చాక్లెట్‌ రేప్‌..ర్ర్‌ | women empowerment : special on Trap to child | Sakshi
Sakshi News home page

చాక్లెట్‌ రేప్‌..ర్ర్‌

Published Wed, Feb 28 2018 11:26 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

women empowerment :  special on Trap to child - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చాక్లెట్‌ని రంగుల కాగితంలో.. 
అదే.. రేపర్‌లో చుడతారు.
ఆ రంగుల రేపర్‌లో ఒక దరిద్రుడు తన వాంఛను చుట్టి
పిల్లల్ని ట్రాప్‌ చేస్తే... బాల్యాన్ని నలిపేస్తే..
ఒళ్లంతా పుండ్లు వచ్చేస్తాయి!
జీవితంలో ఎప్పటికీ మానని గాయాలుగా అవి మిగిలిపోతాయి.

ఆ రోజు భయం భయంగా ఇంట్లో అడుగుపెట్టానో లేదో.. ‘చిన్నదాన్ని చూసుకో’ అని చెప్పేసి  – ఉరుకులు పరుగుల మీద పనికి పోయింది మా అమ్మ. ఐదు రూపాయల నోటు చేతిలో పెడితే.. మారు మాట్లాడకుండా కొంగున కట్టుకుంది. నా వైపు కన్నెత్తయినా చూడలేదు. ‘ఎవరిచ్చారు’ అని కూడా అడగలేదు.  బండ చాకిరీ చేస్తుంది మా అమ్మ. మా నాన్న మమ్మల్ని వదిలేసి పోయినప్పట్నుంచీ తను బండరాయి మల్లే తయారైంది. ఒక్కోసారి కోపంతో ఊగిపోతూ నన్నూ నా ఇద్దరు చెల్లెళ్లన్నీ కొట్టేది. పెద్ద పెద్ద కేకలేసేది. మాకు నాలుగు మెతుకులు కతకడానికి నానా యాతన పడుతుండేది. తిండిబెట్టి, వంద రూపాయలు ఇస్తామంటే ఒక ఇంట్లో నన్ను పనికి పెట్టింది. ఆ ఇంటాయన నా ఒంటి మీద కన్నేశాడు. ఆ రోజు ఆయన నన్ను ఎక్కడెక్కడో ముట్టుకున్నాడు. అయోమయంగా అన్పించింది. అసలు ఏం చేస్తున్నాడో ఎందుకట్టా చేస్తున్నాడో తెలియక భయమైంది. చెప్పుకోలేని చోట్ల మంట. నొప్పి.  ఇంటికి వెళ్లే ముందు ఆయన ఐదు రూపాయలిచ్చి ఎవ్వరికీ చెప్పొద్దన్నాడు. చెబితే మా అమ్మను పనిలో నుంచి తీయించేస్తానని బెదిరించాడు. మేముండే రేకుల షెడ్లో నుంచి బయటకు తోలిస్తానని భయపెట్టాడు.  వీధి పంపులోంచి నీళ్లు తెచ్చి ఇంట్లో డ్రమ్ములు నింపడం నా పనే. కానీ ఆ రోజు ఆ పనే కాదు, ఏ పనీ చేయలేక మా అమ్మ చేతిలో దెబ్బలు తిన్నాను. కానీ నేనేం చేయను? లోపటి వాపులతో నడవడమే కష్టమైంది. ఒంట్లో ఓపిక లేనట్టు అనిపించింది.

మర్నాడు పని మానేస్తానన్నా. అమ్మ తిట్టి రెండు తగిలించింది. ఇంట్లో  బువ్వ లేదంది. పని చేసి నాలుగు మెతుకులు తిని రమ్మంది. కానీ ఆ ఇంటాయన సంగతి నేనెట్టా చెప్పేది? ఆయన మమ్మల్ని ఏమయినా చేస్తే? మా అమ్మని పనిలో నుంచి తీసేయిస్తే? – ఇలాంటి ఆలోచనలతో పనికి పోక తప్పింది కాదు.ఆ ఇంటాయన బయటకు పోయేవాడు కాదు. భార్యాభర్తలు గొడవ పడుతుండేవాళ్లు. భార్యా పిల్లలు బయటకు పోయాక నన్ను గదిలోకి లాక్కుపోయేవాడాయన. తను చెప్పినట్టు చేయకపోతే గదిమేవాడు. గిచ్చేవాడు. నా  శరీరాన్ని నలిపేసేవాడు. ఒక్కోసారి జనం లేని చోట్లకి తీసుకుపోయి పాడుచేసేవాడు. కానీ కడుపు నిండా అన్నం పెట్టేవాడు. అప్పుడప్పుడూ తినడానికి ఏదైనా ఇచ్చేవాడు. డబ్బులు కూడా చేతిలో పెట్టేవాడు.

నెలరోజుల తర్వాత – నన్నూ మా అమ్మనూ పోలీసులు స్టేషన్‌కి తీసుకుపోయారు. మా అమ్మ భయంతో ఒణికిపోయింది. ఆ ఇంటాయన గురించి చాలా ప్రశ్నలు వేశారు నన్ను. మా అమ్మను తిట్టారు. చిన్న పిల్లల్ని పనిలో పెట్టకూడదంట. చట్టం ఒప్పుకోదంట. మా అమ్మ తప్పు చేసిందంట. పోలీసులు ఇట్టా చెబుతుంటే మా అమ్మ కొంగుతో కళ్లు అద్దుకుంటూ కిక్కురుమనలేదు.ఆ రోజు నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు జరిపారు. ఇంటాయనపై కేసు పెట్టారు. ఆ ఇంటాయన నన్ను పాడు చేసినట్టు వాళ్ల ఆవిడే పోలీసులకు చెప్పిందంట. అంటే జరిగిందంతా ఆవిడకు తెలుసన్నమాట!ఆ రోజు మా అమ్మ బాగా ఏడ్చింది. తను అంతగా ఏడవడం ఎప్పుడూ చూడలేదు నేను. ఏడుస్తూనే ఇల్లొదిలి పోయిన మా నాన్నను చావు తిట్లు తిట్టింది. కసి తీరా కేకలేసింది.
  
నన్ను ఓ ఎన్జీవోకి  చెందిన హాస్టల్‌కి పంపారు. అక్కడ ఆరునెలలపాటు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఓ రోజు బడికి పంపిస్తామంటే వద్దని ఏడ్చి మొత్తుకున్నాను. మరి కొన్నాళ్లు కౌన్సెలింగ్‌ ఇచ్చి.. బడికి పోయేదానికి ఒప్పించారు.బళ్లో నాకెవ్వరూ దోస్తులుండేవాళ్లు కాదు. అసలు నేనెవ్వరితో మాట్లాడలేకపోయేదాన్ని. ఎవ్వరితో కలవలేక పోయేదాన్ని. ఏమీ చదవలేకపోయేదాన్ని. అందరూ అదోలా చూస్తుంటే భయంతో ముడుచుకుపోయేదాన్ని. చదువుపై ధ్యాస లేకపోవడంతో పదో తరగతి తప్పాను. దీంతో నాకు కంప్యూటర్‌ ట్రైనింగ్‌ ఇప్పించారు. ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటున్నా.నా చెల్లెళ్లకి ఆసరా అవుతున్నా. నన్ను ఆగం చేసిన వాడికి  శిక్ష పడింది. ఇప్పుడు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ పెళ్లి చేసుకోవాలనిపించడం లేదు. చేదు గుర్తుల బరువు మోయలేకపోతున్నాను. నన్ను నేను గౌరవించుకోలేకపోతున్నాను. ఒక్కోసారి నా మీద నాకే కోపమొస్తుంది.నా జీవితం ఎట్టా ఉండబోతుందో.. అనే ఆలోచన వచ్చినప్పుడు చాలా భయం పుడుతోంది. 

రక్షించుకునే శిక్షణ ఇవ్వాలి
సాధారణంగా పిల్లల్ని లైంగికంగా లోబరచుకునేవాడు అందరి ముందూ వాళ్లను తిడుతుంటాడు. ఎవ్వరూ లేనప్పుడు ప్రేమ కరబరుస్తుంటాడు.  చాక్లెట్లో ఇంకోటో పెట్టి లొంగదీసుకోవాలని చూస్తుంటాడు. ఎవ్వరికీ చెప్పొద్దని బెదిరిస్తుంటాడు. ఈ విషయాలపై పిల్లలకు అవగాహన కల్పించాలి. చూపులు – స్పర్శ – మాటలు – ప్రవర్తన వంటి వాటిల్లో్ల తేడాలను గమనించగలిగే శిక్షణ ఇవ్వాలి. ఏం జరిగినా / జరుగుతున్నా దాచిపెట్టవద్దని, మౌనంగా ఉండొద్దని చెప్పాలి. ఈ విషయాల్లో తల్లిదండ్రులకు శిక్షణ ఇవ్వడం చాలా అవసరం. తెలిసినవారి చేతుల్లోనే పిల్లలు అత్యాచారాలకు గురవుతున్న కేసులు భారీగా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో – వారికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తల్లిదండ్రులకు వివరించాలి. ఇంట్లో అయినా, బయట అయినా వాళ్లని ఒంటరిగా వదిలిపెట్టరాదనే విషయాన్ని గుర్తింపచేయాలి. తమ మనోభావాల్ని, భయాల్ని స్వేచ్ఛగా వ్యక్తం చేయగల వాతావరణాన్ని ఇంట్లో నెలకొల్పాలి. పిల్లలపై జరిగిన లైంగిక దాడుల్ని ‘పరువు’ పేరిట ఏ ఒక్కరికీ చెప్పకుండా దాచిపెడదామనుకుంటే, బాధితులకు తగిన సపోర్ట్‌ ఇవ్వకుంటే మొదటికే మోసమొస్తుంది. బాధితురాలి జీవితమే ప్రమాదంలో పడుతుంది. ఈ కర్తవ్యాలు నిర్వహించాల్సింది ప్రధానంగా ప్రభుత్వాలే.  పిల్లల భద్రతకు గ్యారెంటీ ఇవ్వాల్సింది ప్రభుత్వాలే. ప్రమాదాల్లో ఉన్న పిల్లలకోసం హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేస్తే చాలదు. దానిపై తగిన ప్రచారం కూడా కల్పించాలి. తప్పు చేసిన వాళ్లకు శిక్షలు పడాలి. 
– సిస్టర్‌ లిస్సీ జోసెఫ్, ప్రెసిడెంట్,  నేషనల్‌ వర్కర్స్‌ మూవ్‌మెంట్‌

సహాయాలన్నీ   వెంటనే అందాలి
నిర్మల లాంటి బాలికలు కుటుంబాల్లో,  నివాస ప్రదేశాల్లో హింసను చూస్తూ పెరుగుతున్నారు.  లైంగిక హింస సహా రకరకాల హింసలకు గురవుతున్నారు. అయితే దీన్ని హింస అంటారనీ, దీన్ని వ్యతిరేకించాలనీ వాళ్లకి తెలియదు. చూడటానికి వాళ్లు మామూలుగానే కనిపిస్తారు. మామూలుగానే మాట్లాడతారు. వాళ్లల్లో విచారం కనిపించదు. హింసాత్మక అనుభవాల గురించి వాళ్లు ఏమీ చెప్పుకోరు. మాట్లాడరు. వాళ్ల చుట్టూ ఉండే జనానికి వాటి గురించి వినే టైమ్‌ గానీ / ఆలోచించే తీరిక గానీ ఉండవు. ఇప్పుడున్న స్థితి పట్ల అభ్యంతరాలూ ఉండవు. దీని వెనుక వ్యవస్థాగత కారణాలున్నాయి. ఇలాంటి నేపథ్యం ఉన్న చోట నిర్మల లాంటి పిల్లల్ని అమాయకత్వమూ  నిస్సహాయత్వమూ ఆవరించి ఉంటాయి. సాంఘికంగా చితికిపోయిన, మాససికంగా డిప్రెస్డ్‌గా ఉన్న ఈ బాధితులకు ఎంతో శక్తి ఇవ్వాల్సి వుంది.  వీళ్ల చేత హింసను గుర్తింపచేయడం, దాని బారి నుంచి బయటకు లాగడం ఒక పెద్ద సవాల్‌. వీళ్లకి చట్టపరమైన సాయమొక్కటే చాలదు. శారీరక – మానసిక – ఆర్థికపరమైన సాంత్వన కల్చించడం చాలా అవసరం. ఇలాంటి వాళ్లందరినీ రీహాబిలిటేషన్‌ సెంటర్లకు తరలించడం సరి కాదు. వారిని మెయిన్‌ స్ట్రీమ్‌లోనే ఉంచాలి. పని విషయంలో వాళ్ల ఎంపికను గౌరవించాలి. వాళ్లకు షెల్టర్‌ ఉండాలి. బాధితులకు ఇలాంటి సాయాలన్నీ తక్షణం అందాలి. కేసుల విచారణకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలి. ‘రేప్‌’ చుట్టూ అల్లుకున్న భావజాలాన్నీ భాషనూ మార్చడం అతి పెద్ద కర్తవ్యం.  
– వంగూర్‌ ఉషారాణి, డైరెక్టర్, ‘సన్నిహిత’ 
(నిర్మల కేస్‌ స్టడీ) – హృదయ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement