ఉల్లాసం... ఉత్సాహం... ఉద్వేగం
సాక్షి ఫ్యామిలీ నిర్వహించిన ‘మార్చి 8 మహిళ’ పురస్కారాల పోటీలో అంతిమ విజేతలుగా నిలిచిన ఆరుగురు మహిళలకు
శనివారంనాడు హైదరాబాద్‌లో సాక్షి అవార్డులు అందజేసింది. ఈ సందర్భంగా విజేతలు వెలిబుచ్చిన అభిప్రాయాలివి...
దేశానికి వెన్నెముక అమ్మ
బెస్ట్ మదర్‌గా నాకు వచ్చిన గుర్తింపు మాతృత్వానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ‘‘నలుగురు ఆడకూతుళ్లకు తల్లిగా ఏనాడూ భయపడలేదు. నా పిల్లలను బాగా చదివించాలని, వారి కాళ్ల మీద వాళ్లు నిలబడాలని కోరుకున్నా. అనుకున్నట్టే నా చిట్టితల్లులు ఈ రోజు చదువుల తల్లులయ్యారు. అందరూ పీజీలు పూర్తి చేసి, స్వయం ప్రతిపత్తి సాధించగలిగారు. ఓ తల్లిగా నాకింతకన్నా ఏం కావాలి? ఒక మహిళ కు మాతృత్వం కన్నా మధురమైన అనుభూతి మరొకటి ఉండదు. ఆ భాగ్యాన్ని కల్పించిన పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దడం ఆ తల్లి బాధ్యత. ఒక తల్లి పెంపకం బాగుంటే ఒక తరం ఉన్నతంగా మారుతుంది. అందుకే మదర్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ కంట్రీ అంటాన్నేను. పిల్లలపై ప్రేమ చూపడం అంటే వారు అడిగినవన్నీ కొనివ్వడం కాదు. వారిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం. బెస్ట్ మదర్‌గా నాకు అవార్డు అందజేసినందుకు సాక్షికి థ్యాంక్స్.
- సుశీల, ‘అమ్మ’ కేటగిరీ విజేత
నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను
నా గురించి మా పెద్దమ్మాయి రాసి పంపించింది. అది పేపర్లో చూసిన బంధువులు, మా ఊరి వాళ్లు మా అమ్మాయిని బాగా మెచ్చుకున్నారు. అమ్మ చేసిన పనులను అంత చక్కగా రాసి పంపించావన్నారు. నాకు బహుమతి వచ్చిందని తెలిసిన తరవాత అందరి నుంచి ఒకటే ప్రశంసలు. నేను నా కుటుంబానికి చేతనైనంత చేశాను. ఆ పని ఇంతమంది మెప్పును చూరగొంటుందని నాకు తెలియదు. ఇలాంటి అవకాశాన్ని సాక్షి ఇచ్చింది. కృతజ్ఞతలు. ఇలా బహుమతి అందుకోవడం నాకు మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది.
- శివమ్మ, ‘అమ్మ కేటగిరీ విజేత
రేపు మనదే అనుకొని ముందుకు సాగాలి
బెస్ట్ వైఫ్‌గా నాకు వచ్చిన గుర్తింపు ఓ ఇల్లాలికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఏ మహిళైనా కష్టాలు వచ్చాయని నిరాశ చెందకుండా ఓర్పుతో, సహనంతో ముందుకు సాగితే సత్ఫలితాలు ఉంటాయి.
- తోట మాధవి, ‘అర్ధాంగి’ కేటగిరీ విజేత
కష్టాలకు ఎదురు నిలవాలి
బెస్ట్ వైఫ్ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా లైఫ్‌లో హ్యపీయెస్ట్ మూమెంట్. నేనే కాదు.. నన్ను మించి కష్టాలు ఎదుర్కొంటున్న ఎంతో మంది మహిళలు ఉన్నారు. వారిని గుర్తించాల్సిన అవసరముంది.
- ఇందిర ‘అర్ధాంగి’ కేటగిరీ విజేత
కష్టాన్ని నమ్ముకుంటే నష్టపోము
నా శ్రమను గుర్తించి సాక్షి నాకిచ్చిన అవార్డు మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. ఇదే స్ఫూర్తితో ముందుకుసాగుతాను. నేను చెప్పేది ఒక్కటే కష్టాన్ని నమ్ముకుంటే ఎన్నడూ నష్టపోము.
- క్రాంతి, ‘మహిళారైతు’ కేటగిరీ విజేత
స్వేదం చిందితే సిరులు కురుస్తాయి
అందరి బతుకుల్లోనూ కష్టాలుంటాయి..వాటిని ఎదిరించి నిలిచినపుడే జీవితం ఉన్నతంగా ఉంటుంది. ఈ పురస్కారం లభించడం నాకెంతో ఆనందంగా ఉంది. స్వేదం చిందితే సేద్యంలో సిరులు కురుస్తాయి. నాకుంది అరెకరం మాత్రమే. మా ఇంటాయన కాలం చేసిన తర్వాత మా పుట్టింటి వాళ్లు ఇచ్చారది. కొన్నాళ్లకు మా నాన్న కూడా పోయారు. పిల్లలూ లేరు. నేనొక్కదాన్నే అరక పట్టి పొల ంలోకి దిగాను. రాబడితో సంబంధం లేకుండా వ్యవసాయం చేస్తూ వచ్చాను. నా శ్రమను గుర్తించి సాక్షి నాకిచ్చిన అవార్డు మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతాను.
- పువ్వుల చంద్రమ్మ, ‘మహిళారైతు’ కేటగిరీ విజేత