సాధారణంగా మహిళల శరీరంలోని గర్భసంచి ఒక శిశువు గర్భంలో హాయిగా పెరగడానికీ, పుట్టడానికి అనువుగా ఉంటుంది. ఇక ట్విన్స్ విషయంలో చాలా రకాల కవలలు ఉంటారు. అంటే కొందరిలో ఇద్దరు శిశువులకూ రెండు మాయలూ (ప్లాసెంటాలు), రెండు ఉమ్మనీటి సంచులు ఉంటాయి. అలా ఉంటే అది చిన్నారులిద్దరూ మామూలుగానే పెరిగి, సాధారణ ప్రెగ్నెన్సీలాగే సురక్షితమైన రీతిలో ప్రసవం అయ్యే అవకాశం ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం శిశువులిద్దరకీ ఒకే ప్లాసెంటా ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో కొన్ని కాంప్లికేషన్లు వచ్చే అవకాశాలుంటాయి. అప్పుడు ఆ కాంప్లికేషన్‌ను బట్టి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో 11 వారాల ప్రెగ్నెన్సీ సమయంలోనే స్కానింగ్ చేయించే అవకాశం ఉంది. అప్పుడు ట్విన్స్ ఎలా ఉన్నారు, ఎన్ని మాయలు (ప్లాసెంటాలు) ఉన్నాయి... అన్న విషయం స్పష్టంగా తెలిసిపోతుంది.
కాబట్టి డాక్టర్ సలహాతో ఆ పరీక్ష చేయించుకోవాలి. ఒకవేళ ఇద్దరు బిడ్డలకూ రెండు మాయలూ (ప్లాసెంటాలు), రెండు ఉమ్మనీటి సంచులు ఉన్నాయని తేలితే మామూలు ప్రెగ్నెన్సీ లాగే పూర్తిగా నిశ్చింతగా ఉండవచ్చు. కాకపోతే మిగతా గర్భిణులతో పోలిస్తే.... తాము క్రమం తప్పకుండా చేయించుకోవాల్సిన పరీక్షలను కాస్తంత త్వరత్వరగా చేయించాలి. మీ డాక్టర్ సలహాలు మాత్రం తప్పక పాటించాలని గుర్తుపెట్టుకోండి. ఇక ప్రసవం విషయానికి వస్తే... తల్లీబిడ్డల ఆరోగ్య భద్రత దృష్ట్యా అది తప్పనిసరిగా ఆసుపత్రిలోనే జరిగేలా (ఇన్‌స్టిట్యూషనల్ డెలివరీ) ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు తల్లీ, బిడ్డలు పూర్తిగా సురక్షితంగా ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment