ఈ వారం యూట్యూబ్ హిట్స్‌ | youtube hits in this week | Sakshi
Sakshi News home page

ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

Published Mon, Apr 10 2017 12:33 AM | Last Updated on Tue, Sep 5 2017 8:22 AM

youtube hits in this week

మా కూతురంటే నమ్మలేకపోతున్నాం
హిందీ మీడియం : ట్రైలర్‌ నిడివి : 2 ని. 42 సె. ::: హిట్స్‌ : 80,27,124
ఇంగ్లిష్‌ ఒక భాష కాదు. ఒక హోదా! రైట్‌? ఇర్ఫాన్‌ఖాన్‌ కొత్త సినిమా  ‘హిందీ మీడియం’ ట్రైలర్‌ ఈ సంగతే చెబుతోంది. ఇందులో ఇర్ఫాన్‌ పక్కన పాకిస్థానీ నటి సబా ఖమర్‌ జమన్‌ నటిస్తున్నారు. ప్రపంచంలో ఎన్ని వర్గాలైనా ఉండనివ్వండి. వాటి అన్నిటిపైనా ఉన్నవి రెండే రెండు వర్గాలు. ఇంగ్లిష్‌ మాట్లాడే వర్గం ఒకటి. ఇంగ్లిష్‌ మాట్లాడలేని వర్గం ఒకటి. ఈ రెండున్నర నిముషాల ట్రైలర్‌లో... హిందీ మాత్రమే వచ్చిన ఇర్ఫాన్‌ఖాన్, ఇంగ్లిష్‌ను అనర్ఘళంగా మాట్లాడే ఆయన భార్య సబా... కూతురికి మంచి ఇంగ్లిష్‌ ఎడ్యుకేషన్‌ను ఇప్పించే విషయమై పడే తపన హాస్యభరితంగా ఉంటుంది.

సాకేత్‌ చౌదరి దర్శకత్వంలో వస్తున్న ఈ మలయాళీ రీ మేక్‌ (సాల్ట్‌ మ్యాంగో ట్రీ) మూవీ మే 12న విడుదల అవుతోంది. ‘ఈ రోజు నుంచి నేను ఇంగ్లిషులోనే మాట్లాడతానని ప్రమాణం చేస్తున్నాను. ఎందుకంటే ఇంగ్లిషే ఇండియా, ఇండియానే ఇంగ్లిష్‌’ అనే సెటైర్‌తో వీడియో ముగుస్తుంది. మరి ప్రారంభం ఎలా ఉంటుంది? ‘ఈ అమ్మాయి మా కూతురంటేనే నమ్మలేకపోతున్నాం సార్‌. అంత తెలివైన అమ్మాయి’ అంటాడు ఇర్ఫాన్‌ ప్రిన్స్‌పాల్‌తో! తన కూతురికి ఎలాగైనా ఇంగ్లిష్‌ మీడియం స్కూల్లో సీటు సంపాదించడం అతడి లక్ష్యం. అలా నాలుగైదు స్కూళ్లకు దరఖాస్తు చేస్తాడు. ఈలోపు తను కూడా ఇంగ్లిషు నేర్చుకోడానికి ప్రయత్నిస్తుంటాడు.

ఇంటర్వూ్యలలో పేరెంట్స్‌ కూడా ఇంగ్లిష్‌లో మాట్లాడాలి కదా. అందుకు. మధ్య మధ్య భార్య అతడి ఇంగ్లిష్‌ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తుంటుంది. ఇంగ్లిష్‌లో మాట్లాడలేకపోతే జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో ఫ్రీక్వెంట్‌గా కన్నీళ్లు పెట్టుకుని మరీ చెబుతుంది. ఇర్ఫాన్‌ నలిగిపోతాడు. ఇంగ్లిష్‌ స్కూల్లో కూతురు నలిగిపోతుంటుంది. ఈ వైనాన్నంతా హాస్యానికి వ్యంగ్యాన్ని జోడించి చూపించారు. సో... జీవితానికి దగ్గరగా ఉండే మరొక మంచి బాలీవుడ్‌ మూవీ మన కోసం ఎదురుచూస్తూ ఉందన్నమాట.

ఆట పాటైంది... పాట ఆటైంది!
సచిన్స్‌ క్రికెట్‌ వాలీ బీట్‌ నిడివి : 3 ని. 44 సె.  ::: హిట్స్‌ : హిట్స్‌ : 25,66,013
సచిన్‌ మొబైల్‌ యాప్‌ ‘100 ఎంబి’ కోసం క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్, మ్యూజిక్‌ రాక్‌ స్టార్‌ సోనూ నిగమ్‌ కలిసి పాడిన జుగల్‌బందీ ‘నాచో నాచో నాచో సారె.. క్రికెట్‌ వాలి బీట్‌ పె..’ క్రికెట్‌ లవర్స్‌ని, సచిన్‌ ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తోంది. వరుణ్‌ లిఖాటే, షామీర్‌ టాండన్‌ ఈ పాటను రాశారు. మ్యూజిక్‌ను షామిర్‌ టాండన్‌ అందించారు. ఇక ఈ వీడియోకి డైరెక్షన్‌ నిషాంత్‌ నాయక్‌. ఈ పాటలో సచిన్‌ ప్రసిద్ద క్రికెట్‌ సెలబ్రిటీలను, తను ఆడిన ఆరు ప్రపంచ కప్‌లలోని ప్లేయర్‌లను తలచుకున్నాడు.

ప్రవీణ్, రవి, సుబ్రోతో, కపిల్, కిరణ్, వినోద్, అజార్, అనిల్‌ కృష్ణమాచారి, అశీష్‌ కపూర్, సంజయ్, నయాన్, మనోజ్, సలీల్‌; అజయ్, జవగళ్, వెంకటేశ్, రాజు, సౌరవ్, సడగోపన్, సిద్ధు, రాహుల్, రాబిన్, దేబశీష్, నిఖిల్, అజిత్, అమేయ్, అశీష్‌; జహీర్, బంగర్, దినేశ్, వీరు, పార్థివ్, భజ్జీ, యువీ, కైఫ్, ఉతప్ప, కార్తీక్, మునాఫ్, శ్రీశాంత్, గౌతమ్, ఇర్ఫాన్, యూసప్‌ పఠాన్‌; సురేశ్, పీయూష్, విరాట్‌ కొహ్లీ, అశ్విన్, ఎం.ఎస్‌.ధోనీ.. లవ్‌ యూ గైస్‌ అంటూ... పాటలో ఈ పేర్లను ఓ చరణంలో రాగయుక్తంగా పాడతాడు సచిన్‌. బాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకుని ఊగుతూ పాడడం చూస్తుంటే వింతైన అనుభూతి కలుగుతుంది. క్రికెట్‌లోని కొన్ని అద్భుత క్షణాల నిశ్చల చిత్రాలను కూడా వీడియో మధ్యలో మిక్స్‌ చేశారు.

అభిమానులు తట్టుకోలేని విషాద చిత్రం
వినోద్‌ఖన్నా షాకింగ్‌ లుక్‌ నిడివి : 2 ని. 57 సె.  ::: హిట్స్‌ : హిట్స్‌ : 18,30,003
తీవ్రమైన డీ హైడ్రేషన్‌తో ఈ నెల 2న ఆసుపత్రిలో చేరిన పూర్వతరం నటుడు వినోద్‌ ఖన్నా ఆరోగ్య స్థితిపై గత రెండు రోజులుగా ఆందోళనకరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ముంబైలోని సర్‌ హెచ్‌.ఎన్‌. రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వినోద్‌ఖన్నాను పరామర్శించేందుకు ముంబై ప్రముఖులంతా వెళ్లివస్తున్నారు. ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగవ్వాలని దేశవ్యాప్తంగా  ఆయన అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. 1968–2013 మధ్య కాలంలో వినోద్‌ఖన్నా 140కి పైగా చిత్రాలలో నటించారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ నుంచి బి.జె.పి. అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేసిన ఖన్నా తన ప్రత్యర్థిపై లక్షా 36 వేల 65 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు.

మేరే అప్నే, మేరా గావ్‌ మేరా దేశ్, ఇంతిహాన్, ఇన్‌కార్, అమర్‌ అక్బర్‌ ఏంథోనీ, లహు కె దొ రంగ్, ఖుర్బానీ, దయవాన్, జుర్మ్‌ చిత్రాలతో అసమాన నటనను ప్రదర్శించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన ఈ హీరో... ప్రస్తుతం ఆసుపత్రి పడకపై ఎలా ఉన్నారో ‘లెహ్‌రెన్‌ రెట్రో’ అనే సైట్‌.. ఖన్నా గతాన్ని, ప్రస్తుతాన్ని గుదిగుచ్చిన చిత్రాలతో ఈ వీడియోను రూపొందించి యూట్యూబ్‌లోకి అప్‌లోడ్‌ చేసింది. వినోద్‌ ఖన్నా కొంతకాలంగా బ్లాడర్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారన్న వదంతికి బలం చేకూర్చే ఈ వీడియోలో ఖన్నా క్లిప్పింగ్‌ కనిపిస్తుంది. ఏదైనా ఇది సినీ అభిమానులు తట్టుకోలేని విషాదమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement