బోర్డర్‌ బోర్డర్‌ | women empowerment : special on Woman advocate | Sakshi
Sakshi News home page

బోర్డర్‌ బోర్డర్‌

Published Thu, Feb 15 2018 12:41 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM

women empowerment :  special on Woman advocate - Sakshi

మహిళా అడ్వకేట్‌

ఉదయాన్నే తయారై.. చీర సవరించుకుని సజావుగా నల్ల కోటు వేసుకుని అద్దం ముందు నిలబడింది. అబ్బ! అచ్చం న్యాయం నిలబడినట్లే ఉంది! కానీ అద్దంలో.. తన చుట్టూ కంచె కనబడింది! తను ఆ బోర్డర్‌ను దాటగలదా? ‘ఆర్డర్‌..ఆర్డర్‌.. అడ్డు తొలగండి’ అనే జడ్జిగారి ఆదేశాన్ని ఎప్పటికైనా తను వినగలదా? లేక.. మహిళా అడ్వకేట్‌లు సమన్యాయానికి బోర్డర్‌లోనే ఉండిపోతారా?

స్వాతంత్య్ర సంగ్రామంలో ముందు నిలిచిన మహిళలెందరో న్యాయవాదులేనని  చదివి, న్యాయవాదిగా ఉంటే ఎవరికీ లొంగి ఉండాల్సిన అవసరం ఉండదనీ  న్యాయవాద వృత్తిలోనికి అడుగుపెట్టాను. నిజం చెప్పాలంటే సెల్ఫ్‌ రెస్పెక్ట్‌ కోసమే  ఈ వృత్తిని ఎంచుకున్నాను. కానీ నాది రాంగ్‌ ఇంప్రెషన్‌ అని త్వరలోనే అర్థం అయ్యింది!

నన్ను చిల్లర లాయరన్నారు. బీదాబిక్కీ కేసులు తప్ప ఈమెకెవరిస్తారు కేసులన్నారు. అసలు ఈ ప్రొఫెషన్‌ నుంచే తరిమికొట్టాలనుకున్నారు. ఎక్కడైతే అవమానాలు ఎదుర్కొన్నానో అక్కడే తలెత్తుకొని నిలబడ్డాను. నాకు పొలిటికల్‌ సపోర్ట్‌లేదు. నా తాత ముత్తాతలెవరూ న్యాయమూర్తులు కారు. న్యాయవాదులూ కారు. నాకు నేనుగా ఈ వృత్తిలోకి అడుగుపెట్టాను.హైకోర్టులో ప్రాక్టీసు మొదలుపెట్టాక కానీ నాకర్థం కాలేదు. న్యాయవాద వృత్తిలో ఆడవాళ్లు కొనసాగడమంటే మగ లాయర్లకి అసిస్టెంట్స్‌గానే కొనసాగాలి తప్ప స్వతంత్రంగా ఎదగనివ్వరని.  ఎన్నేళ్లయినా ఆడవాళ్లు అక్కడ జూనియర్స్‌గానే ఉంటారు తప్ప వారికన్నా మేం అద్భుతంగా కేసులు వాదించగలమనీ, మాకు టాలెంట్‌ ఉందనీ వారు గుర్తించరు. కాదు గుర్తించనట్టు నటిస్తారు. అసలు మా సీనియర్స్‌ మాదాకా కేసులు రానివ్వరు.

నోట్స్‌ నాది.. వాదన వేరొకరిది!
అలాంటి మేల్‌ డామినేటెడ్‌ వ్యవస్థలో నాకు నేనుగా ఎదిగేందుకు ఎంత కష్టపడ్డానో చెప్పలేను! ఈ ప్రొఫెషన్‌లోకి వచ్చిన కొత్త లోనే మా బాస్‌ అప్పజెప్పిన కేసుని ఇంటికి తెచ్చుకునేదాన్ని. ఇంట్లో పని ముగించుకుని అంతా నిద్రపోయాక రాత్రంతా మేల్కొని ఉండి, కేసు వివరాలు చదివి ప్రతి విషయాన్ని నోట్స్‌ రాసుకుని అరటిపండు ఒలిచి ఇచ్చినంత సులభంగా కేసుని విడమర్చి నా సీనియర్‌ ముందు పెట్టేదాన్ని. దాన్ని నా సీనియర్‌ వాదించాల్సిందిపోయి నా నోట్స్‌ని నాలాంటి మరో మగ జూనియర్‌కిచ్చి.. ‘కేసు చాలా విపులంగా రాసి వుంది నోట్స్‌లో, నువ్వు వాదించు’ అని ఇచ్చేవాడు! కేసుగురించి ఒక్కముక్క తెలియకపోయినా నా నోట్సు తీసుకుని ఒక పురుష న్యాయవాది వాదించగలిగినప్పుడు కేసుని అమూలాగ్రం చదివిన నేను వాదించలేనా? 

నాన్‌ కో–పరేషన్‌ చేశాను
నిజానికి మా గురువుగారికి  (ప్రముఖ క్రిమినల్‌ లాయర్‌ ఆయన) నేను బాగా వాదించగలనని తెలియడానికే చాలా కాలం పట్టింది. నాకు వాదించే అవకాశం మా సీనియర్స్‌ రానిస్తేగదా నేనేం చేస్తానో తెలిసేది? అలాంటి ఒక రోజు రానే వచ్చింది. మా సీనియర్స్‌ నా వరకు కేసులు రాకుండా కట్టుదిట్టం చేశారు. అంతే. నేను నాన్‌–కోపరేషన్‌ చేశాను. హాయిగా కూర్చొని సుప్రీంకోర్టు కేసులను స్టడీ చేసేదాన్ని. ఆఫీసుకొచ్చే కేసులు చదవడం మానేశాను. అది మా బాస్‌ గుర్తించారు. ఒక రోజు సడన్‌గా మా గురువుగారు నన్ను పిలిచారు. ఓ కేసు నా ముందు పెట్టి ‘‘చదివావా ఇది?’’ అని అడిగారు. చదవలేదని చెప్పకుండా, చదువుతానని చెప్పాను. అది  ఒక మర్డర్‌ కేసు. ఆయన ఒకేసారి రెండు కేసులు వాదించాల్సి వచ్చింది. ఒక కేసు నన్ను వాదించమని అడిగారు. ఆయనకు నామీద నమ్మకమే కానీ మిగిలిన వాళ్లు కల్పించిన అపోహలు కూడా ఉంటాయి కదా. ఆనందంగా ఒప్పుకున్నాను. కేసు గెలుస్తామని ఆయన ఊహించలేదు కానీ, శిక్ష తగ్గించొచ్చని భావించారు. అయితే నేను కేసు గెలవడంతో ఆయన చాలా ఆనందించారు. గెలుపు మగాళ్లకు మాత్రమే సాధ్యం కాదని, అప్పుడే నిరూపించాను.

మొదటి కేసులో ‘చచ్చి’గెలిచాను
నేను టేకప్‌ చేసి, వాదించిన మొదటి కేసు నాకింకా గుర్తుంది. అది డబుల్‌ మర్డర్‌ కేసు. ఆ కేసులో నిందితుడి తండ్రి మా తాతగారి దగ్గర పనిచేశాడు. అతను నా దగ్గరికొచ్చి కేసు వాదించమని అడిగాడు. ‘‘ఎవరో ఒకరు వాదిస్తార్లే. నీకెందుకు. వదిలెయ్‌’’ అన్నారు మావాళ్లు. మన ఊరికి సంబంధించిన వాళ్లని మర్డర్‌ చేసిన వ్యక్తిని సపోర్ట్‌ చేస్తూ వాదిస్తే మన పరువే పోతుందన్నారు. ‘‘అయినా క్రిమినల్‌ విషయాల్లోకి నువ్వెందుకు?’’ అంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు. నాన్న కూడా.. ‘‘ఈ కేసు ఎందుకులేమ్మా’’ అని వారించారు. అయినా నేనూర్కోలేదు. ‘‘గయోపాఖ్యానం పురాణ కాలక్షేపానికా? లేక జీవితానికి అన్వయించుకోవడానికా నాన్నా?’’ అని ప్రశ్నించాను. కేసు ఒప్పుకున్నాను. శాయశక్తులూ ఒడ్డాను. అలా నా మొదటి కేసు గెలిచాను. ఆ తరువాత నాకర్థం అయ్యింది. అక్కడెవ్వరూ మనకు సపోర్ట్‌ చేయరు. మనల్ని మనమే గెలిపించుకోవాలి. నిరూపించుకోవాలి. అణిగిమణిగి ఉంటే ఫరవాలేదు. కానీ వారికి పోటీగా ఎదిగితే మాత్రం కొత్త ఆశల చిగుళ్లను నిర్దాక్షిణ్యంగా కత్తిరించేస్తారు. 

క్యారెక్టర్‌పై ముద్ర వేస్తారు
ఇక్కడ వివక్షనుంచి దూరంగా వెళ్లేందుకు ఓ నాలుగేళ్లు అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌గా Ðð ళ్లిపోయాను. నాలుగేళ్లకి మళ్లీ తిరిగొచ్చాను. ఆ తర్వాత లీగల్‌ ఎయిడ్‌ పానల్‌ మెంబర్‌ని అయ్యాను. ఇక్కడ పేదవాళ్ల పక్షాన, డబ్బులు లేని వారి పక్షాన వాదించినప్పుడు.. చిల్లర కేసులు అని హేళన. కూలినాలోళ్ల కేసులు వాదిస్తానని ఎద్దేవా చేయడం. వాళ్లు తప్ప నాదగ్గరికెవ్వరూ రారట. 2009లో మా సీనియర్స్‌తో ఈక్వల్‌గా ఫైలింగ్స్‌ వచ్చాయి. అంతే ఇండిపెండెంట్‌ అయిపోయాను.  క్రిమినల్‌ విభాగంలో ఓ మహిళ అత్యధిక కేసులు వాదిస్తే ఏమౌతుంది? వాళ్ల (పురుష లాయర్ల)కి ఒళ్లు మండుతుంది. అంతగా వినకపోతే బ్యాడ్‌ క్యారెక్టర్‌గా ముద్రవేస్తారు. ఈమె డబ్బుకోసం ఇదంతా చేస్తోందని క్యారెక్టర్‌ అసాసినేషన్‌ చేస్తారు. నాకు కేసులు ఇవ్వండి అని నేనెప్పుడూ దేబిరించలేదు. నాకు నేనుగా ఎదిగాక  క్లైంట్సే నా దగ్గరికొచ్చి వాదించమని అడిగారు. ఫలానా గాయత్రీగారైతే బాగా వాదించగలరని వారిలో నమ్మకం కల్పించగలిగాను. 

నోరెత్తడానికి లేదు!
స్త్రీలలో ఎంతో ఆంబిషన్‌ ఉంటే తప్ప పురుషాధిపత్య వృత్తుల్లోకి రారు. ఇప్పటికీ ఏ పోస్టులైనా ముందుగా వరించేది మగవాళ్లనే. స్త్రీలు అసలు అక్కడ లెక్కలోకేరారు. అడ్వకేట్‌ కమ్యూనిటీలో మహిళలు నోరెత్తడానికి లేదు. భయంకరమైన ఇన్‌జస్టీస్‌. సమన్యాయాన్ని అందించాల్సిన చోట అసమానత్వం. న్యాయాన్ని పంచాల్సిన చోట అన్యాయం. ఇది ఎవ్వరూ రాసి ఉంచరు. మాట్లాడరు. కానీ అలా అణచివేత జరిగిపోతూ ఉంటుంది అంతే.

►న్యాయవాదులుగా స్త్రీలు ఉండడమంటే రిప్రజెంటేషన్స్‌ ఇచ్చేందుకో, పాస్‌ఓవర్‌  (కేసుకి సీనియర్‌ లాయర్‌ అటెండ్‌ అవలేని పరిస్థితుల్లో వాయిదావేయమని  కోరడం)లు అడగడానికో తప్ప కేసులు వాదించడానికి పనికిరారు అన్నంతగా  ఉంటుంది వివక్ష. అలా ఎప్పటికోగానీ నాకు కేసు వాదించే అవకాశాన్ని ఇవ్వలేదు. 

అసమాన సమాజంలో ఆత్మగౌరవం కోసం ఆమె ఆరాటపడ్డారు. రాజ్యాంగ నిర్మాతలు మొదలు స్వాతంత్య్ర సంగ్రామంలో పేరుగాంచిన నేతలెందరో న్యాయవాద వృత్తిని నెరిపిన వారేనని భావించి సెల్ఫ్‌ రెస్పెక్ట్‌ కోసం న్యాయవాద వృత్తిని చేపట్టారు. కానీ అక్కడా అసమానతల అడ్డుగోడలు ఆమెను ముందుకు సాగనివ్వలేదు. అయినా ఆత్మస్థైర్యంతో నిలబడ్డారు. అన్ని అడ్డంకులనూ దాటుకుని పురుషన్యాయాన్ని సవాల్‌ చేస్తూ ఓ క్రిమినల్‌ లాయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. తన దైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం హైకోర్టులో ప్రముఖ క్రిమినల్‌ లాయర్‌గా పనిచేస్తోన్న గాయత్రీ రెడ్డి గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో చదువుకొని అసమానతల అడ్డుగోడలను తొలగించుకొని అంచెలంచెలుగా ఎదిగివచ్చిన క్రమాన్ని సాక్షితో పంచుకున్నారు.
- గాయత్రీరెడ్డి, క్రిమినల్‌ లాయర్, హైకోర్టు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement