ఈ వారం యూట్యూబ్ హిట్స్‌ | youtube hits in this week | Sakshi
Sakshi News home page

ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

Published Sun, Jul 30 2017 10:50 PM | Last Updated on Tue, Sep 5 2017 5:13 PM

ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

షార్ప్‌ ఫిల్మ్‌

మేం చేయించుకున్నాం.. మీరూ చేయించుకోండి!
పోస్టర్‌ బాయ్స్‌ : ట్రైలర్‌
నిడివి 2 ని. 40 సె.
హిట్స్‌ 98,26,990

వినయ్‌ శర్మ స్కూల్‌ టీచర్‌. పాపం సాధు జీవి; అర్జున్‌ సింగ్‌ రికవరీ ఏజెంట్‌. అతి ఉత్సాహవంతుడు; జాగ్వార్‌ చౌదరి రిటైర్డ్‌ సోల్జర్‌. మహా కోపిష్టి. వీళ్ల ముగ్గురి చుట్టూ తిరిగే సినిమా ‘పోస్టర్‌ బాయ్స్‌’. ఓ రోజు అకస్మాత్తుగా ఈ ముగ్గురూ ఉన్న పోస్టర్‌ ఊళ్లో అంతటా ప్రత్యక్షమౌతుంది! అందులో వీళ్లు వేసక్టమీ (మగవాళ్లకు చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌)ని ప్రమోట్‌ చేస్తుంటారు. దాంతో ఒక్కసారిగా ఊళ్లో వీళ్ల లైఫ్‌ ‘అప్‌సైడ్‌ డౌన్‌’ అవుతుంది. ట్రైలర్‌ను బట్టి చూస్తుంటే సినిమా చూస్తున్నంత సేపూ నవ్వలేక మనమూ తలకిందులు అయిపోవడం ఖాయం. వినయ్‌ శర్మగా బాబీ డియోల్, అర్జున్‌ సింగ్‌గా శ్రేయాస్‌ తల్పాడే, జాగ్వార్‌ చౌదరిగా సన్నీ డియోల్‌ నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 8 న రిలీజ్‌ అవుతోంది. అన్నట్లు ఆ పోస్టర్‌లో వీళ్లు ఏమని చెబుతుంటారో తెలుసా? ‘కుట్లు లేకుండా మేము వేసక్టమీ చేయించుకున్నాం. మరి మీరెందుకు చేయించుకోకూడదు?’ అని. వీళ్ల మాటేమో కానీ, పాపం వీళ్ల ఇంట్లోని వాళ్లు ఎలా ఫీలయ్యారో ట్రైలర్‌లో చూడాల్సిందే.

ఉండలేకపోతే... వెళ్లిపో! నాకేంటి?
కెన్‌డ్రిక్‌ లమార్‌–లాయల్టీ–రిహాన్నా

నిడివి 3 ని. 59 సె.
హిట్స్‌ 1,19,97,174

మీరెవరికి లాయల్‌గా ఉంటారు? ‘లాయల్‌’గా అంటే విధేయంగా, విశ్వాసపాత్రంగా! ఇంకో మాటలో – అలా.. కాళ్ల దగ్గర పడి ఉండడం లాయల్టీ! చెప్పండి, ఎవరికి మీరు లాయల్‌గా ఉంటారు? డబ్బుకా? పేరుకా? ఎవరైనా ఓ వ్యక్తికా? వ్యసనానికా? అమెరికన్‌ పాప్‌ ర్యాపర్, సాంగ్‌ రైటర్‌ కెన్‌డ్రిక్‌ లమార్‌ సృష్టించిన ఈ కొత్త వీడియోలో మనకు కనిపించే బార్బడోస్‌ దేశపు ‘పాప్‌’ పిల్ల.. ‘ఇటీజ్‌ సో హార్డ్‌ టు బి హంబుల్‌’ అని పాట చివర్న కరాకండిగా చెప్పేస్తుంది. విధేయంగా ఉండడం చాలా కష్టమట! ప్రేమలో అయితే లాయల్టీ అస్సలు కుదరట. అంటే.. మీకర్థమయిందా? ‘నేన్నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేనే నీ ప్రపంచంగా నువ్వు బతకాలి’ అని ఎవరైనా లాజిక్‌ తీస్తే.. షిట్‌ అని కొట్టి పడేస్తుంది రిహాన్నా. ‘లాయల్టీ పిచ్చి వేషం. ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటే.. అప్పటికి నేను వాళ్లనే ప్రేమిస్తూ ఉంటాను’ అని ధైర్యంగా చెప్పే ఏ అమ్మాయినైనా భరించే శక్తి ఏ ప్రేమికుడికైనా ఉంటుందా? ఉండకపోతే వెళ్లిపో.. అంటుంది రిహాన్నా. ప్రేమ పట్ల చాలా నిర్దయగా వ్యవహరించిన ఈ ఇద్దరు పాప్‌ కళాకారులు ఈ పాటను చిత్రీకరించడం కోసం.. ఆ కొద్దిసేపూ లాయల్‌గానే ఉండి ఉంటారు. లేకపోతే ఇంత హై రేంజ్‌లో ఈ వీడియోలోని క్రియేటివిటీ పుట్టకపోయేది!

సెంట్రల్‌ జైల్లో మ్యూజిక్‌ బ్యాండ్‌
లక్నో సెంట్రల్‌ : ట్రైలర్‌
నిడివి 2 ని. 37 సె.
హిట్స్‌ 58,36,593

కిషన్‌ మోహన్‌ గిర్హోత్ర ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ కుర్రాడు. చిన్న పల్లెలో ఉండి పెద్ద కల కంటున్నవాడు. ఒక మ్యూజిక్‌ బ్యాండ్‌ పెట్టడం అతడి కల. కానీ అనూహ్యంగా ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు! అతడిని లక్నో సెంట్రల్‌ జైల్లో వేస్తారు. అతడి మరణ శిక్షపై హైకోర్టు తీర్పు ఇవ్వడం ఒక్కటే మిగిలింది. అలాంటి సమయంలో గాయత్రీ కశ్యప్‌ అనే ఎన్జీవో అమ్మాయి ఖైదీలతో ఒక మ్యూజిక్‌ బ్యాండ్‌ను తయారు చేసేందుకు లక్నో సెంట్రల్‌ జైలుకు వస్తుంది. అక్కడ లక్కీగా మన మొరాదాబాద్‌ కుర్రాడికి ఆమెను కలిసే అవకాశం వస్తుంది. తను బ్యాండ్‌లో పనిచేస్తానంటాడు. తన జైలు సహచరులు నలుగుర్ని కూడా బ్యాండ్‌లో చేరేందుకు ఒప్పిస్తాడు. ఆ తర్వాత మ్యూజిక్‌ అతడి జీవితంలో ఎలాంటి మిరాకిల్‌ చేసిందన్నది స్టోరీ. చిత్రం సెప్టెంబర్‌ 15న విడుదలవుతోంది. కిషన్‌ మోహన్‌ గిర్హోత్ర గా పర్హాన్‌ అఖ్తర్‌ నటిస్తున్నాడు. గాయత్రీ కశ్యప్‌గా డయానా పెంటీ నటిస్తోంది. ‘చాయిస్‌ ఈజ్‌ బిట్వీన్‌ డ్రీమ్‌ అండ్‌ ఫ్రీడమ్‌’ అనే లైన్‌తో ముగిసే ఈ ట్రైలర్‌లో యూత్‌లో ఉత్తేజం నింపే డైలాగులు, సన్నివేశాలు ఉన్నాయి.

బిట్వీన్‌ ద లైన్స్‌.. భలే చెప్పాడీ కుర్రాడు!
కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, డైరెక్షన్‌: ఓ కొత్త కుర్రాడు!
అసిస్టెంట్‌ డైరెక్టర్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ: వీళ్లూ కుర్రాళ్లే!  క్యాస్టింగ్‌: కుర్రబ్యాచ్‌.

బట్‌.. ఈ షార్ట్‌ మూవీలోని ప్రతి ఫ్రేమ్‌లోనూ టాలెంట్‌ ఉంది బాస్‌!! కొత్తవాళ్లకు టాలెంట్‌ ఉండదని కాదు. టాలెంట్‌ చూపించుకోడానికి ఉండదు అని! డైరెక్టర్‌ హరికుమార్‌ దేవరపల్లికి అన్నీ కుదిరాయి. కథ కుదిరింది. స్క్రిప్టు కుదిరింది, హీరో కుదిరాడు, క్యాస్టింగ్‌ కుదిరింది. ఫిల్మ్‌ లాంచ్‌ ప్యాడ్‌ ‘హంస 4 యు’ కూడా కుదిరింది. బహుశా అలా కష్టపడి కుదుర్చుకుని ఉండాలి అతడు! సందేశాత్మక షార్ట్‌ ఫిల్మ్‌ ఇది. అయితే జాతిని ఉద్దేశించి దృశ్యీకరించినట్లుగా లేదు. యూత్‌ మెచ్చేట్లు, యూత్‌కి నచ్చేట్లు, యూత్‌ బుర్రకి ఎక్కేట్లు.. వారి భాషలో, వారి భావాలతో ఉంది. ఫిల్మ్‌ టైటిల్‌ ‘గీత దాటితే..’! ఊ.. దాటితే ఏమౌతుంది? ఏమైనా కానివ్వండి.. సమ్‌టైమ్స్‌ దాటాల్సి ఉంటుంది. తల్లిని కాపాడుకోడానికి ఒక గీతేమిటి? ఎన్ని గీతలైనా, ఆఖరికి భగవద్గీతనైనా దాటొచ్చు అనిపిస్తుంది ఇందులోని హీరో జాస్తి వినీత్‌ పరిస్థితిని చూస్తే! డైరెక్టర్‌ ఇతడిని భౌతికంగా గీత దాటినట్లు చూపించినా, నైతికంగా మాత్రం గీత లోపలే ఉంచేయడం బాగుంది. లాస్ట్‌ సీన్‌ వరకు ఈ సంగతి తెలియదు. ఈ టీమ్‌లోని మిగతా బాయ్స్‌ అండ్‌ గాళ్స్‌ రాజ్‌ భరత్, యశ్వంత్, దుర్గా హనీ, హారికా స్మైలీ (వీళ్లంతా నటులు), శశినాగ్‌ (ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, డి.ఐ.), మహేశ్‌ బాబు సన్నీ (అసిస్టెంట్‌ డైరెక్టర్‌) వల్ల కూడా ఈ షార్ట్‌ ఫిల్మ్‌ ‘షార్ప్‌’గా వచ్చింది. ‘దేవుడా.. ఎవరికీ ఏ కష్టాల్లేకుండా పుట్టించవా..’ అనే డైలాగ్‌ సూపర్బ్‌. ఈ డైలాగ్‌.. డెలివరీ అయ్యే కాంటెక్స్‌›్ట బట్టి అది పండింది. హరీ.. నీలో ఉంది! ఇక టాలీవుడ్‌ అదృష్టం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement