
యువర్స్ ట్రూలీ...
సోషల్ నెట్‌వర్కింగ్ విస్తృతం అయ్యాక ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం వంటి ఎన్నో సైట్లు, యాప్స్ ద్వారా ప్రజలు సమాచారం తెలుసుకుంటున్నారు. మరి ఆ సమాచారం నిజమా కాదా అని ఎప్పుడైనా ఆలోచించారా? అలా ఆలోచించిన ఓ యంగ్ టీమ్ సామాన్య ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పాలనుకుంటోంది. ఆధారాలతో సహా వాటిని మన ముందుంచేందుకు ‘ఫ్యాక్ట్‌లీ డాట్ ఇన్’ అనే వెబ్‌సైట్‌ను పారంభించబోతోంది. ఇప్పటికే ఫేస్‌బుక్‌లో పెట్టిన ఇన్ఫోగ్రాఫిక్స్‌తో తమ ప్రయత్నానికి విశేష స్పందన వస్తోందని టీమ్ సభ్యులు చెబుతున్నారు.
అసత్య సమాచారం, మోసపూరిత ప్రచారాల వలలో సామాన్య ప్రజలు పడకుండా ఉండాలని కోరుకున్న ఓ నలుగురు మిత్రుల ఆలోచనే ఈ ఫ్యాక్ట్‌లీ డాట్ ఇన్. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కార్యకర్తగా పని చేస్తూ సమాజానికి నిజాలు తెలియజేయడమే తన ధ్యేయమంటున్న 31 ఏళ్ల రాకేశ్‌రెడ్డి దీని వెనుక ఉన్న ప్రధాన చోదక శక్తి. ‘‘సోషల్ నెట్‌వర్క్‌లలో ఏదైనా ఆసక్తికరంగా కనపడితే దానికి లైకులు, షేరింగులు చేయాలన్న తొందరలో అది నిజమా కాదా అని ప్రజలు ఆలోచించడం లేదు. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలోనూ ఈ అసత్య ప్రచారం ఎక్కువైంది. అప్పుడే నాకు ప్రజలకు నిజాలు తెలియజేయాలన్న ఆలోచన వచ్చింది. సమాచారాన్ని ప్రభుత్వ సైట్లు, ఆర్‌టీఐ ద్వారా మాత్రమే సేకరించి వాస్తవాలను చెప్పాలనుకున్నాం. నా చిన్ననాటి ఫ్రెండ్స్ మనోజ్, శశి, శ్రీనివాస్‌తో కలిసి ఈ ప్రాజెక్టు మొదలు పెట్టాను’’ అని రాకేశ్ చెప్పారు. అతడిది వరంగల్. అక్కడే ఎన్‌ఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూనే సమాచార హక్కు చట్టం కోసం పని చేశారు. పదేళ్ల నుంచి ఆర్టీఐ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. ‘‘ఇటీవల భూసేకరణ ఆర్డినెన్స్, ఐఆర్‌సీటీసీ, ఎయిర్‌పోర్టులు వంటి వాటిపై మేము పెట్టిన ఇన్ఫోగ్రాఫిక్స్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రజలు వారు తెలుసుకున్న సమాచారం నిజమా కాదా అని ఒక్కసారి ఆలోచిస్తే మా ప్రయత్నం విజయం సాధించినట్టే. ఈ మధ్య ఒక జమ్మూ అబ్బాయి ‘దేశంలో రోజుకు ఎంతమంది ఆకలితో పస్తులుంటున్నారు?’ అని అడిగాడు. అలాంటి డేటా ప్రభుత్వం దగ్గర ఉండదు అని అతనికి చెప్పవలసివచ్చినందుకు బాధ కలిగింది కానీ, తనకు సమాచారం తెలుసుకోవాలన్న ఆసక్తి కలగడం ఎంతో సంతోషంగా అనిపించింది’’ అని ఫ్యాక్ట్‌లీ డాట్ ఇన్ టీమ్ తెలిపింది.
‘‘ప్రస్తుతం కేవలం ఆన్‌లైన్ ద్వారానే మా ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నాం. తర్వాత గ్రామాల్లోనూ ప్రజలకు కావాల్సిన సమాచారాన్ని ఎన్జీఓలు, విద్యార్థి సంఘాల సాయంతో తెలియజేసే ఆలోచన ఉంది. నేను, మనోజ్ ఇక్కడ ఉండి పని చేస్తున్నాం. ఇంకో ఇద్దరు అమెరికా నుంచే వెబ్‌సైట్‌కు కష్టపడుతున్నారు. అక్కడి నుంచే ఇన్ఫోగ్రాఫిక్స్ తయారు చేసి పంపిస్తున్నారు. దేనినైనా అప్‌లోడ్ చేసే ముందు ఆధారాలన్నీ పరిశీలించాకే ఫేస్‌బుక్‌లో పెడుతున్నాం. ఎవరికి ఏ సమాచారం తెలిసినా దాన్ని ఆధారాలతో సహా మాకు తెలియజేయాలని ప్రజలను కోరుతున్నాం. ‘ఇది నిజం’ అని మాత్రమే మేము చెబుతున్నాం. అంతే కానీ తప్పొప్పుల గురించి మాట్లాడడం లేదు’’ అని రాకేశ్ వెల్లడించారు.
ఫొటోలు: రాజేశ్ రెడ్డి
రైతుల ఆత్మహత్యలపై ‘ఫ్యాక్ట్‌లీ డాట్ ఇన్’ రూపొందించిన ఇన్ఫోగ్రాఫిక్స్