ది డాక్టర్ షార్ట్ కామెడీ
నిడివి 9 ని. 49 సె. , హిట్స్ 1,188,080
‘వైవా’ యూట్యూబ్ చానల్ ‘ది సిరీస్’ పేరుతో ఒక కొత్త సిరీస్‌ను మొదలెట్టింది. అందులో భాగంగా తొలి కామెడీ వీడియో ‘ది డాక్టర్’ను విడుదల చేసింది. యధావిధిగా వైవా టీమ్ మొత్తం ఇందులో నవ్వులు పూయించే ప్రయత్నం చేశారు. హర్ష డాక్టర్‌గా మిగిలిన మిత్రులు రోగులుగా నటించారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో ప్రకాష్‌రాజ్ క్యారెక్టర్‌ను వైవా తన షార్ట్‌ఫిల్మ్స్‌లో విరివిగా ఉపయోగిస్తున్నారు.
‘ఏమి అడిగినా నవ్వుతూ ఉండే’ ఈ పాత్రను పోషించే నటుడు ప్రతి దానికీ హాయిగా నవ్వుతూ హాస్యం పండిస్తుంటాడు. ఈ షార్ట్‌ఫిల్మ్‌లో ఇతడి గుండె మీద స్టెత్ పెడితే ‘హాహా.. హాహా’ అని వినిపిస్తూ ఉంటుంది. తలకు ఎక్స్‌రే తీస్తే ‘నవ్వుతున్న పుర్రె’ కనిపిస్తుంది. ‘గట్టి అప్పడం’ అనుకొని అర్ధరాత్రి చీకట్లో సీడీని తినేసిన పేషెంట్, ప్రాణిక్ హీలింగ్ పేషెంట్ వీళ్లందరి ప్రహసనాలు నవ్వు పుట్టిస్తాయి. ఎవరినీ కించ పరచకుండా, అశ్లీల జోకులు వేయకుండా, ఆరోగ్యకరమైన హాస్యంతో ముందుకు వెళుతున్న ఈ టీమ్‌ను ఆదరించకుండా ఎవరు ఉంటారు?
హౌస్‌మెయిడ్ స్టాండప్ కామెడీ
నిడివి 4 ని. 8 సె. ,హిట్స్ 4,59,683
స్టాండప్ కమెడియన్‌లు చేసే కామెడీ వీడియోలు కూడా యూట్యూబ్‌లో బాగా ఆదరణ పొందుతుంటాయి. రాహుల్ సుబ్రమణియన్ ‘పనిమనిషి’పై చేసిన స్టాండప్ కామెడీ కొన్ని మంచి పంచ్‌లతో సాగుతుంది. ఈ వీడియోలో అతనంటాడు– మనందరం పనిమనిషి వస్తేనే నిద్ర లేస్తాం. నేను కూడా అంతే. కాని ఒకరోజు ఆమె రాలేదు. నేను లేచేసరికి గురువారం వచ్చేసింది.
అరె... మంగళవారం పడుకుంటే గురువారం ఎలా లేచాను? బుధవారం ఏమైపోయింది... అనుకున్నాను. మోడీ గారు నోట్లను బేన్ చేసినట్టు బుధవారాలు కూడా బేన్ చేశారా అని నవ్విస్తాడు. మరాఠిలో ‘బాయి’ అంటే స్త్రీ అని అర్థమని పని మనుషుల పక్కన ‘బాయి’ అని పెట్టి పిలుస్తామని అయితే తన పనిమనిషి విషయంలో ఒక ఇబ్బంది వచ్చిందనీ తన పేరు ‘లక్ష్మీబాయి’ కావడం వల్ల ఆమెను ‘లక్ష్మీబాయి బాయి’ అని పిలవాల్సి వచ్చిందని చెప్తాడు.
తన పనిమనిషికి డస్ట్ ఎలర్జీ ఉంది కనుక తను చిమ్మే పద్ధతి వేరుగా ఉంటుందని చేసి చూపిస్తాడు. పనిమనుషులు లేకపోతే మన సమాజం, చాలా ఇళ్లు, కాపురాలు నడవవు. చాలా మంచి పనిమనుషులు మనకు ఉన్నారు. కాని కొందరు విసిగించే పనిమనుషుల బారిన పడినవారు ఇలాంటి జోకులతో కొంత తెరిపిన పడతారని చెప్పవచ్చు.
కర్తా షార్ట్ ఫిల్మ్
నిడివి 20 ని. 19 సె. ,హిట్స్ 95, 296
రాయల్ స్టాగ్ లార్జెస్ట్ షార్ట్ ఫిల్మ్స్‌లోని ఒక ఫిల్మ్ ఇది. అనురాగ్ కశ్యప్ సమర్పణలో రణదీప్ ఝా దర్శకత్వం వహించాడు. రియల్ ఎస్టేట్ రంగంలో కొందరు ఏజెంట్లు ఎలాంటి ఒత్తిడికి గురవుతారో చాలా శక్తిమంతంగా, దిగులూ, బెంగా కలిగే స్థాయిలో దీనిని తీశారు. ఇందులో కథానాయకుడు తెలిసీ తెలియని జ్ఞానంతో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పని చేస్తూ ఉంటారు.
పార్టీలు దొరకవు. డీల్స్ సెటిల్ కావు. ఇంటికి ఇఎమ్‌ఐలు కట్టలేని పరిస్థితి. పిల్లాణ్ణి స్కూలు నుంచి పంపించేస్తారు. ఏదో ఒకటి సంపాదించి తేవాల్సిన మగవాడు ఎలాంటి అవమానభారాలు మోస్తాడో ఇది చూపిస్తుంది. చివరకు ఆ ఏజెంట్ ఆత్మహత్య చేసుకోవడంతో కథ ముగుస్తుంది. షార్ట్‌ఫిల్మ్స్‌లో ఎంతటి ఇంటెన్సిటీతో తీయవచ్చో తెలియాలంటే ఈ వీడియో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment