అధ్యక్షా..! ఇదీ మా బడి... ఇదీ మా ఊరు | World Press Freedom Day | Sakshi
Sakshi News home page

అధ్యక్షా..! ఇదీ మా బడి... ఇదీ మా ఊరు

Published Tue, May 2 2017 11:02 PM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM

అధ్యక్షా..! ఇదీ మా బడి... ఇదీ మా ఊరు

అధ్యక్షా..! ఇదీ మా బడి... ఇదీ మా ఊరు

లిటిల్‌ రిపోర్టర్‌

బడి బాగుంటే చదువు బాగుంటుంది. ఊరు బాగుంటే బతుకు బాగుంటుంది. బాగుండడం అంటే ఏంటి? స్కూల్లో ఉండాల్సిన వసతులన్నీ ఉండడం. ఊళ్లో నీళ్లకు, నిలువ నీడకు కరువు లేకుండా ఉండడం. అయితే అన్ని స్కూళ్లు, అన్ని ఊళ్లు ఇలాగే ఉన్నాయా? లేవు! లేవన్న విషయం ఎలా తెలుస్తుంది? పేపర్లు రాస్తాయి. పేపర్‌వాళ్లకు ఎలా తెలుస్తుంది? రిపోర్టర్లు రాసి పంపుతారు. రిపోర్టర్‌లు అంటే పేపర్లలో పనిచేసేవాళ్లు మాత్రమే కాదు, సమస్యను గుర్తించి దానిని నలుగురి దృష్టికీ తెచ్చేవాళ్లు కూడా. ఇదిగో.. వీళ్లంతా చిన్నారి రిపోర్టర్‌లు. ఇవన్నీ ఈ చిన్నారులు రిపోర్ట్‌ చేసిన సమస్యలు. వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ డే సందర్భంగా ‘సాక్షి ఫ్యామిలీ’ వీటిని ప్రచురిస్తోంది. వీటిపై.. ‘అధ్యక్షా...’ అంటూ ప్రతిపక్షాలు లోకల్‌ లీడర్‌లను ఎలాగూ ప్రశ్నించకుండా వదలవు. చూడాలి మరి. ప్రభుత్వాలు ఏమాత్రం స్పందిస్తాయో, పరిస్థితిని ఎప్పటికి చక్కదిద్దుతాయో!

పాస్‌ ఉంది... బస్సు లేదు!
మా ఊరు పాడేరు. నేను చేజర్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నందు 8వ తరగతి చదువుతున్నాను. మా ఊరికి రోడ్డు సౌకర్యం లేనందు వల్ల బస్సు రావడం లేదు. గతంలో బస్సు వచ్చేది. ప్రస్తుతం బస్సులు లేకపోవడంతో ఆటోలలో వెళ్లాల్సి వస్తోంది. వానా కాలంలో అదీకష్టమే. చాలా మంది ఆటోలకు డబ్బులు పెట్టలేక బడికి రావడం లేదు. ముఖ్యంగా అమ్మాయిలను ఆటోల్లో పంపించడానికి భయపడి స్కూలు మానిపించేస్తున్నారు. మేము ఎన్నోసార్లు ఆర్టీసీ వారికి అర్జీ పెట్టుకున్నాం. మా సమస్యకు పరిష్కారం దొరకలేదు. బస్సు పాసులు ఇచ్చారే కానీ బస్సులు వేయలేదు. ప్రస్తుతం మా యందు దయ తలచి బస్సు సౌకర్యం కల్పించవలసినదిగా కోరుచున్నాం.
– వి. వెంగమ్మ,
8వ తరగతి, పాడేరు, చేజర్ల జడ్పీ ఉన్నత పాఠశాల, చేజర్ల మండలం, నెల్లూరు జిల్లా



టీచర్లు ఇద్దరే
మా పాఠశాలలో నీటి సౌకర్యం లేదు. దాహం వేస్తే బయట అంగడికెళ్లి మంచినీళ్లు తెచ్చుకుని తాగుతున్నాం. మా పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు ఒకటే గది. అన్ని తరగతుల వాళ్లమూ ఆ గదిలోనే చదువుకోవాలి. మాకు ఇద్దరే టీచర్లు ఉన్నారు. అన్ని క్లాసులకూ వాళ్లే పాఠాలు చెప్పాలి. మాకు తరగతి గదులు కట్టించి, టీచర్లను నియమించాలి. అలాగే మున్సిపాలిటీ నుంచి నీటి కుళాయి కనెక్షన్‌ ఇప్పించాలి. కనీసం ఒక కుండ అయినా ఇప్పిస్తే మేమే నీళ్లు పట్టుకుంటాం.
లక్ష్మీదుర్గ, 5వ తరగతి
ఎస్‌.ఆర్‌.పురం మున్సిపల్‌ స్కూల్, కావలి పట్టణం, నెల్లూరు జిల్లా


మరుగుదొడ్లకు తలుపుల్లేవు
మాది రాజవొమ్మంగి. మా పాఠశాలను మోడల్‌ స్కూల్‌గా గుర్తించారు. అన్ని రకాల సౌకర్యాలు వస్తాయని సంబరపడ్డాం. అయితే మా మండల పరిషత్‌ ఇంగ్లీష్‌మీడియం పాఠశాలలో ఆంగ్లం బోధించే ఉపాధ్యాయుడు లేడు. ఇక ఈ పాఠశాలను మోడల్‌ స్కూల్‌గా మార్చామని ఎలా చెపుతున్నారో అర్ధం కావడం లేదు. అదే విధంగా మంచినీటి సౌకర్యం లేదు. పిల్లలమే చందాలు వేసుకొని కుండ కొనుక్కున్నాం. మరుగుదొడ్లు కట్టారు, కానీ వాటికి తలుపులు లేవు. నీళ్ల ట్యాప్‌లు లేవు.
– షేక్‌ ముజాహిద్దీన్‌ ఆలీషా,
4వ తరగతి, రాజవొమ్మంగి, విశాఖపట్టణం


చెత్త తియ్యరు... కుక్కలను తోలరు!
మా ఇల్లు కాకినాడలోని అశోక్‌నగర్, అచ్యుతాపురం. మా ఇంటి వద్ద కరెంటు స్థంభం ఉంది. ఆరు నెలల నుంచి వీధిలైట్లు వెలగడంలేదు. చీకటి పడితే బయట అడుగుపెట్టాలంటే భయం. కుక్కలు తరుముతాయి. వీథిలో చెత్త కుప్పలను అలాగే వదిలేయడంతో కుక్కలు యధేచ్ఛగా తిరుగుతుంటాయి. వీ«ధిలైట్లు వెలగక పోవడంతో రాత్రిళ్లు దొంగల భయం  ఉంటోంది. ఈ ఉత్తరం చదివిన తర్వాత అయినా పెద్దలు, అధికారులు çసమస్యలు పరిష్కరించాలి.
– జి. సాయి తేజేష్,  4వ తరగతి, కాకినాడ

నీటి కోసం ఎదురు చూపు...
బాపట్ల పట్టణంలో మంచినీళ్లు ఎప్పుడొస్తాయో తెలియదు. రోజంతా మంచినీటి కోసం ఎదురు చూడడంలోనే సరిపోతుంటుంది అమ్మావాళ్లకు. వచ్చినా అరగంట సేపటికే ఆగిపోతాయి. మంచినీటి కుళాయిలు తగినన్ని పెంచినా ఈ ఇబ్బంది కొంత తగ్గుతుంది. ఒకే కుళాయి దగ్గర అందరూ గుమిగూడి తగవులాడుకోవడం రోజూ మామూలే ఇక్కడ. ట్యాంకర్ల కోసం ఎదురు చూడడం, వచ్చాక నీళ్లు మోసుకోవడంతోనే సరిపోతోంది. ఇక ఏ పనులకు వెళ్లాలన్నా కుదరడం లేదు.
– ఎం. సుష్వాంత్, 8వ తరగతి, బాపట్ల


కంప్యూటర్‌ ఎవరు నేర్పిస్తారు!
నేను ఆలేరులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. మా స్కూలుకి కంప్యూటర్‌లు ఇచ్చారు. కంప్యూటర్‌ టీచర్‌ని నియమించలేదు. దాంతో అవన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. మాకు పీఈటీ టీచర్‌ లేరు. ఆట సామగ్రి లేదు. ఏటా మాకు దుస్తులు ఇచ్చేవారు. గడచిన ఏడాది ఇవ్వలేదు. పాత వాటినే వేసుకున్నాం. రాబోయే ఏడాదికైనా కంప్యూటర్‌ టీచర్‌ని నియమిస్తే మంచిగ నేర్చుకుంటాం.
– బి. సాయికుమార్, 8వ తరగతి, ఆలేరు, యాదాద్రి భువనగిరి జిల్లా


మద్యం సీసాలమయం!
మా స్కూలు భవనం పూర్తిగా కుంగిపోయి గోడలు పగుళ్లు బారాయి. వర్షం వస్తే స్లాబు కారుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. మరమ్మత్తులు జరగలేదు. హైస్కూల్‌లో బాలికలం ఉన్నాం. వాష్‌రూములు సరిగ్గా లేవు.
ఇంకా పెద్ద ఇబ్బంది ఏమిటంటే... మా స్కూలు సెలవు రోజు స్కూలు ఆవరణ తాగుబోతుల రాజ్యం అవుతోంది. ఫుడ్‌ పార్సిల్‌ కవర్లు, ఖాళీ మద్యం సీసాలను పడేస్తున్నారు. పగిలిన గాజు పెంకులతో ఆవరణంతా అసహ్యంగా ఉంటుంది. సోమవారం స్కూలు తెరవగానే మేము ఆవరణ అంతా శుభ్రం చేసుకోవాలి. ఒక్కోసారి గాజు పెంకులు గుచ్చుకుంటాయి కూడ. ఈ కష్టం తప్పించండి ప్లీజ్‌.
– బి. ఇందుమతి, పునాదిపాడు, కంకిపాడు, కృష్ణాజిల్లా

ఆటో బోల్తా...  చదువుకు డుమ్మా!
నేను రోజూ స్కూలుకి ఏడు కిలోమీటర్లు ఆటోలో వెళ్లేవాడిని. ఒక రోజు మా ఆటో బోల్తా పడింది. ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. దాంతో ఆ ఇద్దరూ బడి మానేశారు. మాకు హైస్కూలుకు పోవడం అంటే పరాయి దేశం పోయినట్లే. అంతగా భయపడతారు. ప్రాథమిక స్కూలుతోనే చదువాపేస్తున్నారు చాలామంది. మా తాండకు దారి సరిగ్గా ఉండదు. మట్టిబాటలో వెళ్లాలి. దాంతో మా ఊరికి బస్సులు లేవు. రోడ్డు వేసి బస్సులు వేస్తే మాలాంటి చాలా మంది చదువుకుంటారు. మా తండాలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. వీథిదీపాలు లేవు. ఇవన్నీ ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు. అందుకే పేపర్‌కు రాస్తున్నా.
– ఎం. అరవింద్‌ నాయక్, 10వ తరగతి, లత్తవరంతాండ, అనంతపురం జిల్లా

కాలువ పొంగితే...
విజయనగరం పట్టణంలో ఉడాకాలనీ మాది. కాలనీలో రోడ్డు మొత్తం బురదమయం. నీరు నిలిచి ఉంటుంది. పందులు తిరుగుతూ బురదను తిరగతోడుతుంటాయి. దోమలతో అంటువ్యాధులు వస్తున్నాయి. మురుగునీరు కాలువలో నుంచి పొంగి రోడ్డు మీదకు పారుతుంటుంది. ప్లాస్టిక్‌ సంచులు కాలువలను బ్లాక్‌ చేస్తుంటాయి. ప్రభుత్వం మా కాలనీ సమస్యలను పట్టించుకుని పరిష్కరించాలి.
– హర్షిత, 6వ తరగతి, కంటోన్మెంట్, విజయనగరం

నది దాటడం గగనమే..
మాది పందలపాక గ్రామం. నేను ఆరవ తరగతి చదువుకుంటున్నాను. మా పాఠశాలకు గ్రామానికి మధ్యలో తుల్యభాగా నది ప్రవహిస్తుంటుంది. దానిపై నిర్మించిన కాలిబాట వంతెన ఇరుకుగా ఉంది. అంతే కాదు... అది శిథిలావస్థకు చేరుకుంది. పాఠశాల దూరంగా ఉండడంతో సైకిల్‌ పై వంతెన దాటి వెళ్ళాలి. ఎప్పుడు విరిగిపడుతుందో తెలియనంతగా పాడైపోయింది వంతెన. చాలామంది పడిపోయారు, గాయాలయ్యాయి. వంతెన ఇరుకుగా ఉండడంతో గోడలు గీరుకుపోయి రక్తం వస్తుంటుంది. ఇదంతా మాకు రోజూ ఎదురయ్యే అనుభవం. దీంతో పాఠశాలకు వెళ్లే సుమారు 800 మంది విద్యార్థులం చాలా ఇబ్బంది పడుతున్నాం. స్కూలు పిల్లలమే కాదు పెద్దవాళ్లకు కూడా ఆ వంతెన మీద నుంచి ప్రయాణించాలంటే భయమే. మంచి వంతెన నిర్మిస్తే తప్ప మా కష్టాలు తీరవు.
– షేక్‌. ముమీనా, పడాల పెదపుల్లారెడ్డి జడ్పీ ఉన్నత
పాఠశాల, పందలపాక, బిక్కవోలు, తూర్పు గోదావరి జిల్లా


– సాక్షి నెట్‌వర్క్‌ సహకారంతో...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement