అగ్గిపుల్లలు అండర్‌గ్రౌండ్ సబ్‌వేలు
ఇన్ / ఔట్
బ్రిటన్‌లో ఇవాళ జనవాక్య సేకరణ (రిఫరెండమ్) జరుగుతోంది. ఐరోపా సమాఖ్యలో సభ్య దేశంగా ఉన్న బ్రిటన్ తన సభ్యత్వాన్ని కొనసాగించాలా? సమాఖ్య నుంచి వైదొలగాలా? అన్నది ఓటింగ్ పాయింట్. అసలు ఎందుకని ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ బయటికి వచ్చేయాలనుకుంటోంది? ఏవో ఆర్థిక కారణాలు. ఇంకేవో రాజకీయ కారణాలు. వాటిని అలా ఉంచి, బ్రిటన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
గ్రేట్ బ్రిటన్ అనేది ఒక్క దేశం కాదు. అందులో నాలుగు దేశాలు కలిసి ఉన్నాయి. ఇంగ్లండ్, స్కాట్లండ్, వేల్స్, నార్త్ ఐర్లండ్. వీటన్నిటినీ కలిపి యునెటైడ్ కింగ్‌డమ్ (యు.కె) అంటారు. అధికారికంగా ఇది ‘యునెటైడ్ కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్’. ఐరోపా ఖండానికి వాయవ్య దిశలో (నార్త్-వెస్ట్) యు.కె. ఉంది.
తేనేటి ప్రియులు అత్యధిక సంఖ్యలో ఉన్న దేశం బ్రిటన్.యు.కె.లో దాదాపు 75 శాతం వ్యవసాయ భూములే. ప్రపంచంలో తొలి హాట్ చాక్లెట్ స్టోర్ లండన్‌లోనే ప్రారంభం అయింది. పోలో, సాకర్, రగ్బీ ఆటల్ని యు.కె.నే ప్రపంచానికి పరిచయం చేసింది. రైల్వేలను కనిపెట్టింది కూడా బ్రిటనే. 1827లో అగ్గిపుల్లల్ని కనిపెట్టిన జాన్ వాకర్ బ్రిటన్ దేశస్థుడే. అండర్ గ్రౌండ్ సబ్‌వేల నిర్మాణం తొలిసారిగా లండన్ నగరంలోనే మొదలైంది. లండన్‌లోని థేమ్స్ నదికి 200 వంతెనలు, సొరంగాలు అనుసంధానమై ఉన్నాయి. మధ్యయుగాల నాటి ఇంగ్లండులో జంతువులపై విచారణ జరిపి, అవి చేసిన నేరాలకు శిక్షలు విధించేవారు!