అంగ్రేజీ మే కెహెతే హై ట్రైలర్
నిడివి 2 ని. 1 సె. , హిట్స్ 15,86,450
‘నేను ఆఫీసుకు వెళతాను. నువ్వు ఇంట్లో ఉంటావు. పెళ్లంటే అదే’ అంటాడు ఈ సినిమాలో నడి వయసు మనిషి. అతననే ఏముంది... దేశంలో లక్షా తొంభై వేల మంది... సారీ... తొమ్మిది కోట్ల తొంభై వేల మంది... సారీ... ఇంకా ఎందరో లెక్క తెలీదు కానీ అంత మంది మగవాళ్లు ఆ మాటే అంటూ ఉంటారు. ఆఫీసుకు వెళతాను, జీతం తెస్తాను, బాధ్యతలు నెరవేరుస్తాను అదే కదా పెళ్లంటే అని.
కాని దానిలో ‘ప్రేమ’ అనే ఒక చిన్న దినుసును మిస్సవుతారు. అది స్త్రీకి కావాలి. భార్యకు కావాలి. భర్త నుంచి కావాలి. దానిని అడిగితే అతనికి కోపం వస్తుంది. చిరాకు వస్తుంది. ప్రత్యేకంగా ప్రేమ ప్రదర్శించడం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. కానీ ఆ భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోతే అప్పుడు భార్య మీద అన్నాళ్లూ దాచి పెట్టిన ప్రేమంతా బయటకు వస్తుంది. ‘అంగ్రేజీ మే కెహెతే హై’... ఇలాంటి కథతో తయారైన సినిమా.
మధ్య వయసులో ఉన్న జంట పెళ్లి నుంచి విడిపోయి తిరిగి ప్రేమలో పడే కథ ఇది. నటుడు సంజయ్ మిశ్రా ఈ మధ్య హీరోతో సమానంగా ముఖ్యపాత్రలలో సినిమాలు చేస్తున్నాడు. భావోద్వేగాలు, కొద్దిపాటి హాస్యాన్ని హామీ ఇస్తున్న ఈ సినిమా ట్రైలర్ సినిమా కోసం ఎదురు చూసేలా చేస్తోంది. మే 18 విడుదల.
ఫేమస్ ట్రైలర్
నిడివి 2 ని. 17 సె. , హిట్స్ 57,47,718
ఇంగ్లిష్‌లో ఫేమస్‌ను ‘ఎఫ్’ అక్షరం ఉచ్ఛారణ ద్వారా అందరూ ‘ఫేమస్’ (జ్చఝౌuట) అనే పలుకుతారు. కాని మధ్యప్రదేశ్, చంబల్ ప్రాంతంలో ఆ పదాన్ని ‘పి’తో మొదలెట్టి మోటుగా ‘ప్పేమస్’ (pp్చఝౌuట) అని పలుకుతారు. చంబల్ ప్రాంతంలో వెలిగిన దీపాలు నేటికీ తక్కువ. ఆ ప్రాంతం పై పడిన వెలుతురూ తక్కువ. ఆ ప్రాంత జీవనం మీద వచ్చిన సినిమాలు అరడజను వరకూ ఉంటాయి. కాని అరవై తీసినా ఆ ప్రాంతం అర్థమయ్యేది చాలా తక్కువే.
ఇప్పుడు చంబల్ ప్రాంతంలో నాలుగు పాత్రల మధ్య నడిచే కథగా ‘ప్పేమస్’ సినిమా తయారయ్యింది. జాకీష్రాఫ్, జిమ్మీ షేర్‌గిల్, కెకె, శ్రియ... ఇలా భారీ తారాగణం ఈ సినిమాలో ఉంది. చంబల్ అంటేనే తుపాకీ సంస్కృతి. ఆ సంస్కృతి తాలూకు విశృంఖలత్వం ఈ సినిమాలో చూడొచ్చు. ‘సీతను అపహరించుకొని వెళ్లకపోతే ఏ మనిషీ రాముడిగా మారలేడు’ వంటి డైలాగ్స్ ఉన్నాయి. జూన్ 1న ఈ సినిమా విడుదల కానుంది. కరణ్ లలిత్ భూటానీ దీని దర్శకుడు.
సమ్మోహనం టీజర్
నిడివి 1 ని. 13 సె. , హిట్స్ 3,79,500
సినిమా హీరోయిన్‌తో ప్రేమలో పడితే... అదీ ఫ్యాన్సీగా కాదు... సీరియస్‌గా... ఆ సినిమా హీరోయిన్ కూడా సున్నితమైన భావాలు కలిగిన యువతి అయితే? సినిమా వాళ్లంటే ఒక చిన్న చూపు ఉంటుంది కొందరిలో. ఇందులో హీరో కూడా అలాంటివాడే కావచ్చు. కానీ అతడు ప్రేమలో పడింది సినిమా హీరోయిన్‌తోనే. తర్వాత ఏమైంది? అనేదే కథ. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ హృద్యమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడనే పేరు సంపాదించాడు.
ఈ సినిమా కూడా అలాంటిదే కావచ్చు. ‘గ్రోయింగ్ అప్’ అంటారు. అంటే ఎదగడం. ఈ సినిమాలో హీరో సుధీర్, హీరోయిన్ అదితి రావ్ పరస్పరం సమ్మోహనంలో పడి ఒకరినొకరు అర్థం చేసుకునే క్రమంలో ఎదుగుతారని టీజర్ సూచిస్తోంది. అభిరుచి ఉన్న నిర్మాతగా శివలెంక కృష్ణప్రసాద్‌కు పేరు. ‘జంటిల్‌మెన్’ తర్వాత కృష్ణప్రసాద్, మోహనకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఆకట్టుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment