
భారతదేశంలోని యువ నగర మహిళ చుట్టూ తిరిగే ఓ కొత్త కామెడీ డ్రామా సిరీస్‌ను త్వరలోనే ప్రసారం చేయబోతున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ప్రకటించింది. ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్’ అనే టైటిల్‌తో వస్తున్న ఆ కొత్త ఒరిజినల్ సిరీస్ తొలి సీజన్‌లో 10 ఎపిసోడ్‌లు ఉంటాయి. నలుగురు స్నేహితురాళ్ల వర్క్‌లైఫ్, కెరీర్‌లో ఎదగాలన్న ఆశ, ఆశయం, ఆందోళన వీటన్నిటితో కామెడీగా, రొమాంటిక్‌గా అల్లిన ఈ కథను వెబ్ సిరీస్‌గా ప్రీతిష్ నంది కమ్యూనికేషన్స్ నిర్మించబోతోంది. డైరెక్షన్ అనూ మీనన్. వచ్చే ఏడాది జనవరి 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్‌ను చూడొచ్చు.
అండమాన్‌లోని ఉత్తర సెంటినెల్ దీవిలో నివసించే ఆదివాసీలు అత్యంత ప్రమాదకరమైనవారని; తమను కలిసేందుకు, తమను కలుపుకునేందుకు ప్రయత్నించేవారెవరైనా ప్రాణాలు వదిలేసుకోవలసిందేనని.. గత నెలలో ఒక అమెరికన్‌ని వారు చంపిన ఘటనతో మరోసారి రుజువైంది. భారత ప్రభుత్వం కూడా ఏళ్లుగా వారినలా ఏకాంతంగా వదిలేసింది. వారి నివాస ప్రాంతానికి వెళ్లవద్దని ఆంక్షలు విధించింది. అయితే సెంటినెల్ తెగవారు మరీ అంత భయంకరమైనవారా! కానే కాదనీ, మధుమలా ఛటోపాధ్యాయ అనే మహిళ వారిలో కలిసిపోయి, వారి పిల్లాపాపల్తో కూడా గడిపిందని తాజాగా కొన్ని వార్తాకథనాలు వస్తున్నాయి. అందుకు సాక్ష్యంగా మధుమాల ఓ సెంటినెల్ పిల్లవాడిని ఎత్తుకుని ఉన్న ఫొటో కూడా ఒకటి బయటికి వచ్చింది. మధుమాల ప్రస్తుతం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలో సీనియర్ పరిశోధన అధికారి.సెంటినెల్స్‌ను కలిసిన తొలి మహిళా ఆంత్రోపాలజిస్ట్‌గా ఆమె 1991 జనవరి 4న ఓ పెద్ద రికార్డునే సాధించారు కానీ, అది మరుగున పడిపోయింది. మానవజీవన అధ్యయనవేత్త, పరిశోధకురాలు అయిన మధుమాల.. ఆ దుస్సాహస ఘటనను తన వృత్తితో భాగం మాత్రమే అనుకున్నారు తప్ప, దానికి ప్రత్యేకతను ఇవ్వలేదు.