షెర్రీ జాన్సన్
అమెరికా నిర్వచనం చెప్పమంటే స్వేచ్ఛ ‘ప్రతిమ’ రూపంలో ఉన్న ఒక దేశం అన్నారట ఎవరో. షెర్రీ జాన్సన్ వంటి వారి గాథలు వింటే ఆ మాట నిజమే అనిపిస్తుంది. నాగరికతకు మారుపేరుగా నిలిచిన అగ్రదేశంలో బాల్యవివాహాలకు చట్టబద్ధత ఉందంటే ఆశ్చర్యం కలగకమానదు. తల్లిదండ్రులు, జడ్జి సమ్మతి ఉంటే చాలు అక్కడి చట్టాల ప్రకారం మైనర్లు కూడా పెళ్లి చేసుకోవచ్చు. అయితే ఇలాంటి చట్టాల వల్ల కొంతమంది అమ్మాయిలు తాము కలలోనైనా ఊహించలేని పెళ్లి చేసుకోవాల్సి వస్తోంది. ఆ కోవకు చెందిన వారే షెర్రీ జాన్సన్.
ఎనిమిదేళ్ల ప్రాయం మొదలు పలుమార్లు అత్యాచారానికి గురై, తల్లిగా మారి, పదకొండేళ్ల వయస్సులో అత్యాచారం చేసినవాడినే పెళ్లిచేసుకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొన్నారు. తల్లి కోసం కన్నీళ్లను దిగమింగారు. కష్టాలను మౌనంగా భరించారు. కానీ ఇక అలా ఉండటం ఆమెకు నచ్చలేదు. తనకు జరిగిన అన్యాయం మరే ఆడపిల్లకు జరగకూడదని, బాల్య వివాహాలను నిషేధించాలని పోరాటం చేస్తున్నారు. ఈ న్యాయపోరాటంలో ఆమెకు ఎంతో మంది తోడ్పాటునందిస్తున్నారు. వారిలో దక్షిణ ఫ్లోరిడా సెనేటర్లు లారెన్ బుక్, లిజ్బెత్ బెనాక్విస్తో(సెనేట్‌లో బాల్య వివాహాలకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టారు) ముందున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన మీ టూ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ, లైంగిక హింసకు వ్యతిరేకంగా గళమెత్తారు. ఇక్కడ విశేషమేమిటంటే వారు కూడా షెర్రీ మాదిరిగానే బాల్యాన్ని కోల్పోయి, వేధింపులకు గురైనవారే.
ఆమె బాల్యం... అంతులేని విషాదం
షెర్రీ కథ వింటే కళ్లు చెమర్చకమానవు. ఫ్లోరిడాలోని టంపా సిటీలో తల్లితో పాటు చర్చ్ ఆవరణలోని గదిలో నివసించేది. వారిద్దరూ వారానికి ఆరు రోజులపాటు చర్చిలో సేవ చేసేవారు. చర్చి పెద్దలు చెప్పినట్లుగా నడుచుకువాలనే ఎన్నో నిబంధనల నడుమ ఆమె బాల్యం మొదలైంది. బాల్యానికి సంబంధించి తల్లి చేసే బిస్కెట్లు తింటూ, కలర్ పెన్సిళ్లతో డ్రాయింగ్ చేయడం వంటి అతికొన్ని ఙ్ఞాపకాలు మాత్రమే ఆమెకు మిగిలాయి. మిగతాదంతా అసలు ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో తెలుసుకోలేని పసిప్రాయంలో ఆమె గోడు వినేవారే కరువయ్యారు.
వల వేసి.. వంచించి
భోజనం చేయాలంటే చర్చ్ బిషప్ ఇంటిలో నివసించే తన ఆంటీ ఇంటికి ప్రతిరోజూ వెళ్లాల్సిందే. ఈ క్రమంలో షెర్రీపై కన్నేసిన బిషప్ ఆమె ఆంటీ లేని సమయం చూసి అత్యాచారం చేసాడు. అప్పుడు ఆమె వయస్సు ఎనిమిదేళ్లు. అసలు అతను ఎందుకు అలా ప్రవర్తించాడో అర్థం చేసుకోలేని పసిప్రాయం.
క్రూర మృగాళ్లు..
బిషప్‌తో పాటు, అతని సహాయకుడు కూడా షెర్రీని బలాత్కారం చేయడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని తల్లికి చెప్పాలని షెర్రీ ఎన్నోసార్లు ప్రయత్నించినా అరణ్యరోదనగానే మిగిలింది. తన మాటలు తల్లి పట్టించుకోకపోవడంతో ఎదిగే క్రమంలో అత్యాచారానికి గురౌవడం కూడా ఒక భాగమనే నిర్ణయానికి వచ్చింది పాలబుగ్గల షెర్రీ. తోటి విద్యార్థులంతా నీ దగ్గర చేపల వాసన వస్తుందంటూ గేలి చేస్తుంటే కుమిలి కుమిలి ఏడ్వడం కూడా ఆమెకు అలవాటయింది.
బడిలో బయటపడిన నిజం..
విద్యార్థుల సాధారణ చెకప్‌లో భాగంగా షెర్రీని కూడా పరీక్షించి బయటకు వెళ్లమని చెప్పింది నర్స్. కాసేపటి తర్వాత వస్తువులన్నీ తీసుకుని బయటకు రావాల్సిందిగా షెర్రీని ఆదేశించింది స్కూలు యాజమాన్యం. ఆమె తల్లికి ఫోన్ చేసి, ఇంటికి తీసుకువెళ్లాలని కోరారు. కూతురు ఏం తప్పు చేసిందోనని కంగారుగా స్కూలుకు చేరిన తల్లికి తాను చేసిన తప్పేమిటో అప్పుడు అర్థమయింది. పదేళ్ల షెర్రీ ఏడు నెలల గర్భవతి అని తెలుసుకుని నిర్ఘాంతపోయింది, కూతురిని నిందించింది.
పేగు బంధం.. కనుమరుగైన వేళ
కూతురు గర్భానికి కారణం బిషప్ అనుచరుడని చర్చిలో ఉన్నవారందరికీ తెలిసేలా చేసి, ప్రసవం కోసం మరో మృగాడు బిషప్‌తో షెర్రీని దూరంగా పంపివేసింది ఆమె తల్లి. అమ్మతనానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది.
బాల్యానికి సంకెళ్లు..
ఆదరించి, ఆలనాపాలనా చూసుకునే తల్లి పక్కనలేక, శరీరంలో వస్తున్న మార్పులకు కారణం చెప్పేవారు లేక హాస్పిటల్ బెడ్‌పై నరకయాతన అనుభవించింది షెర్రీ. 1970లో పదేళ్ల పసిప్రాయంలో తన మొదటి బిడ్డకి జన్మనివ్వడంతో చదువుకోవాలనే ఆమె ఆశకు సంకెళ్లు పడ్డాయి.
అక్కున చేర్చుకోవాల్సింది పోయి..
కూతురుకి ఈ గతి పట్టించిన మగాళ్లకు శిక్ష పడేలా చేయాల్సిన షెర్రీ తల్లి, ఆమె బాల్యాన్ని వివాహమనే బందీఖానాలో పడేసేందుకు ప్రయత్నాలు చేసింది. అత్యాచారం చేసిన వాడినే పెళ్లి చేసుకోవాలని బలవంతపెట్టింది. కోర్టు ఇందుకు నిరాకరించినా చట్టాన్ని అడ్డు పెట్టుకుని కూతురి బాల్యాన్ని, బతుకుని చిదిమేసింది. అలా పదకొండేళ్ల ప్రాయంలో 20 ఏళ్ల వ్యక్తికి భార్యగా మారింది షెర్రీ. ఆనాడు కోర్టులో తల్లికి, జడ్జికి జరిగిన సంభాషణ ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతుందని 58 ఏళ్ల షెర్రీ చెప్తుందంటే ఆమె ఎంత క్షోభ అనుభవించిందో అర్థం చేసుకోవచ్చు.
అంతటితో ఆగలేదు..
కూతురి పెంపకంలో షెర్రీకి, ఆమె తల్లి సాయం చేస్తుండటం వల్ల మళ్లీ స్కూలుకు వెళ్లే అవకాశం దక్కింది. కానీ ఆమె భర్త నుంచి విముక్తి మాత్రం లభించలేదు. ఒకరి తర్వాత ఒకరికి జన్మనివ్వడమే షెర్రీ నిరంతర కర్తవ్యంగా మారింది.
ఏ ప్రేమకు నోచుకోలేదు..
పదేళ్ల ప్రాయం నుంచే పిల్లల డైపర్లు వాష్ చేస్తూ, వారి ఆలనా పాలనా చూస్తూ గొడ్డు చాకిరీ చేసేది. తన పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూంటే తాను వారితో ఆడుకుంటూ కోల్పోయిన బాల్యాన్ని వెదుక్కునేది. భర్తకు మాత్రం ఆమె శరీరంతో తప్ప, మనసుతో సంబంధం ఉండేది కాదు. ప్రేమగా మాట్లాడేవాడు కూడా కాదు. కేవలం తన కోరికల్ని తీర్చే సాధనంగా భావించి చిత్ర హింసలకు గురిచేసేవాడు. ఆ విధంగా 17 ఏళ్లకే ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది షెర్రీ. అతనితో విసిగిపోయిన షెర్రీ విడాకులకు దరఖాస్తు చేసి 19 ఏళ్ల వయసులో ఆ నరకం నుంచి బయటపడింది.
రెండో‘సారీ’...
మోడువారిన జీవితం చిగురిస్తుందనే ఆశతో.. విడాకులు తీసుకున్న తర్వాత 37 ఏళ్ల వయసున్న మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. కానీ ఆమె ఆశ ఆవిరైంది. అతను కూడా మొదటి భర్త మాదిరిగానే శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. పిల్లల కోసం అదంతా మౌనంగా భరించింది. 27 ఏళ్ల వయసుకే ఐదుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిల బాధ్యత ఆమెకు అనేక కష్టాలను తెచ్చిపెట్టింది.
మౌనం వీడి.. పోరాటానికి సిద్ధపడి
తనకు అన్యాయం జరగటానికి ఒక విధంగా తన మౌనమే కారణమని భావించిన షెర్రీ.. ఇకనైనా పోరాట పంథా ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. గత ఐదేళ్లుగా అందుకోసం శ్రమిస్తూనే ఉంది. ఆమె ప్రయత్నాలు ఫలించినట్లయితే ఎంతో మంది చిన్నారులు వివాహమనే చెర నుంచి విముక్తులవుతారు. ఫ్లోరిడా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. మైనర్ వివాహాలను అరికట్టేందుకు చట్టం చేసే మొదటి రాష్ట్రంగా నిలవబోతోంది.
ఆత్మకథతో ప్రయాణం...
బిల్లు ఆమోదం పొందినట్లయితే తన ఆత్మకథ..‘ఫర్‌గివింగ్ ద అన్‌ఫర్‌గివబుల్ ’ను నాటక రూపంలో ప్రదర్శించాలనే యోచనలో ఉన్నారు. అలాగే బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బస్ టూర్ ప్లాన్ చేసి, బడ్జెట్‌ను కూడా నిర్ణయించేశారు. ఇందుకోసం తన స్నేహితురాలు లారెన్ బుక్ సహాయం తీసుకుంటున్నారు.
- సుష్మారెడ్డి యాళ్ళ
Comments
Please login to add a commentAdd a comment