సాక్షి, సిటీబ్యూరో: బుడిబుడినడకల బంగరు బాల్యాన్ని కామాంధులు చిదిమేస్తున్నారు. హైటెక్ బాటలో దూసుకెళుతున్న మన గ్రేటర్‌లోనూ చిన్నారులపై అకృత్యాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల గోల్కొండలోని అజాన్ పాఠశాలల్లో అభం శుభం తెలియని చిన్నారిపై జరిగిన అమానుష ఘటన సభ్య సమాజాన్ని కలచివేసింది. ఇలాంటి దారుణాల విషయంలో దేశంలోని మహానగరాల్లో మన గ్రేటర్ హైదరాబాద్ సిటీ ఐదోస్థానంలో నిలవడం సిటీజన్లను కలవరపెడుతోంది. ఈ విషయంలో బెంగళూరు ప్రథమస్థానంలో నిలవగా..ఆ తర్వాతి స్థానాల్లో ముంబయి, చెన్నై, ఢిల్లీ నగరాలున్నాయి. బాలల హక్కులపై పరిశోధన చేస్తున్న చైల్డ్‌రైట్స్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
చిన్నారులపై అమానుషం
ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నతపాఠశాల స్థాయిలోవిద్యనభ్యసిస్తున్న మైనర్ బాల, బాలికలపై ఇటీవలికాలంలో బడిలో, ఆటోలు, స్కూల్ వ్యాన్‌లు, బస్సులు, ట్యూషన్ పాయింట్లు, ట్యుటోరియల్స్, బహిరంగ, నిర్మానుష్య ప్రదేశాల్లో జరుగుతున్న లైంగికదాడులు ఇటు తల్లిదండ్రులు, అటు ఉపాధ్యాయులను కలచివేస్తున్నాయి. ప్రధానంగా బాలికలే అత్యధికంగా ఈ విషయంలో సమిధలుగా మారుతున్నారు. అభం శుభం తెలియని చిన్నవయస్సులో వారిపై జరుగుతోన్న అకృత్యాలతో వారి బంగరు భవితపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి మన గ్రేటర్ సిటీలో ఇలాంటి ఆకృత్యాలు 74 చోటు చేసుకోవడం గమనార్హం.
మెట్రోనగరాల్లో ఇలా...జాగ్రత్తలివే..
♦ పాఠశాలకు, ట్యూషన్లకు తమ పిల్లలను పంపించే తల్లిదండ్రులు ఇలాంటి అంశాలపై అప్రమత్తంగా ఉండాలని చైల్డ్‌సైకాలజిస్టులు సూచిస్తున్నారు.
♦ బడికివెళ్లే బాలబాలికలకు పాఠశాల ఆటోలు, వ్యాన్‌లు, బడిలో డ్రైవర్లు, లేదా టీచర్లు, ఆయాలు, వాచ్‌మెన్‌లు, నాన్‌టీచింగ్ స్టాఫ్ ఎలా ప్రవర్తిస్తున్నారో తరచూ అడిగి తెలుసుకోవాలి. వీలైతే స్వయంగా వారి ప్రవర్తనను గమనించాలి.
♦ అధిక మార్కులు, ర్యాంకుల కోసం అంతగా సురక్షితం కాని ప్రదేశాల్లోని ట్యూషన్‌పాయింట్లు, ట్యుటోరియల్స్‌కి బలవంతంగా పంపించరాదు.
♦ అపరిచితులైన అధ్యాపకులపై కన్నేసి ఉంచాలి.
♦ ఇళ్లలో ట్యూషన్ పెట్టించే తల్లిదండ్రులు అధ్యాపకుల ప్రవర్తనను నిశితంగా పరిశీలించాలి. పిల్లలను ఇళ్లలో ఒంటరిగా వదిలివేయకూడదు.
♦ చిన్నారులు ఇలాంటి అంశాలపై చేసిన ఫిర్యాదులను తేలికగా తీసుకోరాదు. పరువుపోతుందని బాధపడకుండా..తప్పనిసరిగా పాఠశాల యాజమాన్యం, పోలీసుల దృష్టికి తీసుకురావాలి.
♦ చిన్నారులు అధికంగా వీడియోగేమ్స్, సోషల్‌మీడియా, స్మార్ట్‌ఫోన్లు, టీవీలతో గంటల తరబడి కుస్తీపట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
♦ చిన్నారుల్లో అభద్రతా భావాన్ని పోగొట్టాలి. వారిపై ర్యాంకులు, మార్కులంటూ వత్తిడి పెంచకుండా వారిని స్వేచ్ఛగా ఆడుకోనివ్వాలి.
♦ అపరిచితులు చిన్నారులకు ఆఫర్ చేసే చాక్లెట్స్, బహుమతులు వంటి వాటిని తిరస్కరించమని సూచించాలి.
Comments
Please login to add a commentAdd a comment