గర్మీ కే సైడ్ ఎఫెక్ట్స్ కామెడీ షార్ట్ ఫిల్మ్
నిడివి 8 ని. 44 సె. హిట్స్ 1,09,65,129
సీజన్ మారగానే యూ ట్యూబ్ స్టార్స్ కొత్త వీడియోలు తయారు చేస్తుంటారు. ఇప్పుడు వేసవి వంతు. కామెడీ వీడియోలు తీసే ఆషిష్ చంచలానీ ‘గర్మీ కే సైడ్ ఎఫెక్ట్స్’ పేరుతో తీసిన ఈ వీడియో పెద్ద హిట్ అయ్యింది. కోటి హిట్స్ దాటిపోయాయి.
ఆషిష్ చంచలానీయే ఇందులో ప్రధాన పాత్ర. స్నేహితుడు ‘బయటకెళ్లి ఆడుకుందామా?’ అనడిగితే ‘సూర్యుడు మన జీవితాలతో ఆడుకుంటున్నాడు’ అంటాడు ఆషిష్. ఏసి పాడయ్యి ఆపసోపాలు పడుతున్న ఆషిష్‌కు గర్ల్‌ఫ్రెండ్ ఫోన్ చేసి ‘ఇంట్లో ఎవరూ లేరు. రారాదూ’ అని పిలిస్తే ‘మీ ఇంట్లో ఏసీ పని చేస్తోందా?’ అని అడుగుతాడు. ‘లేదు’ అంటుంది. ‘అయితే నీ చావు చావు’ అని గోల్డెన్ చాన్స్ కూడా సెగ దెబ్బకు వదులుకుంటాడు.
ఇంత ఎండలో ఒక స్నేహితుడు హాయిగా బైక్ మీద కూచుని ఉంటే ‘ఒరేయ్... నీకు ఇంకా ఎండ కావాలట్రా... సోలార్ ప్యానల్ అక్రమ సంతానమా’ అని తిడతాడు. ఈ సీజన్‌లో అత్యధిక సంపన్నుడు ఎవడంటే ఐస్ సోడా అమ్మే వాడే అని చూపిస్తాడు. ఎండల్లో చాలా చిరగ్గా ఉంటుంది. ఆ చిరాకు హాస్యాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.
సాక్ష్యం టీజర్
నిడివి 1 ని. 38 సె. హిట్స్ 11,12,398
శ్రీనివాస్ బెల్లంకొండ సినిమాలు భారీగా ఉంటాయి. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి అతడు తగినంత శ్రమ చేస్తున్నాడనే చెప్పాలి. తాజాగా అతడి నుంచి రాబోతున్న ‘సాక్ష్యం’ ఆసక్తిరంగా ఉండబోతోందని టీజర్ చెబుతోంది. తప్పుకు అన్నిసార్లు సాక్ష్యం ఉండకపోవచ్చు... కాని ‘కర్మసాక్షి’ తప్పక ఉంటుంది అనే లైన్‌తో ఈ సినిమా కథ తయారయ్యింది.
డిఫరెంట్ లొకేషన్స్, ఇంతకు ముందు అలవాటు లేని కథ ఈ సినిమాలో ఉండే అవకాశం ఉంది. దర్శకుడు శ్రీవాస్ అన్ని హంగులు ఉండేలా జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది. పూజా హెగ్డే కథానాయిక. జగపతిబాబు, రావు రమేష్, వెన్నెల కిశోర్ కనిపిస్తున్నారు. కుతూహలం రేపే టీజర్ ఇది.
అతను జైలుకు వెళ్లాలా? న్యూస్ వీడియో
నిడివి 3 ని. 29 సె. హిట్స్ 50,888
యూ ట్యూబ్‌లో వీడియోస్ పోస్ట్ చేసేవారు ఈ సంగతి విని నోరెళ్ల బెడతారు. బార్సిలోనాలో స్థిరపడ్డ ‘కంగుహ’ అనే 20 ఏళ్ల చైనిస్ కుర్రాడు యూ ట్యూబ్‌లో తరచూ ఫన్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాడు. వాటి వల్ల అతనికి ఆదాయం వస్తూ ఉంటుంది. అయితే అతడు జనవరి, 2017లో ఓరియో బిస్కెట్లలో క్రీమ్ తీసేసి టూత్ పేస్ట్ నింపి రోడ్డు పక్క ఉన్న ఒక కాందిశీకుడికి ఇచ్చాడు.
ఆకలితో ఉన్న ఆ కాందిశీకుడు ఆ బిస్కెట్లు తిన్నాడు.అంత వరకూ షూట్ చేసిన వీడియోను కంగుహ తన చానల్‌లో ప్రేక్షకుల వినోదం కోసం పెట్టాడు. అయితే ఇది చాలా అవమానకరమైన పని అని ఆ దేశంలో (స్పెయిన్) కేసు నమోదైంది. ‘నైతిక సమగ్రత’కు భంగం కలిగేలా ప్రవర్తించాడని వాదనలు నడిచాయి. అరెస్టు ఆ వెంటనే బెయిలు పై విడుదలైన కంగుహ కుయ్యో మొర్రో అంటూ ఆ వీడియోను తొలగించాడు. తాను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా రెండు రోజుల పాటు రోడ్డు పక్కన నివసించాడు.
ఇవి ప్రజల నుంచి మద్దతు సంపాదించి పెట్టాయి కాని కోర్టు నుంచి కాదు. నేరం నిరూపణ అయితే కంగుహకు అక్షరాల రెండేళ్ల జైలు శిక్ష పడనుంది. అలాగే దాదాపు పాతిక లక్షలు అతని నుంచి జరిమానాగా వసూలు చేసి ఆ కాందిశీకుడికి ఇవ్వనున్నారు. ఇదంతా విని జనం విసుక్కుంటున్నారు. చిన్న ప్రాంక్‌కు ఇంత పెద్ద శిక్షా అని నిరసన తెలియ చేస్తున్నారు. ఈ వ్యవహారాన్నంతా వివరించే న్యూస్ వీడియో ఇది. (ఇన్‌సెట్‌లో కంగుహ).
Comments
Please login to add a commentAdd a comment