రాజుగాడు ట్రైలర్
నిడివి 1 ని. 58 సె. హిట్స్8,79,057
పూర్వం సినిమాలో భౌతిక పరమైన ప్రాణాంతక జబ్బులుండేవి. ‘కేన్సర్’ సినిమా వాళ్లకు పెద్ద వరమైంది. హీరోకో హీరోయిన్‌కో కేన్సర్‌ను పెట్టి చాలా హిట్టు కథలే కొట్టారు. కాని దర్శకుడు మారుతి ఈ జబ్బులను వదిలిపెట్టి మానసిక జబ్బులకు వెల్‌కమ్ చెప్పాడు.
‘మతిమరుపు’, ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్’ వంటి జబ్బులతో ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’ సినిమాలు తీశాడు. ఇదే కోవలో ఇంకో జబ్బుతో సినిమా రాబోతోంది. దాని పేరే ‘రాజుగాడు’. ‘క్లెప్టోమేనియా’ అనేది ఒక జబ్బు. ఈ జబ్బు ఉన్నవారు ఏదో ఒకటి దొంగతనం చేయకుండా ఉండలేదు. ఆఖరికి చెంచాలో, చెంప పిన్నులో దొంగతనం చేస్తేనే వీరికి మనశ్శాంతి.
అలాంటి జబ్బును మూల సూత్రంగా తీసుకొని ఈ సినిమా కథ అల్లుకున్నారని ట్రైలర్ సూచిస్తోంది. రాజ్ తరుణ్‌కి సరదా సినిమాల హీరో అనే పేరు పడింది. ఆ పేరుకు తగినట్టుగా ఉండటానికి తోడు రాజేంద్రప్రసాద్ ఒక ముఖ్యపాత్ర పోషిస్తుండటంతో ఈ సినిమా కుతూహలం కలిగిస్తోంది. హీరోయిన్ యధావిధిగా ఉత్తరాది అమ్మాయి. అయితే మెచ్చుకోవాల్సిన సంగతి సంజనా రెడ్డి అనే మహిళా దర్శకురాలు తొలిసారి దర్శకత్వం వహించడం. త్వరలో విడుదల.
వాట్సాప్ స్టోరీస్ మహాతల్లి కామెడీ
నిడివి 11 ని. 28 సె. హిట్స్ 6,73,377
రోజువారీ అంశాల చుట్టూ చిన్నపాటి జోకులేసి నవ్వించే కామెడీ వీడియోలను ‘మహాతల్లి’ పేరుతో విడుదల చేసే జాహ్నవి ఈసారి వాట్సాప్ మీద తన వ్యంగ్యాన్ని సంధించింది. వాట్సాప్ పేరుతో జనం ఒకరినొకరు ఎంతగా హింసించుకుంటున్నారో ఈ వీడియోలో హాస్యభరితంగా చూడొచ్చు. వాట్సాప్ వచ్చాక ప్రతి కుటుంబం లేదా బంధుగణం ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుంటోంది. ప్రతి కుటుంబంలో చిన్న పిల్లలు ఉంటారు కదా.
వారి ఫొటోలు రోజూ పెట్టడం, భార్యాభర్తలైతే సెల్ఫీలు దిగి ఫొటోలు పెట్టడం, ఆ తర్వాత గుడ్ మార్నింగ్ మెసేజీలు... దీంతో మెమరీ నిండిపోతోందని మహాతల్లి గోల చేస్తుంది. కాని ఎవరు వింటారు. గ్రూప్‌లో నుంచి బయటకు వచ్చేస్తే అదో గొడవ. ఒకవేళ వచ్చేసినా ఎవరో ఒకరు యాడ్ చేసి హింసిస్తారు. వాట్సాప్‌లో అన్నీ ఫ్రీ మెసేజ్‌లు కావడం వల్ల తిన్నావా, తాగావా, నిద్రపోయావా, లేచావా... అని చీటికి మాటికి మెసేజ్‌లు పెట్టడం, పెట్టినప్పుడల్లా ఆ మేసేజ్‌కు టింగ్‌మని రిసీవ్ చేసుకున్నవారికి సౌండ్ రావడం అదో చిరాకు.
ఇక చిననాటి ఫ్రెండ్స్ గ్రూప్‌లో ఇష్టం ఉన్నా లేకున్నా బర్త్‌డే విషెస్, హాయ్ బాయ్ చెప్పడం అదో హింస. దీనికి తోడు అదే వాట్సాప్‌లో ఫార్వార్డ్ మెసేజీలు... బొప్పాయిలో అల్లంకాయ కలిపి నల్లొంకాయ మిక్స్ చేసి అది తాగితే అరవై కిలోలు అర్ధరాత్రి లోపల తగ్గొచ్చని, ఫలానా వారికి డబ్బు సహాయం చేయమని ఈ హింస ఒకటి. వీటన్నింటినీ చూపి మహాతల్లి హాయిగా నవ్విస్తుంది. మీరూ నవ్వండి.
హర్ ఫస్ట్ టైమ్ షార్ట్ ఫిల్మ్
నిడివి 8 ని. 30 సె. హిట్స్ 94,577
ఒక పదీ పదకుండేళ్ల అమ్మాయి బాత్‌రూమ్‌లో ఉంటుంది. ముఖం మీద ప్రశ్నార్థకం. వేళ్ల అంచున కొద్దిగా రక్తం. అక్కడ నుంచి మొదటిసారి కనిపిస్తున్న రక్తం. ఇది తల్లితో మాట్లాడాల్సిన సందర్భం. కాని తల్లి డాక్టర్. హాస్పిటల్‌లో సీజేరియన్‌తో బిజీగా ఉంటుంది. ఇంట్లో తండ్రి ఒక్కడే ఉంటాడు.
అతడికి సిట్యుయేషన్ ఎలా డీల్ చేయాలో అర్థం కాదు. కూతురితో చర్చించి అమ్మకు మెసేజ్ పెడదామా అని పెడతాడు. వెంటనే తల్లి ఒక్క క్షణం ఉద్వేగానికి లోనవుతుంది. ఫలానా అరలో ఒక బాక్స్ ఉంటుంది చూడు అని మెసేజ్ పంపుతుంది. కూతురు, తండ్రి వెళ్లి ఆ బాక్స్ తెరిస్తే అందులో శానిటరీ నాప్‌కిన్ దానిని ఎలా వాడాలో ఒక చిన్న చీటీ ఉంటుంది.
పిల్లలు మొదటిసారి పీరియడ్స్ పొందినప్పుడు అంటే పెద్దమనిషి అయినప్పుడు వాళ్లతో ఎలా మాట్లాడాలి ఎలా చర్చించాలి తండ్రులు ఎలా వ్యవహరించాలి ఈ షార్ట్ ఫిల్మ్ హృద్యంగా చూపించింది. ఆడపిల్లలున్న ప్రతి కుటుంబం ఈ షార్ట్‌ఫిల్మ్ చూడాలి. దివ్య ఉన్ని అనే నటి నటించి దర్శకత్వం వహించింది.
Comments
Please login to add a commentAdd a comment