మీరు చాలా అదృష్టవంతులు!
మా రోజులతో పోలిస్తే ఈరోజుల్లో యువతకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. విస్తృతమైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. యువత తమ లక్ష్యాన్ని చేరువకావడానికి ఒక సులువైన దారి ఏర్పడి ఉంది. అందుకే అంటున్నాను...మీరు అదృష్టవంతులని.
మా నాన్నగారు నాకో మంచి సలహా ఇచ్చారు:
‘‘నువ్వు ఏదైనా కోరుకుంటే- ఆ కోరుకున్నది లభిస్తే... మంచిది. నువ్వు కోరుకున్నది లభించకపోతే- ఇంకా మంచిది!
ఎందుకంటే ఒకటి జరగడం, జరగకపోవడం అనేది నీ కృషితో పాటు భగవంతుడి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మనకు చెడు చేయాలని ఆయన అనుకోడు కదా!’’కోరుకున్నది దొరకనంత మాత్రాన నిత్య అసంతృప్తితో జీవితాన్ని వృథా చేసుకోవద్దని, చేస్తున్న పనికి చిత్తశుద్ధితో న్యాయం చేయాలనీ అనేవారు ఆయన.
ఇక జయాపజయాల గురించి వస్తే, విజయం ఒక్కసారిగా వచ్చి మన ముందు నిల్చోదు. పరాజయాలు మన ఓపికను పరీక్షిస్తాయి. నా విషయానికి వస్తే, కెరీర్ మొదట్లో రకరకాల అవమానాలు ఎదుర్కొన్నాను. ‘ఒకరితో మాట పడడం ఎందుకు?’ అని అని నేను అనుకొని ఉంటే, హీరోను అయ్యేవాడిని కాదు. నలుగురికీ తెలిసేవాడిని కాదు.
లక్ష్యాన్ని చేరుకుంటామా? లేదా? అనేది వేరే విషయం...ముందు ఒక లక్ష్యం అంటూ ఏర్పరుచుకోవడం అనేది చాలా ముఖ్యం. మరి మీరు?