
పుంజు పహిల్వాన్
♦ తిక్క లెక్క
యజమాని చేతిలో రాజసం ఒలికిస్తున్న ఈ కోడిపుంజు అలాంటిలాంటిది కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద పుంజుగా రికార్డును సొంతం చేసుకుంది. ఎంత మేలిజాతి కోడిపుంజులైనా ఒకటిన్నర అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ఈ పుంజు మాత్రం ఏకంగా రెండడుగుల రెండంగుళాల ఎత్తు పెరిగింది. దీని బరువు పదికిలోల పైచిలుకే! ఈ పుంజుగారి పేరు లిటిల్ జాన్ దీని యజమాని పేరు జెర్మీ గోల్డ్‌స్మిత్. ఈ ఆసామికి ఇంగ్లాండ్‌లోని ఎసెక్స్ ప్రాంతంలో మౌంట్‌ఫిషెట్‌లో పది ఎకరాల వ్యవసాయక్షేత్రం ఉంది. అందులో కోళ్లు పెంచుకుంటూ ఉంటాడు.
మిగిలిన కోళ్లకు దాదాపు రెట్టింపు సైజులో కనిపించే లిటిల్ జాన్ అంటే గోల్డ్‌స్మిత్‌కు భలే ముద్దు. అతడి వ్యవసాయ క్షేత్రంలో లిటిల్ జాన్ యథేచ్ఛగా స్వైరవిహారం సాగిస్తూ ఉంటుంది. దగ్గరకొచ్చే చిన్నపిల్లలను భయపెడుతుంది కూడా. ఇంతకీ దీని దాణా ఏమిటో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. కేవలం పాప్‌కార్న్ మాత్రమే దీని ఆహారం. పాప్‌కార్న్ తింటూనే ఇది ఇంత ఏపుగా ఎదిగిపోయింది.