సరైన శారీరక శ్రమ లేకపోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, టీ, కాఫీలు ఎక్కువగా తాగడం, ధూమపానం, మద్యపానం, జంక్‌ఫుడ్, మసాలాలను అధికంగా ఆహారంలో భాగం చేయడం, మానసిక ఒత్తిడి... వంటివి గ్యాస్ట్రిక్ తత్సంబంధిత సమస్య అయిన ఎసిడిటీలకు కారణంగా మారతాయి. ఇదే కాకుండా ఈసోఫేగస్ స్ప్రింక్టర్‡ బలహీనంగా ఉండడంతో పొట్ట లోపల గ్యాస్ వెనకకు తన్నడం వల్ల కలిగే రిఫ్లక్స్ సమస్య కూడా కారణం కావచ్చు. ఎసిడిటీ ఎక్కువ అయినప్పుడు పొట్టలో గ్యాస్ సమస్యతోబాటు నాసియా, వాంతులు, ఛాతీనొప్పి, కడుపులో మంట వంటి సమస్యలు కూడా కనపడతాయి. ఈ సమస్యను ఆహారంలో మార్పులతో చాలా వరకూ పరిష్కరించవచ్చు. క్షారతత్వంతో ఉండే ఆహారాన్ని 60 నుంచి 80 శాతం వరకూ తీసుకోవాలి. సలాడ్స్, పండ్లు, ఉడకబెట్టిన కూరలు, పాలకూర జ్యూస్, పాలక్ సూప్ వంటివి బాగా తీసుకోవాలి.
పవన ముక్తాసనం
వెల్లకిలా పడుకుని రెండు కాళ్లు మడిచి పొట్టకు దగ్గరగా తీసుకు వచ్చి, రెండు చేతులు మోకాళ్లకు దగ్గరగా నొక్కుతూ శ్వాస వదులుతూ తలను పైకి లేపి నుదురును మోకాలికి దగ్గరగా తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి. ఈ స్థితిలో ఉండి ముందుకు, వెనుకకు, స్వింగ్ అయినట్లయితే దీనినే డోలాసనం అంటారు. ఇదే స్థితిలో కుడి పక్కకు, ఎడమపక్కకు కూడా రోల్ అవవచ్చు. ముందుకు 5 నుంచి 10 సార్లు స్వింగ్ అవడం, అలానే పక్కకు 5 నుంచి 10 సార్లు రోల్ అవడం చాలా ముఖ్యం. ఇది అన్ని వయసుల వారు సులభంగా చేయవచ్చు. అయితే వెన్నెముక సమస్య ఉన్నవారు జాగ్రత్తగా సాధన చేయాలి.
ఏకపాద పవన ముక్తాసనం
వెల్లకిలా పడుకుని కుడికాలుని ముందుకు సాగదీసిన స్థితిలో ఉంచి ఎడమ మోకాలిని మడిచి రెండు చేతులతో పట్టుకుని పొట్టకి గట్టిగా అదుముతూ శ్వాస వదులుతూ తల వీపు భాగాన్ని నెమ్మదిగా పైకి లేపుతూ నుదురు ఎడమ మోకాలుకు దగ్గరగా తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి. శ్వాస తీసుకుంటూ తలను వెనుకకు, ఎడమకాలను కిందకు, తీసుకొచ్చి తిరిగి విశ్రాంత స్థితిలోకి రావాలి, దీనిని 3 లేదా 5 సార్లు రిపీట్ చేసి తిరిగి రెండో కాలితో కూడా ఇదే విధంగా సాధన చేయాలి.
ఆహార నియమాలు పాటిస్తూనే... యోగాలో కొన్ని ఆసనాలు పూర్తిగా దీనికి ఉద్దేశించిన వి ఉన్నాయి. అన్ని ఆసనాలతో పాటుగా కింద చెప్పిన ఆసనాలు కూడా నిత్యం సాధన చేయడం ద్వారా ఈ సమస్యను మరింత తేలికగా పరిష్కరించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment