భవిత స్వప్నాలం... విజయ చిహ్నాలం... | March 8 sakshi Women's Champion | Sakshi
Sakshi News home page

భవిత స్వప్నాలం... విజయ చిహ్నాలం...

Published Sat, Mar 7 2015 10:40 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

భవిత  స్వప్నాలం...  విజయ  చిహ్నాలం... - Sakshi

భవిత స్వప్నాలం... విజయ చిహ్నాలం...

ఆకాశంలో సగం నిన్నటి మాట... ఆకాశమే మన వశం కావాలి అనేది ఆధునిక మహిళ బాట అంటూ మహిళాలోకం నినదించింది. ప్రపంచాన్ని శాసించే శక్తి కలిగిన మహిళను విస్మరించినా, వేధించినా... ఏ సమాజమూ మనజాలదని హెచ్చరించింది. పల్లె పడతి విజయాల సాక్షిగా, నగర మహిళ సాధికారిత సాక్షిగా... మహిళా దినోత్సవానికి ఒకరోజు ముందు... హైదరాబాద్‌లో ‘సాక్షి’ నిర్వహించిన మహిళాదినోత్సవం... ఆద్యంతం వనితా జగతికి జేజేలు పలికింది.
 
 ఎస్.సత్యబాబు
‘‘మేం మేల్కొన్నాం. సమాజానికి దిశా నిర్దేశం చేస్తున్నాం. నిన్న సంగతేమో కాని నేటి గమనమూ రేపటి గమ్యమూ నిర్ణయించేది మేమే’’నంటూ స్పష్టం చేశారు మహిళామణులు. సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని జెఆర్‌సి కన్వెన్షన్ హాల్‌లో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. సాక్షి మీడియా గ్రూప్ చైర్‌పర్సన్ వై.ఎస్.భారతి హాజరైన ఈ కార్యక్రమాన్ని రాణిరెడ్డి పర్యవేక్షించారు.

విలువైన విశేషాల సమాహారం

సంపాదించడమే కాదు, ఆ సంపాదనను సద్వినియోగం చేయడంలోనూ, కుటుంబాన్ని పోషించడంలోనూ మహిళదే పైచేయి అంటూ తమ జీవితానుభవాల ద్వారా తెలియజేశారు ‘హోమ్ బడ్జెట్’ చర్చాకార్యక్రమంలో పాల్గొన్న గృహిణులు. మరోవైపు ‘స్టైల్ ైచె ’ పేరుతో ఫ్యాషన్, బ్యూటీ రంగ ప్రముఖురాలు చైతన్య... మేకప్, లుక్‌కు సంబంధించిన చక్కని సూచనలు అందించారు. కార్యక్రమానికి హాజరైన లైఫ్ కోచ్ శాంతాజైన్... అర్ధవంతమైన లక్ష్యాలతో జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వంటి విషయాలను సులువైన పద్ధతిలో వివరించారు.  శరీరానికి మాత్రమే కాదు ముఖానికి సైతం యోగా అవసరమే అంటూ వినూత్నమైన ఫేస్‌యోగాను సభికులకు పరిచయం చేశారు మాన్సి గులాటి.

నిలుద్దాం... గెలుద్దాం...

‘‘పురుషాధిక్య సినీరంగం, అప్పటిదాకా మహిళలు ఎవరూ రాణించ  లేకపోయిన రంగాన్ని ఎంచుకున్నా. ఒడిదొడుకులు ఎదుర్కొన్నా. గెలుపును ఆస్వాదిస్తున్నా’’నంటూ సంగీత దర్శకురాలు ఎం.ఎన్. శ్రీలేఖ తన విజయ ప్రస్థానాన్ని వినమ్రంగా వెల్లడిస్తే,.. ‘‘సమస్యను ఎవరికీ చెప్పుకోవద్దు. దాన్ని అధిగమించి అప్పుడు సమస్య-పరిష్కారం రెండూ పంచుకోండి’’ అంటూ మహిళా పారిశ్రామికవేత్త జ్యోతిరెడ్డి దిశానిర్దేశం చేశారు.

‘‘సమస్యలు వచ్చినా ముందడుగు వేయడం ద్వారా మాత్రమే లక్ష్యాన్ని చేరుకోగలమని’’ ఫిక్కీ మాజీ చైర్‌పర్సన్ జ్యోత్స్నా అంగారే కర్తవ్య బోధ చేస్తే, ‘‘ఆధారపడే తత్వాన్ని వదిలేయడం, తమని తాము విశ్వసించడం, తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు ఆడపిల్లల్ని ప్రోత్సహించడం అవసరం’’ అని ఫ్యాషన్, సినీ రంగాల్లో రాణిస్తున్న సర్వమంగళ సూచించారు. ‘‘స్త్రీ అనే అక్షరమే మహత్తరమైంది. గౌరవభావాన్ని రగిలించేది. అన్ని రంగాల్లో రాణించే శక్తి కలిగిన మల్టీటాస్కింగ్ స్కిల్స్ ఆమెకు మాత్రమే సొంతం. అవి తనలో ఉన్నాయని ప్రతి మహిళా గుర్తిస్తే... ఇక విజయాలే’’నని పలికిన హోలీ మేరీ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ యజమాని, ఎపి కోవె సంస్థ  ప్రతినిధి విజయశారద ఆహూతుల్లో స్ఫూర్తి నింపారు. ‘‘మనం ఎంత అర్జంటు పనిలో వెళుతున్నా...  ఆపదలో ఉన్న ఆడపిల్ల కనిపిస్తే అన్నీ పక్కన పడేసి సాయపడదాం. తర్వాత ఏం జరుగుతుందో అని ఆలోచించకుండా ఆదుకుందాం’’ అంటూ ప్రముఖ యువ చిత్రకారిణి ప్రియాంక ఏలె పిలుపునిచ్చారు.

‘‘ఎత్తయిన ప్యాలెస్‌ని అధిరోహించాలనుకుందో కప్పల మంద. కప్పేమిటి? అంత ఎత్తు ఎక్కడమేమిటి? అంటూ చేసిన హేళనలు, వెక్కిరింతలూ వింటూ ఒక్కో కప్పా కిందపడిపోయాయి.  చివరి దాకా ఎక్కి విజేతగా నిలిచిన కప్ప ఎలా ఎక్కగలిగిందో తెలుసా... అది చెవిటిది కాబట్టి’’ అంటూ  ప్రముఖ స్టోరీ టెల్లర్ దీపాకిరణ్...  కథలో మిళితం చేస్తూ విజయ సూత్రాల్ని ఉద్బోధించారు.
 కార్యక్రమంలో జెఆర్‌సి కన్వెన్షన్ సెంటర్ నిర్వాహకురాలు షీలారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాక్షి ఫ్యామిలీకి వచ్చిన ఎంట్రీల ఆధారంగా ఎంపిక చేసినబెస్ట్ మదర్, బెస్ట్ బెటర్‌హాఫ్, ఉత్తమ మహిళా రైతు... పురస్కారాల విజేతలకు  బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విభిన్న రంగాలలో రాణిస్తున్న పలువురు మహిళా ప్రముఖులు ర్యాంప్‌పై సగర్వంగా చేసిన ‘ప్రైడ్‌వాక్’ అందరినీ ఆకట్టుకుంది. చిన్నారి నర్తన చేసిన పేరిణి సంప్రదాయ నృత్యం, ఔత్సాహిక గాయని అహల్య ఆలపించిన మధురమైన సినీ గీతాలు అలరించాయి. ప్రముఖ సామాజిక కార్యకర్త దేవి కూడా ఈ మహిళాదినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
మార్చి 8 మహిళ విజేతలు శివమ్మ, ఇందిర, సుశీల, చంద్రమ్మ, మాధవి, క్రాంతిలతో సాక్షి చైర్‌పర్సన్ వై.ఎస్. భారతి, సాక్షి కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డెరైక్టర్ రాణిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement