
స్మార్ట్‌ఫోన్లు వచ్చాక ప్రపంచం పిడికిట్లో ఇమిడిపోయింది. చిన్నా పెద్దా తేడా లేకుండా స్మార్ట్‌ఫోన్లు దాదాపు అందరికీ హస్తభూషణంగా మారాయి. అరచేతిలో వైకుంఠాన్ని చూసుకున్నంత అపురూపంగా కొందరు అదే పనిగా స్మార్ట్‌ఫోన్ల వైపు చూస్తూ గంటల తరబడి గడిపేస్తూ ఉండటం మామూలైంది. అయితే, రోజూ అదే పనిగా స్మార్ట్‌ఫోన్లను చూస్తూ గడిపేస్తూ పోతే, ప్రపంచంతో సంబంధాలు దూరమైపోతాయని మానసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పని ఉన్నా, లేకున్నా స్మార్ట్‌ఫోన్లను చూడకుండా ఉండలేకపోవడం చాలా మందికి వ్యసనంగా మారిందని, ఈ వ్యసనం బారిన పడ్డ వారిలో తీవ్రస్థాయిలో ప్రవర్తనాపరమైన లోపాలు తలెత్తుతున్నాయని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ కికి ల్యూంటర్ వెల్లడించారు.
స్మార్ట్‌ఫోన్ వ్యసనంలో నిండా కూరుకుపోయిన రెండువేల మందిపై విస్తృతమైన అధ్యయనం నిర్వహించిన తర్వాత పలు ఆందోళనకరమైన అంశాలను కనుగొన్నట్లు ఆయన తెలిపారు. ఇలాంటివారు పని దినాల్లో కనీసం ఆరుగంటల సేపు స్మార్ట్‌ఫోన్లు లేదా టాబ్లెట్ల తెరలను చూస్తూ గడిపేస్తున్నారని, వీరు కుటుంబ సభ్యులను సైతం పట్టించుకోనంతగా వీటికి అతుక్కుపోతున్నారని చెప్పారు. స్మార్ట్‌ఫోన్ల వ్యసనం బారిన పడిన వారు వీలైనంత త్వరగా తగిన వైద్యం చేయించుకోకపోతే తీవ్రమైన మానసిక వ్యాధులకు లోనయ్యే ప్రమాదం లేకపోలేదని డాక్టర్ ల్యూంటర్ హెచ్చరించార