ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: ప్రేమ పేరుతో ఉన్మాదం పేట్రేగి ప్రాణాలు తీస్తున్న అకృత్యాలు... లైంగిక వేధింపులతో వెంటపడుతూ చేస్తున్న అఘయిత్యాలు నగరంలో నిత్యం ఏదో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం ఉప్పుగూడలో వెలుగులోకి వచ్చిన అరుణ, ఎర్రగడ్డలో బాధితురాలిగా మారిన లక్ష్మీ ఉదంతాల నుంచి నేటి సరస్వతి, చామంతి వరకు అనేక అఘాయిత్యాలు నిర్భయ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత చోటు చేసుకోవడం గమనార్హం.
చట్టాల్లో లొసుగులు..
మహిళలపై జరుగుతున్న దారుణాలకు సంబంధించిన చట్టాల్లో కొన్ని లొసుగులు ఉన్నాయి. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు, వీటికి ఉపక్రమించకుండా ఉన్మాదుల్ని భయపెట్టేందుకు అవసరమైన పటిష్టత వాటిలో కొరవడింది. సాధారణ నేరంగా పరిగణించే దొంగతనాల విషయంలో ఉన్న పటిష్టత కూడా మహిళలపై జరిగే నేరాల విషయంలో కనిపించదు. యజమానికి తెలియకుండా చేస్తే చోరీ.. యజమాని ప్రత్యక్షంలో బలవంతంగా తీసుకుంటే దోపిడీ. నలుగురి కంటే ఎక్కువ మంది పాల్గొంటే అది బందిపోటు దొంగతనం అంటూ చట్టం నిర్దేశిస్తోంది.
వీటిలో ఒకదానికంటే మరో దానికి నేరం తీవ్రత, శిక్షలు పెరుగుతాయి. అదే మహిళలపై జరుగుతున్న నేరాల విషయానికి వస్తే ప్రేమోన్మాదంతో దాడి చేసినా, లైంగిక వేధింపులతో విరుచుకుపడినా ఆ కేసు దాడి కిందో, హత్యాయత్నం కిందో నమోదవుతుంది. ఇలా కాకుండా మహిళలపై జరిగిన నేరం తీరును బట్టి కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసే విధంగా చట్టంలో మార్పులు రావాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.
అడ్రస్ లేని యువజన విధానం..
సమాజంలో మహిళలకున్న సమున్నత స్థానం, వారి హక్కులను యువకులకు, ముఖ్యంగా ఇప్పుడిప్పుడే యవ్వనంలో అడుగిడుతున్న యువతకు క్షుణ్ణంగా బోధించాలన్న ఉద్దేశంతో రూపొందించిందే జాతీయ యువజన విధానం. మహిళల పట్ల యువజనులు గౌరవంగా మసలుకొనేలా వారికి అవసరమైన కౌన్సెలింగ్ ఇవ్వాలని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఏళ్ల క్రితం నాటి ఈ విధానం లక్ష్యాలు నెరవేరేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు. పాతికేళ్లలోపు వారే ఎక్కువ సంఖ్యలో దారుణాలకు పాల్పడుతున్నవారిలో ఉన్నారు. జాతీయ యువజన విధానంలో పొందుపరిచిన విధంగా ఇక్కడి సమాజంలో స్త్రీల స్థానం, వారికి గల హక్కులపై మగపిల్లలకు చక్కని అవగాహన కల్పించడంలో, మహిళల పట్ల గౌరవంగా మసలుకొనేలా కౌన్సెలింగ్ చేయడంలో ప్రభుత్వాలు శ్రద్ధ చూపట్లేదు.
పెళ్లి చేసుకోమన్నందుకు..
ఓల్డ్ అల్వాల్ సాయిబాబానగర్‌కు చెందిన సరస్వతి, భదేవి నగర్‌కు చెందిన దీపక్ రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆమె అతడిపై ఒత్తిడి తెచి్చంది. కొన్నాళ్లు దాటవేత ధోరణి ప్రదర్శించిన అతగాడు చివరకు ఆమెను హత్య చేయాలని పథకం వేశాడు. స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పి మరీ ఆమెను చంపేశాడు. గత మంగళవారం అల్వాల్ ఠాణా పరిధిలో ఈ దారుణం జరిగింది.
పెళ్లికి నిరాకరించినందుకు...
తనను ప్రేమించి పెళ్లి వద్దన్నందుకు యాప్రాల్ ప్రాంతానికి చెందిన గిరీష్ బాపూజీనగర్‌కు చెందిన చామంతిపై హత్యాయత్నం చేసి, తాను ఆత్మహత్యకు యత్నించాడు. సదరు యువతిని వేధించిన కేసులో అతడు అదే రోజు న్యాయస్థానంలో జరిమానా చెల్లించడం గమనార్హం. గత బుధవారం బోయిన్‌పల్లి ఠాణా పరిధిలో ఇది చోటు చేసుకుంది.
నగరంలో గత ఏడాది ఇలా..
నేరం | కేసులు |
వరకట్న హత్యలు | 02 |
వరకట్న చావులు | 19 |
ఆత్మహత్యకు ప్రేరేపించడం | 14 |
వేధింపులు | 1043 |
కిడ్నాప్‌లు | 60 |
ఆత్మగౌరవానికి భంగం | 438 |
అత్యాచారం | 265 |
ఇవీ నిపుణుల సూచనలు...
► మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించిన కేసుల విచారణ కూడా త్వరితగతిన పూర్తయ్యేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి
► జాతీయ యువజన విధానాన్ని అమలులో పెట్టడానికి అవసరమైన చర్యలు ప్రారంభించాలి.
► చట్టాలకు పదును పెట్టడంతో పాటు మహిళలు, బాలికలపై జరిగే అకృత్యాలు, ప్రేమోన్మాదుల దాడులను తీవ్రంగా పరిగణించాలి.
► బాధితులకు కోర్టుల చుట్టూ తిరిగే బాధలు తప్పిస్తూ... ఈ కేసులపై తక్షణ విచారణ చేపట్టాలి. దీని కోసం తక్షణం సంస్కరణలు చేపట్టాలి.
► కొన్నేళ్ల క్రితం చోటు చేసుకున్న జ్యోతిర్మయి కేసులో బర్మింగ్‌హామ్ పోలీసులు చూపించని చోరవను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment