండీ. బాలూ రాగం తీసి పాడుతాడు చూడండి... అందమైన’ అని గ్యాప్ ఇచ్చి ‘అనుభవం’ అన్నాడు. నవ్వుతుందేమోనని చూశాడు.లేదు. ‘దాంట్లో రజనీకాంత్‌కు పిల్లిగడ్డం ఉంటుంది. అతని గర్ల్‌ఫ్రెండ్ నీ గడ్డమంటే నాకు చాలా ఇష్టం అనగానే అవునా అయితే తీసుకో అని పీకి చేతిలో పెడతాడు. భలే ఫన్నీ’ నవ్వాడు. నవ్వలేదు. సింగపూర్‌లో ఎనిమిది గంటలు ఉండాలి. అంతసేపూ ఎయిర్‌పోర్ట్‌లో బోర్ అని టూ అవర్స్ ఫ్రీ టూర్ ఏర్పాటు చేస్తే రోడ్ల మీద పడ్డారు. ఈవిడది పక్కసీటు. ఎక్కినప్పటి నుంచి అదో మాదిరిగా ఉంది.మేల్కొంటుంది. నిద్రపోతుంది. మేగజీన్ తిరగేస్తుంది. అంతలోనే విండోవైపు తల తిప్పుకుని కళ్లు తుడుచుకుంటుంది. ఇండియా దాకా ఇదే తంతు నడిచిందంటే బోరైపోతాడు. అందుకే మాటల్లో దింపుదామని చూస్తున్నాడు. ఎవడో గౌన్లు అమ్ముతున్నాడు. పూలుపూలుగా బావున్నాయి.
ఆగి రెండు కొంటూ అన్నాడు– ‘నాకు ఇద్దరు ఆడపిల్లలండీ తీసుకుంటున్నా. అమెరికాకు తిరిగి వెళ్లాక ఇస్తే చాలా సంతోషపడతారు. చిన్నదైతే ఢిష్యుం ఫైటరే అనుకోండి. నా దగ్గర భలే చనువు’పక్కకు తిరిగి విపరీతంగా వెక్కుతూ ఉంది.‘చూడండి. మీరెవరో నేనెవరో. ప్రయాణంలో కలిశాం. మళ్లీ ఎప్పటికీ కలవం. కనుక మీకేదైనా బాధ ఉంటే నాతో చెప్పండి. అమెరికాలో చచ్చినా మీ ఇంటికి రాను. మా ఇంటికి పిలువను. సరేనా?’హ్యాండ్ కర్చీఫ్‌తో కళ్లు తుడుచుకుంది.‘పాప గుర్తుకొస్తోంది’‘ఎన్నేళ్లు’‘మూడు’‘వదిలేసి వచ్చారా? ఏం పర్లేదండీ. పిల్లలు అడ్జస్ట్ అవుతారు. మళ్లీ వెళ్లేలోపు మీరిలాగే ఏడుస్తుంటే బరువు మూడు కిలోలు తగ్గుతారు’‘మళ్లీ వెళ్లను’‘అదేంటీ?’‘నేను నా భర్తనూ పాపనూ వదిలేసి శాశ్వతంగా ఇండియా వెళ్లిపోతున్నాను’ ఇది కొంచెం కాఫీ తాగుతూ మాట్లాడాల్సిన సంగతే అనిపించింది. బస్సు మీ ఇష్టంరా రేయ్ తిరిగేసి రండి అన్నట్టు హాల్ట్ అయ్యింది. అక్కడే కాఫీ షాప్ ఉంటే తీసుకెళ్లాడు. ఇద్దరూ ఎదురూబొదురూ కూర్చున్నారు. కొంచెం ఈజ్ చేయడానికి అన్నాడు–‘అమెరికా అన్నాక ఏవో ఒక ఇష్యూస్ ఉండనే ఉంటాయండీ. ఇప్పుడు మా ఆవిడ ఉంది. ఇద్దరు చిన్నపిల్లలు. వాళ్లను చూసుకుంటూ ఉద్యోగం చేయాలంటే మహా అవస్థ. ఆరునెలలు మా అమ్మానాన్నలు ఆరునెలలు వాళ్ల అమ్మానాన్నలు వస్తే ఉంటే చేసి పెడతారు. రెండోది కడుపులో ఉండగా ఉద్యోగం మానేస్తాను అని అంది. వద్దు అని చెప్పాను. ఇంత దూరం వచ్చింది సంపాదించి బాగుపడటానికే కదండీ. ఒళ్లు వొంచాల్సిందే. ఫలితంగా ఏవో చికాకులు నడుస్తూనే ఉంటాయ్. మీ సంగతి?’ మౌనంగా ఉంది.
‘కొంపదీసి అదే కేసా. ఉద్యోగం చేయనన్నారా?’ ‘చేస్తానన్నాను’ ‘చదువు సరిపోలేదా. డిగ్రీపాటి చదువైనా చదివారా?’ సూటిగా చూస్తూ అంది ‘అయామ్ ఏ డాక్టర్’ ‘ఓ’ ‘కాని ప్రస్తుతం హోమ్‌మేకర్‌ని. చదివిన చదువును సద్వినియోగం చేయమని ఓత్ తీసుకుంటారు మా చేత. కాని పెళ్లినాటి ప్రమాణాల్లో అది కొట్టుకుపోయింది. మా వారికి నేను ఉద్యోగం చేయడం ఇష్టం లేదు.’ ‘చిత్రంగా ఉందే’ ‘నేనిక్కడ మెడికల్ కోర్సు చేయాలనుకున్నాను. ఈ సంబంధం ఓకే అనడానికి అది కూడా ఒక కారణం. చేద్దూలే చేద్దూలే అంటాడు. పాప పుట్టనీలే అంటాడు. మూడేళ్లు రానీలే అంటాడు. మొత్తానికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదని మాత్రం అనడు’ ‘ఎంచేత?’ ‘ఇండియాలో అతనికి ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. కనుక ఇద్దరు వదినలు కూడా ఉంటారు. వాళ్లు బాగా చదువుకున్నారు. ఇంట్లో వుండి చక్కటి వంటలవీ చేస్తూ ఉంటారు. బాగా చదివి ఇంట్లో ఉంటూ వంట చేసి పెట్టే భార్యలు ఉండటం మర్యాదే కదా. తనకూ అలాంటి మర్యాద కావాలని నా భర్త కోరిక. నా భార్య మెడిసిన్ చేసిందోయ్ అని చెప్పుకోవాలి. సాయంత్రం ఇంటికి రాగానే జీడిపప్పు పకోడీ చేసి పెట్టాలి. బాగుంది కదూ’ ‘ఊ’ ‘అసలు సంగతి అది కాదు. సాఫ్ట్‌వేర్‌లో ఎంతొస్తాయో మీకు తెలియదా. నేను ఉద్యోగంలో చేరితే డాక్టరుగా అంతకంటే ఎక్కువ సంపాదించగలను. భార్యకు తన కంటే ఎక్కువ సంపాదన ఉండటం భర్తకు నచ్చదు. తక్కువ సంపాదించాలి. భర్త మీద డిపెండెంట్‌గా ఉండాలి. అప్పుడు సెక్యూరిటీ ఫీలవుతాడు. కష్టపడి చదువుకుని మంచి డాక్టర్నయ్యానండీ నేను. ఓ పాతికేళ్లైనా పని చేయగలను. అది కాదు... మెడిసిన్ అంటే ప్రాణాలు కాపాడే నోబెల్ ఫ్రొఫెషన్’... ఉద్వేగంతో ఆగింది.
‘తుప్పు ఇనుముకు పట్టాలి. మనిషికి కాదు. అందుకే వెళ్లిపోతున్నాను’ అంది. బస్సు కదలబోతున్నట్టు అర్థమైంది. వచ్చి ఎక్కేశారు. ఇండియాకు వెళ్లబోయే ఫ్లయిట్‌లో ఇద్దరికీ పక్కపక్క సీట్లు రాలేదు. కనుక మాట్లాడటం కుదరలేదు. హైదరాబాద్‌లో దిగాక క్యూలో తారసపడ్డారు. పలకరింపుగా నవ్వుతూ అన్నాడు– ‘మీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. నాకు మీ ఆయనెందుకో మంచివాడు కాదనిపిస్తోంది’ చురుగ్గా చూసింది. ‘మీరు మంచివారేనా’ ‘మీకలా అనిపించలేదా?’ ‘మంచివారే. మా ఆయన కూడా మంచివాడే. భార్యను అపురూపంగా చూసుకుంటూ ఒక్క మాట అనకుండా ఒక్క పోట్లాట పెట్టుకోకుండా చాలా బాగా చూసుకునే మంచివాడు. కాని ఉద్యోగం వద్దంటే మీరు మీ ఆవిడ చేత చేయిస్తున్నారు. చేస్తానంటే నా భర్త నాతో వద్దంటున్నాడు. మీ ఇద్దరిలో కామన్ పాయింట్ ఏమిటో తెలుసా?’ ‘ఏంటి?’‘ఇద్దరు మగాళ్లు. అందరిలాంటి మగాళ్లు’ తిరిగి చూడకుండా ఉక్రోషం పెల్లుబికుతుండగా బయటకు నడిచింది. కథ ముగిసింది. సాయి బ్రహ్మానందం గొర్తి రాసిన ‘అతను’ కథ ఇది. తాను మంచివాణ్ణి అనుకునే మగాడు ఎంత మంచివాడో చెక్ చేసుకుంటాడా ఎప్పుడైనా. తన అహానికి, ఆధిక్యానికి, సౌలభ్యానికి ఆటంకం రానంత వరకు తల్లితో, చెల్లితో, భార్యతో, ఆఫీస్‌లో లేడీ కలీగ్‌తో మంచితనంలో ఎంతదూరమైనా వెళతాడు. కాని వాటికి భంగం వాటల్లితే సమంజసమైన కారణాలను కూడా తిరస్కరించి చేతికి మట్టంటకుండా నస పెట్టడంలోనూ సిద్ధహస్తుడు. ఒళ్లు శుభ్రం చేసే సబ్బు ఉన్నట్టు మగ స్వభావాన్ని శుభ్రం చేసే సబ్బు కూడా దొరికితే బాగుంటుందంటారా?
పునః కథనం: ఖదీర్
-సాయి బ్రహ్మానందం గొర్తి
Comments
Please login to add a commentAdd a comment