మీకు తక్షణ శక్తినిచ్చేది - విలాస విద్య | Your instant energy is Luxury education | Sakshi
Sakshi News home page

మీకు తక్షణ శక్తినిచ్చేది - విలాస విద్య

Published Sun, May 8 2016 12:24 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

మీకు తక్షణ శక్తినిచ్చేది - విలాస విద్య - Sakshi

మీకు తక్షణ శక్తినిచ్చేది - విలాస విద్య

 విద్య - విలువలు
లోకంలో లౌకిక విద్య అని, విలాస విద్య అని రెండుంటాయి. లౌకిక విద్య కడుపునింపడానికి పనికొస్తుంది. మీరు చదువుకున్న బీటెక్, ఎంటెక్, ఎంబీబీఎస్... ఇవన్నీ మీ సామాజికహోదాను నిర్ణయిస్తాయి. మీరు చదువుకున్న చదువుకు మీకో ఉద్యోగం, ఉపాధి లభిస్తాయి. దాన్నిబట్టి మీకు కొంత సంపాదన వస్తుంది. ఇది మీకు సామాజిక భద్రతను కల్పిస్తుంది. మీకు పాలుపోసేవాడు కావచ్చు, మరొకడు కావచ్చు మిమ్మల్ని నమ్మడానికి ఈ సామాజిక భద్రత, హోదా పనికొస్తాయి.

 విలాస విద్య అని మరొకటుంది. ఇది ప్రతివాళ్లకూ కావాలి. ఇది లేదు- అంటే వ్యక్తిలోనో, స్వభావంలోనో ఏదో లోటు ఉందని గుర్తు. ఇది ఆత్మపోషణ కోసం, ఆత్మ సంతృప్తికోసం పనికొస్తుంది. పూర్వం ఉన్న గురుకుల విద్యాభ్యాసానికీ, ప్రస్తుత విద్యావిధానానికీ ప్రధాన వ్యత్యాసం ఇక్కడే ఉంది. విలాసవిద్య అంటే హాబీ. నేను కేంద్ర ప్రభుత్వంలో ఒక ఉద్యోగిని. అది నేను లౌకికంగా చదువుకున్న చదువు ద్వారా లభించింది.  నా ఆత్మ సంతృప్తిపొందడానికి, ఆత్మపోషణకు అది కారణం కాలేదు. 

కానీ నాకు ఆర్ష వాఙ్మయం అంటే చాలా ఇష్టం. రామాయణ, భారత, భాగవతాలు చదవడం, పదిమందికీ చెప్పడమంటే బాగా ఇష్టం. నాకు ఉద్యోగంలో ఇంక్రిమెంట్ వచ్చినా, ప్రమోషన్ వచ్చినా అవి నా దృష్టిలో పెద్ద విషయాలు కావు. నా పనితీరును బట్టి, నా సర్వీసు రికార్డును బట్టి అవి మామూలుగా వచ్చాయనిపిస్తుంది తప్ప అవి నా మనసును ఉల్లాసపరచలేవు. అదే నేను మహాభారతం మీద ప్రసంగం చేస్తున్నప్పుడు, భీష్మస్తుతి చెప్తున్నప్పుడు భీష్మాచార్యులవారి భక్తికి మనసు పులకించిపోయిందనుకోండి. పద్యాలు అనర్గళంగా చెప్పి, భీష్ములవారిని తలచుకుని పొంగిపోతూ రాత్రి పడుకుని నిద్రపోయేటప్పుడు కూడా ఆ పద్యాలే దొర్లుతూండగా ఆనందపడే పరిస్థితి ఉంటుంది. ఆ సంతోషం మరేదీ నాకివ్వదు.

 అయితే విలాసవిద్య మనిషిని ఎప్పుడు కూడా సంస్కరించేది అయి ఉండాలి. పాడుచేసేదిగా ఉండకూడదు. మంచి ఉద్యోగం ఉంది కానీండి జేబుదొంగతనాలుచేస్తే ఆత్మతృప్తిగా ఉంటుందని అన్నారనుకోండి. అలా ఉండకూడదు. విలాస విద్య మనిషి ఉన్నతికి పనికిరావాలి తప్ప వినాశనానికి కాదు.

 పూర్వం భవాన్స్‌వాళ్ళు ’భారతీయ సాంస్కృతిక వారసత్వం’ అని ఒక పరీక్ష పెట్టి అందులో కూడా కనీస ఉత్తీర్ణత సాధిస్తేనే డిగ్రీ ప్రదానం చేసేవారు. అలా విలాసవిద్యను ప్రోత్సహించేవారు. విలాసవిద్య ఒక సంగీతం కావచ్చు, ఒక నృత్యం కావచ్చు. 20 త్యాగరాజ కీర్తనలు నోటికి వచ్చనుకోండి. మీ మనసు బాగా లేనప్పుడు ‘నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా’ అని పాడుకున్నారనుకోండి. మీ మనసు ప్రశాంతత సంతరించుకుంటుంది. మా అమ్మంటే నాకు ప్రాణం. ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచిపెద్దచేసింది. మా అమ్మ చనిపోయిన రోజున నేను విచలితుడినయిపోయాను. తట్టుకోలేకపోయాను. అంత బాధలో నన్ను నిలబెట్టినవి రామాయణ, భారతాది గ్రంథాలే.

 మీకు మంచి పుస్తకాలు చదవడం ఇష్టమనుకోండి. స్వామి వివేకానంద ప్రవచనాలు, జవహర్‌లాల్ నెహ్రూ రాసిన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ మీ ఆల్మరాలో ఉన్నాయనుకోండి.

మహాత్ములు రాసిన పుస్తకాలు మీ గదిలో ఉంటే మీరు మహాత్ముల మధ్యలో కూర్చుని ఉన్నారని గుర్తు. వివేకానంద ప్రవచనాలు చదువుతున్నారంటే... ఆ స్వామి మాట్లాడుతుంటే మీరు ఎదురుగా కూర్చుని వింటున్నారని అర్థం. మంచి పుస్తకాలు ఎంపికచేసి తెచ్చుకోండి. రోజుకో 10 పేజీలు చదవండి. మీలో శక్తి పెరగడాన్ని, మీలో మార్పును మీరే గమనిస్తారు. ఇవి మానసికంగా మిమ్మల్ని ఎలా తయారుచేస్తాయంటే... జీవితంలో ఎదురయ్యే సంఘటనలకు, దుర్ఘటనలకు ఎలా, ఎంతవరకు ప్రతిస్పందించాలో, ఏది ఎంత మోతాదులో స్వీకరించాలో నేర్పుతాయి.

 ఒక్కొక్కరికి ఒక్కొక్క విలాసవిద్య ఇష్టం. నాకు ప్రకృతిని పరిశీలించడం ఇష్టం. రవీంద్రనాథ్ ఠాగూర్ పాడయిపోయిన పాత పడకమంచం గిరికీల శబ్దాల నుంచి, పక్షుల కిలకి రావాల వరకు చూసి పరవశిస్తూ ప్రకృతి కవిగా మారి ప్రపంచం మొత్తం మీద సాహిత్యానికి నోబెల్ బహుమతి పొందిన ఏకైక భారతీయుడయ్యాడు.

 ఎవరిలో ఏ విస్ఫోటం దాగుందో తెలియదు. మనసు శాంతిపొందడానికి కావలసింది ఏదో ఉంటుంది మన లోపల. విలాసవిద్య దాన్ని వెలికి తీస్తుంది. కాకినాడలో ప్రఖ్యాత గైనకాలజిస్టు ఒకామె ఉన్నారు. మహిళా మందిరంలో ఆమె తంబూర పట్టుకుని కీర్తనలు పాడుతూంటే మైమరిచిపోతాం. అలాగే హైదరాబాద్‌లో ఇప్పటికీ బ్రెస్ట్ కాన్సర్ కేంద్రానికి అధిపతిగా ఉన్న ఒక డాక్టర్ చాలా బిజీగా ఉండికూడా ప్రతిరోజూ అరగంట నృత్యం ప్రాక్టీస్ చేస్తుంది. ఆమె కాకినాడలో జరిగే శారద నవరాత్రులకు వచ్చి ప్రదర్శన ఇస్తే కొన్ని వేలమంది నిలబడి చప్పట్లుకొడుతూ (స్టాండింగ్ ఓవేషన్) ఆమెను ఘనంగా అభినందిస్తారు.

ఒకప్పుడు ప్రధానమంత్రికి కార్యదర్శిగా, రాష్ర్ట ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసి కూడా ధైర్యంగా పిలకబెట్టుకుని, పంచెకట్టుకుని, పైన నామం పెట్టుకుని తాను నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడి పీవీఆర్‌కే ప్రసాద్‌గారు కృషి చేస్తున్నారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి డిజిపిగా ఎంతో తీరికలేకుండా ఉండికూడా అరవింద్‌రావుగారు గురువు దగ్గరకూర్చుని సంస్కృతం నేర్చుకున్నారు. పీహెచ్‌డీ చేశారు. అబ్దుల్ కలాంగారు రాష్ర్టపతి పదవిలో ఉండికూడా చాలా పుస్తకాలు రాశారు. జవహర్‌లాల్ నెహ్రూ జైల్లో కూర్చుని కూతురికి ఉత్తరాలు రాస్తే అవి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే గ్రంథాలయ్యాయి.

 అందువల్ల టైం లేదనే సాకులు చెప్పకండి. ఇప్పుడు నేను చెప్పిన వారంతా పురాణాల్లోని వారుకారు, సమకాలీకులు, వీరిని ఉదహరిస్తే మీరు బాగా గుర్తుపెట్టుకుంటారు, త్వరగా స్ఫూర్తిపొందుతారని చెబుతున్నా. వీరికంటే మనం ఎక్కువ బిజీగా ఉన్నామా ? ఒక్కసారి ఆలోచించండి. ఉత్సాహం ఉండాలి కానీ టైం లేకపోవడమన్నది ఉండదు. మీలో అంతర్గతంగా ఉన్న శక్తిని వెలికితీయగలిగేది విలాసవిద్య. దానివల్ల శాంతి పొందుతారు. ఈ విద్యను మీరే వెతుక్కోవాలి. అయితే అది పాడుచేసేది మాత్రం అయి ఉండకూడదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement