భగభగలాడే భూమి పొరల నుండి వెలికితీసి, మరిగించి, కరిగించి పోత పోసేది, మన ఒంటి మీది బంగారం అయితే భగ భగలాడే బాణలిలో ఉడికించి, మరిగించి, కరిగించి, పోపించి, వడ్డించేది మన కంచంలోని బంగారం. ఆ కమ్మటి వాసనను ఎగబీల్చి, ‘ఈ వంట చేసిన ఆవిడ ఎవరో’ అని అనుకుంటే పొరపాటే. వంట ఒక్క ఆడవాళ్ల సొత్త్తే కాదు, మేము కూడా చేయి కాల్చుకోగలం అని నిరూపించారు ఈ ముగ్గురు కుర్ర షెఫ్‌లు. ఇంజినీరింగో, ఎంబియే అనో వెళ్లకుండా పాకశాస్త్ర పట్టా పుచ్చుకొని, ఆ రంగంలో కొత్త రుచులు సృష్టిస్తున్న ఈ ముగ్గురి గురించి...
1- ‘‘ఎవరైనా 8వ తరగతి చదివే విద్యార్థిని, ట్యూషన్‌కో, ఐఐటీ కోచింగ్ సెంటర్స్‌కి వర్క్ షాపులకు పంపుతుంటారు. నన్ను మాత్రం హైదరాబాద్ పార్క్ హోటల్లోని పేస్ట్రీ అండ్ బేకరీ వర్క్‌షాప్‌కి పంపించారు నా తల్లిదండ్రులు. ఎందుకో తెలియదు కానీ చిన్నప్పట్నుంచీ వంటలంటే చాలా ఆసక్తి. ఏదైనా తినగానే ఒక అద్భుతమైన ఫీలింగ్ కలిగేది. దాని వెనుక ఉన్న మేజిక్ ఏంటో తెలుసుకోవాలని ఎప్పుడూ అనిపించేది. హాస్టల్లో ఉండి చదువుకునేప్పుడు, వారానికి రెండు మూడు రోజులైనా స్కూల్ కిచెన్‌లోకి వెళ్లి అంతా అబ్జర్వ్ చేసేవాడిని. నా ఆసక్తిని గమనించి మా పేరెంట్స్ నన్ను ఆ రంగం వైపు వెళ్లేందుకు ప్రోత్సహించడమే కాక, కలినరీ ఆర్ట్స్‌లో ఫ్యూచర్ ప్లానింగ్‌లోనూ సాయం అందిస్తున్నారు.
ఆ వర్క్ షాప్ నా జీవితాన్నే మార్చేసిందని చెప్పాలి. షెఫ్‌లకు ఉండే విలువ, ఆదరణ కళ్లారా చూశాను. ఇద్దరు, ముగ్గురు షెఫ్స్ ఫోన్ నంబర్లను తీసుకుని, వారితో ప్రతిరోజూ మాట్లాడేవాడిని. రకరకాల వంటల గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకునేవాడిని. స్కూల్‌కి వెళ్లడం, హోమ్ వర్క్ చెయ్యడం, షెఫ్‌లతో మాట్లాడటం, లేదంటే ఏదైనా వంట చెయ్యడం... ఇదే పని! దాంతో మా ఫ్రెండ్స్ నాకు ‘బావర్చి’ అని నిక్ నేమ్ పెట్టారు. నాకు పేస్ట్రీల మీద ఎక్కువ ఆసక్తి. ఆ ఆసక్తితోనే పార్క్ హోటల్లో జూనియర్ గౌర్మెట్ షెఫ్‌గా చేరాను. అక్కడ 5000 బ్రెడ్ పీసెస్‌తో రాష్ట్రంలోనే అతి పెద్ద జింజర్ డ్రెడ్ హౌస్‌ని నిర్మించాం. అందులో నేనూ ఒకణ్ణి అవ్వడం నా అదృష్టం. ఎన్నిసార్లు చేతులూ, వేళ్లూ కాల్చుకున్నా వాటినుండి కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాను.
2- మాది మధ్య తరగతి కుటుంబం. మా నాన్నగారు ఛత్తీస్‌గడ్‌లోని ఒక నర్సింగ్ కాలేజీలో, అమ్మ ఓ హాస్పిటల్లో పని చేస్తారు. చిన్నప్పట్నుంచీ నాకు ‘ఇది అవ్వాలి’ అనే క్లారిటీ లేదు. తల్లిదండ్రులు, మెడికల్ ఫీల్డ్‌లో పని చేస్తుండటంతో డాక్టర్ అవుదామని ఇంటర్ తరువాతCOMEDKలో మంచి ర్యాంక్ సాధించా! కానీ అందరూ వెళ్లే దారిలోనే వెళుతున్నానని వెలితిగా అనిపించేది. అంతేకాక నేను ఎమ్‌బీబీఎస్ చేస్తే, మా తమ్ముడు కూడా నన్ను ఫాలో అయి ఎమ్‌బీబీఎస్ కానీ ఇంజినీరింగ్ కానీ చేస్తేనో? కనీసం మా ఇంట్లో ఈ పరిస్థితి మార్చాలనుకున్నాను. అందుకే ఎవరూ ఎన్నుకోని ప్రొఫెషన్ని ఎంచుకుందామని నిర్ణయించుకున్నాను. చిన్నప్పట్నుంచీ మా అమ్మ నాకు వండి తినిపించడమే కాక, వంట ఎలా చెయ్యాలో కూడా నేర్పేది. అందుచేత వంట అనేది నాకు చిన్నప్పట్నుంచీ ఉన్న హాబీ. అలాగే చిన్నప్పట్నుంచీ సంజీవ్ కపూర్ గారంటే ఒక ఆరాధ్యభావం. అంత సులువుగా వంట ఎలా చేసేవారా అని ఆశ్చర్యపోయేవాణ్ణి! అందులో కిటుకేంటో తెలుసుకుందామని ఈ వృత్తి ఎన్నుకున్నాను. మా ఇంట్లో కూడా ఓకే అన్నారు. వండటం అనేది కళ. ఒక చిత్రకారుడు చిత్రం వేసే ముందు రంగుల్ని కలుపుతాడు. నేను దినుసుల్ని కలుపుతాను. ‘ఎవరి హృదయాన్నయినా చేరుకోవాలంటే ముందు వారి కడుపుని శాంతపరచడమే మార్గం’ - ఇది ఇన్నేళ్ల వంట గది ప్రయాణంలో నేను నేర్చుకున్నది. ఐహెచ్ఎమ్లో చేరాక, వంట అంటే కేవలం గిన్నె, గరిటెల్లోనే ఉండేది కాదని తెలుసుకున్నాను. ఈ కలినరీ ఆర్ట్స్ వల్ల క్రమశిక్షణ అలవడుతుందని తెలుసుకున్నాను. ఈ రంగంలో జీతం బాగుంటుంది. మన దేశంలోనే కాక, విదేశాల్లో కూడా కోర్సులు చేసి, సొంతంగా ఒక ఇండియన్-ఇటాలియన్ రెస్టారెంట్ పెట్టాలనేది నా కోరిక.
3- ‘‘తండ్రి సైంటిస్టు. అన్న లా స్టూడెంట్. ఇంట్లో ఇద్దరు గొప్ప విద్యావంతులున్నా నాకు స్ఫూర్తినిచ్చింది మాత్రం నిరక్షరాస్యురాలైన మా అమ్మే. బీహార్‌లోని ససరం అనే చిన్న ఊరు మాది. ఇంటర్లో అవినాష్ అనే మిత్రుడుండేవాడు. అతను వంట చేయడంలో సిద్ధహస్తుడు. అతని స్ఫూర్తితో ఇంటర్ తర్వాత కలినరీ ఆర్ట్స్‌లో చేరాను. వంటలలో బేసిక్స్ మా అమ్మ దగ్గర నేర్చుకుంటే, నూతన టెక్నిక్స్‌ను మా స్నేహితుడి వద్ద నేర్చుకున్నాను. ఐహెచ్ఎమ్లో కోర్స్ పూర్తిచేసి ప్రస్తుతం లెమన్ ట్రీ ప్రీమియర్‌లో షెఫ్‌గా చేస్తున్నాను. సామర్థ్యం, మెళకువలతో పాటు దీక్ష, ఓపిక ఈ రంగానికి అవసరం.
కుకింగ్ అనేది వేరొకరి మీద ప్రేమని చూపించే కళ. ఒక పెయింటింగ్‌నో, పొయిట్రీనో చూసినప్పుడు కలిగే భావన ఒక మంచి వంటకం తిన్నా కలుగుతుంది. అంతేకాక వంటల్లో మనం రకరకాల ప్రయోగాలు చేయొచ్చు. అందుకే కుకింగ్ ఒక కళే కాదు, సైన్సు కూడా! ప్రతి వంటా ఒక సంప్రదాయాన్ని సూచిస్తుంది. ఆ సంప్రదాయాన్ని వేరే వారికి పరిచయం చేయడమే నా ధ్యేయం. అందుకే మారుమూల ప్రాంతాల్లో వంటకాలను రెసిపీలను యూ ట్యూబ్‌లో పెడుతున్నాను. అంతేకాక వాటి గురించి ఒక పుస్తకం కూడా రాస్తున్నాను.
ఎక్కువ మంది ఈ రంగం మీద ఆసక్తి ఉన్నా చేరరు. డబ్బు తక్కువ వస్తుంది అనేది ఒక కారణం. కాని అది పూర్తిగా నిజం కాదు. మొదట ఒకటి రెండేళ్లు అరకొరగా ఉన్నా, ఎక్స్పీరియన్స్ పెరిగేకొద్దీ జీతం విపరీతంగా పెరుగుతుంది. లక్షలు సంపాదించే షెఫ్‌లు కూడా మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. కానీ ఏ పని చేసినా తృప్తి అనేది ముఖ్యం. అది ఈ రంగంలో భాండాలకొద్దీ దొరుకుతుంది. నా మట్టుకు నాకు నేనే ఒక ఫుడ్ డాక్టర్... ఫుడ్ ఇంజినీర్!
కుకింగ్లు!
Published Wed, Jul 9 2014 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 10:03 AM
Advertisement
Advertisement