ఈ వారం యూట్యూబ్ హిట్స్‌ | youtube hits in this week | Sakshi
Sakshi News home page

ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

Published Sun, Jun 25 2017 11:02 PM | Last Updated on Tue, Sep 5 2017 2:27 PM

ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

పంజాబీ దరువుకు లండన్‌ బీట్‌
ముబారకన్‌
ట్రైలర్‌ నిడివి: 2 ని. 47 సె.
హిట్స్‌ 1,15,17,234

అనీజ్‌ బజ్మీ! ‘నో ఎంట్రీ’, ‘వెల్‌కమ్‌’, ‘సింగ్‌ ఈజ్‌ కింగ్‌’ చిత్రాల డైరెక్టర్‌. ఇప్పుడు ‘ముబారకన్‌’ అనే నాలుగో మూవీతో పన్నీరు లాంటి హాస్యాన్ని చిలకరించేందుకు రెడీగా ఉన్నాడు. వచ్చే నెల 28న సినిమా విడుదల అవుతోంది. ఓ పంజాబీ పెళ్లి, ఆ పెళ్లి చుట్టూ నడిచే కథ ఇది. ఇద్దరు మగ ట్విన్స్, వాళ్లకో అంకుల్‌. ట్విన్స్‌గా అర్జున్‌ కపూర్‌ యాక్ట్‌ చేస్తుంటే.. అంకుల్‌గా అనిక్‌ కపూర్‌ వాళ్ల చేత విపరీతంగా యాక్ట్‌ చేయిస్తుంటాడు. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే... విధి ఆడిన వింత నాటకంలో.. కాదు, కాదు.. విధి చేత మనిషి ఆడించిన వింత నాటకంలో ట్విన్స్‌ విడిపోతారు. వాళ్లలో ఒకడు లండన్‌లో పెరిగితే, ఇంకొకడు చండీఘర్‌లో పెరుగుతాడు. ఇద్దరి వయసూ ఒకటే కాబట్టి ఇద్దరికీ సేమ్‌ టైమ్‌లో పెళ్లీడు వచ్చేస్తుంది. అమ్మాయి ఫాస్ట్‌గా ఉండాలి అంటాడు లండన్‌ అబ్బాయి.

నాకూ ఇంచుమించు అలాంటి అమ్మాయే కావాలి అని పెళ్లి తప్పించుకుంటుంటాడు చండీఘర్‌ అబ్బాయి. అసలు సంగతేంటంటే.. ఇద్దరికీ ఆల్రెడీ గర్ల్‌ఫ్రెండ్స్‌ ఉంటారు. ఇక బాధ్యతంతా.. ఆ అంకుల్‌ గారిదే. ఇంతకీ ఆయన పెళ్లిళ్లు జరిపించారా? జరగాల్సిన పెళ్లిళ్లు ఆపించారా? ఆ సస్పెన్స్‌ని అలాగే కొనసాగనివ్వండి. ఇప్పుడైతే.. ట్రైలర్‌లోని చిన్న బిట్‌. లండన్‌లో పెరిగిన అబ్బాయిని పెళ్లి చూపులకు తీసుకెళ్తాడు అంకుల్‌. డిసెంబర్‌ 25 క్రిస్‌మస్‌కి పెళ్లి పెట్టుకుందాం అంటారు అమ్మాయి తరఫువాళ్లు. అంకుల్‌గారు తన పెద్దరికంతో..‘ఓ.. ఈ ఏడాది కూడా డిసెంబర్‌ 25నే వచ్చిందా క్రిస్మస్‌..’ అంటాడు. అవతలి పెద్దమనిషి షాక్‌. ఇలాంటి షాకులు ఇంకా చాలానే ఉన్నాయి ట్రైలర్‌లో. అర్జున్‌ కపూర్‌లకు (ట్విన్స్‌ కదా. అందుకే కపూర్లు అనడం) జోడీగా ఇలియానా డిసౌజా, అతియా శెట్టి.. ఈ క్రేజీయస్ట్‌ పంజాబీ ఫ్యామిలీతో అప్‌ అండ్‌ డౌన్‌ అవుతూ ఉంటారు. మ్యూజిక్‌ అమాల్‌ మల్లిక్, ఆర్‌.డి.బర్మన్‌. ఇక ఆ పంజాబీ దరువు ఎంత లయబద్ధంగా ఉంటుందో మీ చెవులు ఊహించకుండా ఆపేదెవరు?

యుద్ధ సైనికుడికి స్మైలీ కేక్‌
థ్యాంక్యూఫర్‌ యువర్‌ సర్వీస్‌
ట్రైలర్‌ నిడివి: 2 ని. 34 సె.
హిట్స్‌: 5,909,72

యుద్ధం అన్నిటినీ ఛేంజ్‌ చేస్తుంది! యుద్ధభూమిలో ఉండి వచ్చినవాడు మునుపటిలా ఉండలేడు. ఆడమ్‌ షూమాన్‌ అనే అమెరికన్‌ సైనికుడిది సరిగ్గా అలాంటి పరిస్థితే. ఇరాక్‌ యుద్ధం ముగిశాక, తిరిగి తన దేశానికి చేరుకున్న షూమాన్‌ను యుద్ధ జ్ఞాపకాలు అతడిని పీడకలలా వెంటాడుతూనే ఉంటాయి. చివరికి అతడు ఎలా అడ్జెస్ట్‌ అయ్యాడన్నదే ‘థ్యాంక్యూ ఫర్‌ యువర్‌ సర్వీస్‌’ కథ. ఈ బయోగ్రాఫికల్‌ వార్‌ డ్రామా ఫిల్మ్‌ని జాసన్‌ హాల్‌ డైరెక్ట్‌ చేస్తున్నారు. డైరెక్షన్‌లో అతడికిది తొలి అనుభవం. స్క్రిప్టు కూడా తనే రాసుకున్నాడు. భర్త మానసిక స్థితిలోని అనూహ్యమైన హెచ్చుతగ్గులను తట్టుకుని నిలబడిన భార్యగా హేలే బెనెట్‌ నటిస్తున్నారు. షూమాన్‌ మాటిమాటికీ నిద్రలోంచి ఉలిక్కిపడి లేస్తుంటాడు. భార్యతో ఏకాంతంగా ఉన్న సమయంలోనూ దిగ్గున లేచి, ఏవో ఆలోచనల్లోకి వెళ్లిపోతాడు. ప్రతి విషయాన్నీ బాగ్దాద్‌తో కంపేర్‌ చేస్తుంటాడు. ‘ఇప్పుడు.. బాగ్దాద్‌లో సాయంత్రం నాలుగు గంటలు అయుంటుంది’ అని అంటాడు. లేదా ఇంకోటి ఏదో అంటాడు. భార్య అనుక్షణం అతడి గురించే ఆలోచిస్తుంటుంది. ఓసారి చాక్లెట్‌ కేక్‌ చేసి ఆ కేక్‌ పై నట్స్‌ అద్ది స్మైలీ ఫేస్‌ వచ్చేలా చేస్తుంది. అది చూసిన భర్త ‘పాపని నవ్వించడానికా?’ అంటాడు.

‘కాదు.. అది మీ కోసం’ అంటుంది. అలా అంటున్నప్పుడు ఆమె ముఖంలో చాలా దిగులు. ఒకటీ అరా యుద్ధానంతర సన్నివేశాలు, భార్యభర్తల మధ్య ఉద్వేగభరితమైన సన్నివేశాల కూర్పుతో సినిమాపై ఆసక్తి కలిగించేలా ఉంది ట్రైలర్‌. చిత్రం రిలీజ్‌ అక్టోబర్‌ 17న. అమెరికన్‌ జర్నలిస్టు, పులిట్జర్‌ ప్రైజు విజేత డేవిడ్‌ లూయీ ఫింకెల్‌ నాన్‌–ఫిక్షన్‌ నవల ఆధారంగా అదే పేరుతో ఈ హాలీవుడ్‌ మూవీ తయారౌతోంది. ‘పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌’కు లోనైన అమెరికన్‌ సైనికుడు షూమాన్‌ పాత్రను 30 ఏళ్ల మైల్‌ టెల్లర్‌ పోషిస్తున్నారు. ఇంతకీ ఎవరు ఎవరి సర్వీస్‌కు థ్యాంక్స్‌ చెప్పారు? అమెరికన్‌ సైనికులకు ఇరాక్‌ పౌరులు థ్యాంక్స్‌ చెప్పారా? షూమాన్‌ తన భార్యకు చెప్పాడా? ఎవరు ఎవరికి చెప్పినా.. సర్వీస్‌ చేసిన వాళ్లకు థ్యాంక్స్‌ చెప్పకుండా ఎలా ఉండగలం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement