స్త్రీలోక సంచారం | Women empowerment Womens Prisoners Act | Sakshi
Sakshi News home page

స్త్రీలోక సంచారం

Published Wed, Jun 27 2018 12:56 AM | Last Updated on Mon, Jul 23 2018 8:51 PM

Women empowerment Womens Prisoners Act - Sakshi

విచారణలో ఉన్న మహిళా ఖైదీలు కనుక, చట్టం వారికి విధించేందుకు అవకాశం ఉన్న శిక్షాకాలంలో కనీసం మూడింట ఒక వంతు పూర్తి చేసుకుని ఉంటే వారికి బెయిలు ఇచ్చేందుకు వీలుగా ‘కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌’లోని సెక్షన్‌ ‘436ఎ’ లో సవరణలు చేయాలని కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ ప్రతిపాదనలు తయారు చేసింది. ‘జైళ్లలో మహిళలు’ అనే అంశంపై తమ శాఖ రూపొందించిన నివేదికలోని మరికొన్ని కీలకమైన ప్రతిపాదనలను కూడా పరిశీలన నిమిత్తం స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మనేకా గాంధీ త్వరలోనే హోమ్‌ శాఖకు పంపించనున్నారు ::: నిబంధనలు ఉల్లంఘించి, చట్ట విరుద్ధంగా అబార్షన్‌లు చేస్తూ ప్రాణాలను హరిస్తున్న గుర్తింపు లేని ‘వైద్యుల’పై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ‘జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌’ ర్యాలీలు నిర్వహిస్తోంది. ‘ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌’ (ఐఎంఏ) కూడా వీరికి మద్దతు ఇవ్వడంతో రాష్ట్రంలోని నర్సింగ్‌ హోమ్‌లు, స్కానింగ్‌ సెంటర్‌లపై అధికారుల మెరుపుదాడులు మొదలయ్యాయి ::: రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజే చెవిలో జోరీగలా తయారైన బీజేపీ తిరుగుబాటు నాయకుడు గుణశ్యామ్‌ తివారీ.. రాష్ట్రంలో, కేంద్రంలో రెండు చోట్లా అప్రకటిత ఎమర్జెన్సీ అమలులో ఉందని ఆరోపిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. రాజే అవలంబిçస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల రాష్ట్ర పరిస్థితి దైన్యంగా తయారైందని ఆయన విమర్శలు గుప్పించారు ::: ‘డి’ విటమిన్‌ లోపం వల్ల భారతీయ మహిళలు స్థూలకాయులు అవుతున్నారని   బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌ ప్రకటించింది. 

ఇండియాలో 68.6 శాతం మహిళలకు డి విటమిన్‌ లోపం ఉండగా, 26 శాతం మందికి సరిపడినంత ఉండడం లేదని, కేవలం 5.5 శాతం మంది మహిళల్లో మాత్రమే డి విటమిన్‌ లోపం లేదని తెలిపింది ::: హైదరాబాద్‌లో జన్మించిన ప్రవాస భారతీయురాలు, సివిల్‌ ఇంజనీరు అరుణా మిల్లర్‌.. యు.ఎస్‌. దిగువ సభకు ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేరీలాండ్‌ నుంచి పోటీ చేసిన అరుణ (53) విజయం సాధిస్తే కనుక, వాషింగ్టన్‌ రాష్ట్రం నుంచి సభలోకి ప్రవేశించిన ప్రమీలా జయపాల్‌ తర్వాత ఈ ఘనతను సాధించిన రెండో భారతీయ మహిళగా రికార్డు నెలకొల్పుతారు ::: మహిళలకు ఇండియా అత్యంత ప్రమాదకరమైన దేశం అని లండన్‌లోని ‘థాంప్సన్‌ రాయిటర్స్‌ ఫౌండేషన్‌ జరిపిన సర్వేలో వెల్లడయింది. తొలి ఐదు స్థానాలలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా ఇండియా మొదటి స్థానంలో ఉండగా.. ఆఫ్గానిస్తాన్, సిరియా, సోమాలియా, సౌదీ అరేబియా.. తర్వాతి స్థానాలలో నిలిచాయి :::  అమెరికన్‌ నటి, మోడల్, సంగీతకారిణి ఇవాన్‌ రేచల్‌.. ట్రంప్‌కు వ్యతిరేకంగా ‘బ్రేక్‌బ్రెడ్‌నాట్‌ఫ్యామిలీస్‌’ రిలే నిరాహారదీక్షల్లో పాల్గొంటున్నారు. ‘రాబర్ట్‌ ఎఫ్‌.కెన్నెడీ హ్యూమన్‌ రైట్స్‌’ సంస్థ ప్రారంభించిన ఈ ఉద్యమ కార్యక్రమంలో భాగంగా 24 రోజుల పాటు జరిగే 24 గంటల నిరసనల్లో కూర్చునేందుకు యు.ఎస్‌. లోని ప్రముఖులంతా ఒక్కొక్కరుగా తరలివస్తున్నారు ::: పాక్‌ గాయకుడు అలీ జాఫర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన పాక్‌ గాయని మీషా షఫీ..  అలీ గురించి తప్పుగా మాట్లాడకూడదని కోర్టు తక్షణ ఆదేశాలు జారీ చేసింది. మీషా పై అలీ వేసిన వంద కోట్ల రూపాయల పరువునష్టం కేసులో తన వివరణలను జూలై 5 లోపు కోర్టుకు సమర్పించాలని కూడా మీషాకు నోటీసులు అందాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement