ఫ్యాట్ జీరో
తీరైన తీగలాంటి శరీరాకృతినిస్తాయి ఈ యోగాసనాలు. శరీరంలో పేరుకుపోయిన అనవసరపు కొవ్వును ఇవి ఇట్టే కరిగిస్తాయి. ఛాతీకి, ఉదర భాగానికీ చక్కని టోనింగ్ ఇస్తాయి. భుజాలు. తొడలు, పొట్ట దృఢంగా మారడానికి ఉపయోగపడతాయి.
ఏకపాద రాజకపోతాసన
అధోముఖ శ్వాసాసనం లేదా పర్వతాసనంలో ఉండి (సూర్య నమస్కారంలో 8వ భంగిమ. రెండు అరచేతులు రెండు అరిపాదాలు భూమి మీద ఉంచి నడుమును పైకి లేపి, భూమికి త్రికోణంలా ఉండాలి) శ్వాస తీసుకుంటూ ఎడమకాలిని మడిచి మోకాలిని ముందుకు, ఎడమ మడమను జననేంద్రియాలకు దగ్గరగా, కుడికాలిని వెనుకకు స్ట్రెయిట్‌గా బాగా స్ట్రెచ్ చేయాలి. రెండు అరచేతులు నడుము భాగాలకు పక్కన నేల మీద ఉంచి సపోర్ట్ తీసుకుంటూ ఛాతిని ముందుకు ప్రొజెక్ట్ చేస్తూ మెడని తలను వీలైనంత వెనుకకు వ ంచి నెమ్మదిగా కుడికాలిని మడిచి కుడిచేత్తో కుడికాలి మడమను పట్టుకుని,
శరీరానికి వెనుక వీపునకు వీలైనంత దగ్గరగా కుడిపాదాన్ని లాగుతూ ఎడమ చేతిని పైనుంచి తీసుకుని రెండు చేతులతో కుడి కాలివేళ్లను లేదా పాదం ముందు భాగాన్ని పట్టుకుని వీలైతే తల మూడు భాగాలను కుడి అరిపాదానికి ఆనించే ప్రయత్నం చేయవచ్చు. ఇదే విధంగా శ్వాస వదులుతూ మళ్లీ వెనుకకు పర్వతాసనంలోకి వచ్చి తిరిగి రెండోవైపు కూడా చేయాలి. ఇది చేయడానికి ముందు భుజంగాసనాన్ని బాగా సాధన చేస్తే శరీరం కొంచెం తేలికగా వెనుకకు వంగుతుంది. ఒక వేళ ఫొటోలో చూపిన విధంగా చేయలేకపోతే ఏదైనా ఒక టవల్ లేదా తాడును కుడి కాలి మడమ చుట్టూ పోనిచ్చి తాడు ఆధారంగా చేయవచ్చు.
జాగ్రత్తలు
మోకాళ్లు బలహీనంగా ఉన్నా, మోకాలు, మడమ, కాలి ఎముకలకు గతంలో ప్రాక్చర్స్ అయి ఉన్నా ఈ ఆసనం చేయకపోవడం మంచిది. మోకాళ్ల కింద సపోర్ట్‌గా ఏదైనా టర్కిష్ టవల్ కానీ పలచని దిండు కానీ ఉపయోగించండి.
ఉపయోగాలు
గజ్జలు, తొడలు, పొట్టలో అవయవాలు, ఛాతీ, భుజాలు సాగదీయబడతాయి. వెన్నెముకకు, థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్రంథులకు మంచిది. మూత్రనాళ సమస్యలకు పరిష్కారంగా పనిచేస్తుంది.
ధనురాసన
నేల మీద పూర్తిగా బోర్లాపడుకుని శ్వాస వదులుతూ మోకాళ్లను వంచాలి. పాదాలను పైకి లేపి కుడిచేత్తో కుడికాలి మడమను, ఎడమచేత్తో ఎడమకాలి మడమను పట్టుకుని శ్వాస తీసుకుంటూ.. ముందు తలను, ఆ తరువాత ఛాతీ భాగాన్నీ పైకి లేపుతూ తలను వెనుక కాళ్లను సమాంతరంగా పొట్టను నేల మీదకు గట్టిగా నొక్కుతూ పైకి లేపే ప్రయత్నం చేయాలి.
ఈ ఆసనంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వేగంగా ఉంటాయి. మోకాలు భాగాలు తొడ భాగాలు కూడా పైకి లేపి ఉంచాలి. కేవలం కటిభాగం ఉదరభాగం (కిందిపొట్ట) ఆధారంగా ఈ ఆసనం చేయాలి. ఆసనంలో ముందుకు వెనుకకు రోల్ అవ్వడం చాలా ముఖ్యం. శ్వాస వదిలినప్పుడు తల ఛాతీ నేలకు దగ్గరగా వెనుక కాళ్లు పైకి, శ్వాస తీసుకునేటప్పుడు తల ఛాతీ నేలకు దూరంగా పైకి వెనుక తొడలు మోకాళ్లు భూమికి దగ్గరగా తీసుకురావాలి.
అదేవిధంగా పొట్టను నేల మీదకు గట్టిగా నొక్కుతూ ధనురాసనంలో ఉండి పక్కలకు కూడా రోల్ అవ్వడం ముఖ్యం. ఈ ఆసనం ప్రతి ఒక్కరూ తేలికగా చేయగలరు. ఆసనంలో తల ఛాతీ భాగాలు, మోకాళ్లు తొడల భాగాలు ఎంత పైకి ఎత్తగలుగుతారు అనేది మాత్రం వాళ్లు నిత్యం చేసే సాధన మీదనే ఆధారపడి ఉంటుంది. ఇక స్థూలకాయులు రెండు చేతులతో రెండు మడమలు ఒకేసారి పట్టుకోలేకపోవచ్చు. అలాంటప్పుడు టవల్ కానీ, తాడు కానీ ఉపయోగించి చేయవచ్చు.
ఉపయోగాలు: తొడలు, గజ్జల భాగం బాగా ఓపెన్ అవుతాయి. ఛాతీ ఉదర భాగాలకు చక్కటి టోనింగ్ జరుగుతుంది. జీర్ణశక్తికి చాలా మంచిది. నడుము చుట్టూ, తొడలలో, పొట్ట భాగాలలో ఉన్న కొవ్వు కరగడానికి ఇది చాలా చక్కటి ఆసనం.