వేదన వాదన | Writer Chalam Story Review | Sakshi
Sakshi News home page

వేదన వాదన

Published Mon, May 13 2019 12:23 AM | Last Updated on Mon, May 13 2019 12:25 AM

Writer Chalam Story Review - Sakshi

‘యామయ్యా జడ్జీగారూ నాకు శిక్ష వేసేముందు నేను చెప్పే సంగతులు యోచించుకోండి! నాకు మల్లేనే మీకూ నవరుచులున్నాయి; నా మాదిరిదే మీ శరీరమూ; రక్తమూ, మాంసమూ– ఇనుము కాదు. నాలోనూ అందరిలోనూ వున్న ఆత్మే మీలోనూ ప్రకాశిస్తోంది. ఎంత రాయి చేసుకున్నా హృదయం మీలోనూ కొట్టుకుంటోంది. దోషాన్ని తూచి శిక్షలు తయారు చేసి నా మొహాన పారేసే మెషీను కాదు కదా! మీరు వినండి...నేను చెప్పేదంతా విని, న్యాయమని తోస్తే విడిచిపెట్టండి. వొదిలి పెట్టటానికి స్వతంత్రం లేదా? యీ ఉద్యోగం మానుకోండి ధైర్యం వుంటే. ధైర్యం లేక నిర్దోషిని శిక్షిస్తారా? కానీండి. నేను నిర్దోషిని. దోషినని నాతో వాదించి రుజువు చెయ్యి. ఆ ప్లీడరుని వూరుకోమను. వాళ్లకీ నిజంతో పనిలేదు, ఫీజుతో తప్ప. నా నేరం నేనే ఒప్పుకుంటున్నాను. సాక్షులతో పని లేదు; నీకు మెదడు వుంది. నాకూ వుంది. ఇద్దరం కలిసి యోచిద్దాము.

అవును, బిడ్డ పుట్టకుండా నేను గర్భం తీసేసుకున్నాను. అదెట్లా నేరమో చెప్పు? పుస్తకాల్లో తప్పని రాసివుంది; అలా తప్పనకు, పుస్తకాలు పురాతనాలు. ఆ రాసినవాళ్లు దుర్మార్గులు. బుద్ధిహీనులు. వాళ్ల మాట ప్రకారమే నడుచుకుంటే, మనకి వేరే మెదళ్లెందుకు? తెలివెందుకు? పుస్తకంలో అక్షరాలకి లొంగిపోతావా? నేను తిరగబడ్డాను. లోబడ్డావా, నువ్వు నాకంటె పిరికివాడివి– స్వతంత్ర యోచనలేని వాడివి– దోషివి– నీకేం అర్హత వుంటుంది నన్ను శిక్షించడానికి? వినుమరి– నేను మొదట చేసింది తప్పంటావా? ఆ పనిచేస్తే శిక్ష లేదు, మీ పుస్తకాల ప్రకారమే ఆ పనే తప్పంటావా? అది నువ్వు చేస్తున్న పనే భర్తలేనిది చెయ్యడం తప్పంటావా? భర్తవుండి కడుపు వచ్చినా, కడుపు తీసుకోడం నేరమేగా? అదిగాక కడుపు రాకుండా ఏం చేసినా తప్పులేదూ? వొస్తే మొదటినించీ అంతా తప్పా! కడుపురావడం నా తప్పుకాదు కదా! పెళ్లానికి పిల్లలు పుట్టకపోతే అది ఆమెది తప్పుగా చూసే మీరు, నాకు కడుపురావడం తప్పంటారా? గర్భం కలిగిం తరవాత యెందుకు తీసేసుకున్నావంటారు? నాకు అనేక కారణాలున్నాయి.

నన్ను పోషించేవాడు వొదిలేస్తాడు ఎట్లా బతకను? నాకింకేమీ కష్టంపని చేసుకుని బతకడం చేతకాదు. కూలి చేసుకోరాదా? వంట చేసుకోరాదా అని సులభంగా అంటారు. అందమైన కూలిదాన్నిగాని, వంటదాన్నిగాని బతకనిస్తారా మొగాళ్లు? ఇక్కడ వున్న వాళ్లందరూ అట్లాంటి మహానుభావులే. కోట్లూ, తలగుడ్డలూ పెట్టుకుని వెకిలి నవ్వులు కార్చుకుంటో, మీసాలు మెలేస్తో నావంత అతి తీవ్రంగా చూస్తో కూచుంటే సరా? మీ సంగతి ఎవరికి తెలీదు? మొగాళ్లు బలవంతం చేస్తే నీ నీతి ఏమయిందంటావు? తమకి లోబడకపోతే తమ పెళ్లాలతో సాడీలు చెప్పి పనిలోంచి తీసేయిస్తారు. ముందు మొగుళ్ల మీదనే సాడీలు చెప్పితే మొగుళ్లతో పోట్టాడినా, చివరికి ఆడవాళ్లూ నన్నే పొమ్మంటారు మర్యాదగా! నేనూ బతకాలి. ఎందుకు లోబడ్డావని అందరూ తిట్టేవాళ్లే! మీ భార్యల్ని అట్లా గదుల్లో దాచుకోకండా, కానీ లేకండా, నాకు మల్లే, వీధుల్లో పారెయ్యండి. వితంతువులు కాగానే ఏ బంధువుల ఇళ్లల్లోనో చాకిరీలకి చేర్తారే? అభిమానమున్నదాన్ని గనక ఆ నీచత్వం కన్న ఈ స్వతంత్రమే నయమనుకున్నాను. స్వతంత్రంగా సంపాదించమనండి ఓ దమ్మిడి మీ భార్యల్ని, తెలుస్తుంది. ఆ కులుకు, ఆ పాతివ్రత్యం అన్నీ యామవుతాయో! రెండు రోజులు యింట్లోంచి వెళ్లి బైట బతికి రమ్మందురూ తెలుస్తుంది సంగతి!
ఆ సంగతి పోనీండి. గర్భం రాగానే ఆయన నన్ను వదిలేశాడు, ఆకలెక్కువయింది, ఒంట్లో బాగాలేదు, మందులు కావాలి. ఏం చెయ్యను? మీ గుమ్మాల్లోకి వస్తే తరుముతారు. అవునా? పతివ్రతలు మీ భార్యలు. గుమ్మాలు కడుక్కుంటారు. మైలపడ్డామని నా నీడ తాకినచోట పేణ్ణీళ్లు చల్లి శుద్ధి చేస్తారు.

బిడ్డని కంటాననుకోండి. దాన్ని నువ్వు పెంచుతావయ్యా? పోనీ దాని పోషణకి కర్చు యిస్తావా? శరణాలయాలున్నాయి. కాని నీతియుక్తంగా కన్న పిల్లలని తల్లిదండ్రులు చస్తే తీసుకుంటారట. ఆ శరణాలయాలు పెట్టినవాళ్లు నీతియుక్తంగా పుట్టారేమో అసలు! వెధవ ముండాకొడుకని అందరూ యేడిపిస్తే ఎవరు ఓదారుస్తారు? నీ పిల్లలతో ఆడుకోనిస్తావా? నన్ను పోషించడమే మా ఆయనకి ఇంత కష్టంగా వుంది. రోజుకి మూడుసార్లు పొమ్మంటాడు. నేనైతే మాడి చస్తాను. వాణ్ణి ఎట్టా చంపుకోను? వాడి బాధ చూడలేక వాణ్ణి ఏ బావిలోనో తోసి నేను వురకాలి. పేపర్లో చదువుతారు. ఒక స్త్రీ పిల్లాణ్ణి చంపి తాను చచ్చిందని. దీనికేం పుట్టిందని తిట్టుకుంటారు. పేపరు మడిచి దీపమార్పి పడుకుంటారు. మరి ఆ ‘లా’ని యేర్పరచిన వాళ్లు మీరో మీ తాతలో, నాకు వెలి రాకుండా నా బిడ్డకి అమర్యాద రాకుండా కాపాడుతారా? ఆ సంగతి మీకేమీ తెలీదు. మీకు తెలిసినదల్లా నన్ను కైదులో పారెయ్యడమే. అవును నాకు వేరు గతిలేక ఆ దిక్కుమాలిన పిల్లకి ప్రాణమిచ్చి ఏడిపించడానికి కాఠిన్యం తక్కువై, తల్లిని గనక యీ పని చేశాను. మీ అభ్యంతరమేమిటి?

మొదటిది– ప్రాణం తీశానన్నారు. అది నాలో భాగమా వేరే ప్రాణమా? నాలో భాగం అయితే దాన్ని తీసేసుకుంటే మీకేం? నాకో కురుపు లేస్తే కోసేసుకోనూ? నా చెయ్యి కోసేసుకుంటా మీకేం? వేరే ప్రాణమా? నాది కాదా? అయితే నాలోపల దాన్నెవరు ప్రవేశించమన్నారు. నా అనుజ్ఞ లేంది? లోపల ప్రవేశించి నన్ను బాధించమన్నదెవరు? మీ అనుజ్ఞ లేకుండా మీ యింటోకి ఎవరన్నా వస్తే మీరేం చేస్తారు? అట్లానే నేనూ బైటికి తరిమేశాను. చస్తే నేనేం చెయ్యను? నేను రప్పించానా? లేదు. నాకు బిడ్డ పుట్టాలని యే మాత్రమూ లేదు. నాలోకి వచ్చి నా ఆరోగ్యం, నా సౌందర్యం చెడగొట్టి, నా మానం తీసేస్తే బాగానే వుంది? నేనెందుకు దాన్ని కాపాడాలి? దాని కోసమా? అవును మీ కోసములాగే వుంది. మీరందరూ దాన్ని తిట్టి వెక్కిరించి మీ పతివ్రతల్ని మీ పిల్లల పవిత్రపు పుటకల్నీ సమర్థించుకునేందుకు. నా యిష్టం వచ్చిన మందు నేను మింగుతాను. దాన్ని చావమన్నదెవరు? మీ పొట్టలో పాములు చేర్తే అవి చావడానికి బాగానే మందులు తాగుతారే?

దాని కసలు ప్రాణమున్నదని మీకెట్లా తెలుసును? భూమిమీద పడంది వూపిరన్నా పీలవదు. ప్రాణమున్నదని నీకేం తెలుసు? నువ్వెప్పుడన్నా కడుపుతో వున్నావా? జడ్జీ నీకేం తెలుసు? పుట్టిన బిడ్డ తిండి లేక మాడి చస్తే నీ ప్రాణం సుఖంగా వుంటుందా? నీ కళ్లు చల్లగా వుంటాయా? మరి ప్రాణం తీసిన వాళ్లకి వురిశిక్ష కదా! అది వెయ్యరేం నాకు? అంటే పూర్తి ప్రాణం కాదన్నమాట. అర ప్రాణం, పావు ప్రాణం వుంటుందా? అర ఆత్మ, పావు ఆత్మ వుంటాయా? నిండు ఆత్మలు మీకున్నాయా? వుంటే నన్నెందుకిట్లా యేడిపిస్తారు? మిమ్మల్ని చంపినా తప్పులేదు అయితే! కోడిగుడ్డుకి ఎన్నో వంతు ప్రాణం? గొర్రెకి వాటి ఆత్మ వుందా లేదా! అట్లా చూస్తావేం? నీకేం తెలుసునని కూచున్నావు నన్ను శిక్షిస్తానంటో... నా ఆరోగ్యం చెడిపోతుందంటారా? కాఫీ హోటల్లో చెడ తినే వారినీ, పసి భార్యలకోసం మందులు తినే ముసలివాళ్లనీ దండించరేం? నలభై యేళ్లకే మూలశంకలూ, అతి మూత్రాలూ తెచ్చుకునే జడ్జీలని దండించరేం? దిక్కుమాలినదాన్ని నేను దొరికానా? నా ఆరోగ్యం పోతే ఎవడికేం? నా ప్రాణం పోతే ఎవడికేం? దుర్మార్గంలో పడి యెట్లా చచ్చిందోనని నన్ను చూసుకు సంతోషంతో కడుపు నింపుకుంటారు మీ భార్యలు.

దీన్ని చంపినందుకు లోకంలో మనుషులు తక్కువవుతారంటారా మీరందరూ? పుణ్యాత్ములు మీరున్నారు చాలదూ? కనకుండా వున్న ప్రతి ఆడదాన్నీ శిక్షించండి, వితంతువులందర్నీ కనిపించండి బలవంతంగా! మీ జనసంఖ్య పెరగడానికి యింకో జీవాన్ని నన్ను మోయమనడానికి మీరెవరు? సృష్టి సాగదంటారా? నాకేం? నీకు సృష్టి సాగిస్తానని పూచీకత్తు నిచ్చానా? అసలు నన్ను కనవద్దని సంఘం అజ్ఞాపించిందిగా. ‘లా’ కనమంటోంది. కంటే సంఘం, కనకపోతే ‘లా’ శిక్షిస్తాయి. మరి సంఘమేగా ‘లా’ని ఏర్పరిచింది. సృష్టి నాలో యింకో జీవాన్ని పెట్టింది. దాన్ని తీసుకునే శక్తిని యిచ్చింది. మధ్య మీకెందుకు? ఏమంటావు, నన్ను వొదులుతావా? నీ వుద్యోగం పోతుందని భయమా? నీ వుద్యోగం కోసం నన్ను నిర్దోషిని శిక్షిస్తావా? ఇదేనా నీతి, యిదేనా పుణ్యం, చెప్పు జవాబు?
మహారచయిత చలం (19 మే 1894 – 4 మే 1979) కథ ‘ఆర్గ్యుమెంటు’ పూర్తిపాఠం ఇది. చలం జయంతి, వర్ధంతి ఇదే నెలలో.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement