అమ్మో ఎంత ధైర్యం ఈ పిల్లకి..! | You Can Not See our Beautiful face. He will Hide his Beauty for Me | Sakshi
Sakshi News home page

ఈయనే అందమైన నా శ్రీవారు

Published Sat, Apr 13 2019 1:36 AM | Last Updated on Sat, Apr 13 2019 7:52 AM

You Can Not See our Beautiful face. He will Hide his Beauty for Me - Sakshi

లైంగిక వివక్షపై ఒక యువతి నెట్‌లో విసిరిన వ్యంగ్యాస్త్రం నవ్వుల పువ్వుల్ని పూయించడమే కాదు.. సమాజంలోని అసమానతలపై ఆలోచననూ రేకెత్తిస్తోంది.

‘‘అమ్మో ఎంత ధైర్యం ఈ పిల్లకి! పెళ్లయిన కొత్తలోనే భర్తను కొంగుకు ముడేసుకుందే. ఓ ఆడపిల్ల మాట్లాడాల్సిన మాటలేనా ఇవి. అయ్యో అయ్యో భర్తకే ముసుగేస్తుందా! పాకిస్తాన్‌లో ఉండి కూడా పితృస్వామ్య వ్యవస్థ గురించి ఇలాంటి వెటకారాలు చేస్తుందా. ఈ అమ్మాయికి బుద్ధి చెప్పాల్సిందే’’.. అంటూ కొంతమంది సంప్రదాయ వాదులు బుగ్గలు నొక్కుకున్నా పర్లేదు నా తీరు మార్చుకోను అంటున్నారు ఈ ఫొటోలో కన్పిస్తున్న ఈ వివాహిత! పైగా ‘‘మీలాంటి వాళ్ల కోసమే.. ఇలాంటి పోస్టు పెట్టాను. ఇప్పటికైనా ఆడ, మగ అంతా సమానమని గుర్తిస్తే ఇలాంటి సన్నాయినొక్కులు నొక్కాల్సిన అవసరం రాదంటూ’’ ఘాటుగా కౌంటర్‌ కూడా ఇచ్చారు. విమర్శలు లెక్కచేయక తన కొత్త జీవితానికి సంబంధించిన విశేషాలను జోడిస్తూ ‘న్యూలీవెడ్స్‌’ అనే ఇన్‌స్టా అకౌంట్లో తన భర్తతో కలిసి దిగిన ఈ ఫొటోను పోస్ట్‌ చేసి అనాదిగా కొనసాగుతున్న లింగ వివక్షను ఇన్‌డైరెక్టుగా ఎత్తిచూపారు.

‘‘ఈయనే అందమైన నా శ్రీవారు. కానీ మా ఆయన అందమైన ముఖాన్ని మీరు చూడలేరు. నా కోసం ఆయన తన అందాన్ని ఇలా దాచుకుంటారు. ఎందుకంటే ఆయన అందం, సాధించిన విజయాలు, కలలు ఇలా ఒక్కటేమిటి తన జీవితానికి సంబంధించిన ప్రతీ విషయానికి నేనే హక్కుదారును కదా. తనకు దిష్టి తగలకూడదనే ఈ పాడు ప్రపంచానికి దూరంగా.. తననెప్పుడూ ఇంట్లోనే ఉండమంటాను. అయితే నాతో పాటు అప్పుడప్పుడూ బయటికి తీసుకువెళ్తా. నిన్న రాత్రి తనను డిన్నర్‌కు తీసుకువెళ్లాను. అక్కడ స్టెరాయిడ్‌ ఫ్రీ చికెన్‌ మాత్రమే ఆర్డర్‌ చేశాం. ఎందుకంటే తన ఆరోగ్యం గురించి నాకు శ్రద్ధ ఉంది.

ఒకవేళ ఇలాంటి ఆహారం తినడం వల్ల సంతాన భాగ్యానికి భంగం కలిగితే ఎలా? అసలు ఆయన ఉన్నదే నన్ను తల్లిని చేయడానికి. పిల్లల్ని కనివ్వడానికి. అందుకే ఏం తినాలో ఏం తినకూడదో నేనే నిర్ణయిస్తా. తనను బయటికి తీసుకువెళ్లినపుడు ఇలా దాచేస్తా (ముసుగు వెనుక). ఒకవేళ ఆయన అందానికి ముగ్ధులై ఎవరైనా వేధిస్తే? వేధించారే అనుకోండి అప్పుడు వాళ్లను ఎవరో శిక్షిస్తారని సరిపెట్టుకుంటా’ అంటూ ఓ పాకిస్తానీ వివాహిత ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్‌ చేసిన స్టోరీ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తన భర్తకు బుర్ఖా వేసి.. అతడితో దిగిన సెల్ఫీని పోస్ట్‌ చేసిన ఈ మహిళ లింగ వివక్ష, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అంతా నా ఇష్టం
‘‘వేరే వాళ్లకే నేను నియమాలు విధిస్తా. నేను మాత్రం నా ఇష్టం వచ్చినట్లుగా ఉంటా. ఎలాంటి దుస్తులైనా సరే వేసుకుని తిరుగుతా. ఎందుకుంటే నేను ఆడదాన్ని. ఇతర ఆడవాళ్ల గురించి పట్టించుకోను. ఒకవేళ నాపై ఎవరైనా దాడి చేసినా, ఏమైనా అన్నా తిరిగి మాట్లాడను. అలా చేస్తే నేను పిరికిదాన్నని ఈ లోకం భావిస్తుంది. ఆడవాళ్లు బలహీనంగా ఉండకూడదు కదా. నేను మరీ అంత లింగ వివక్ష చూపనులెండి. మా ఆయన డ్రైవింగ్‌ చేసేందుకు అనుమతిస్తా. ఉద్యోగానికి పంపిస్తా. అయితే అక్కడ ఆయన ఎవరితోనైనా మాట్లాడటం పూర్తిగా నిషిద్ధం. నా భర్తను కాపాడుకోవాలంటే కేవలం ఇలా చేస్తే చాలు’’ అంటూ సదరు వివాహిత పితృస్వామ్య వ్యవస్థ తీరును ఎండగట్టారు.

సెటైర్‌లు.. సెల్యూట్‌లు
‘‘మీ భర్త ఉద్యోగం చేయడానికి అనుమతించకండి. ఇలా చెప్పడం వెనుక ఏ లాజిక్‌ లేదు. కానీ మీరు మగవారిని అలా ఒంటరిగా బయటకు పంపకండి. ఇంకో విషయం మీ భర్త ముఖం ముసుగులోంచి నుంచి కూడా కనిపిస్తోంది. సరిగ్గా కవర్‌ చేసుకోమని చెప్పండి’ అంటూ కొంతమంది ఆమెకు మద్దతుగా నిలుస్తుండగా మరికొంత మంది నెటిజన్లు మాత్రం ‘ఇదేం విడ్డూరం’ అంటూ వెటకారపు కామెంట్లు చేస్తున్నారు. ‘అయినా ఒక భర్త తన భార్యను ఏవిధంగా ‘ఉండాలని’ భావిస్తాడో అదే విధంగా భార్య కూడా భావించడంలో తప్పేం ఉంది. ఆడ, మగ ఇద్దరూ మనుషులే కదా. మీరు చెప్పింది 100 శాతం నిజం. సెల్యూట్‌ మేడమ్‌’ అని అని మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. 
-సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌ డెస్క్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement