కరన్‌జిత్ కౌర్ – ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్ – ట్రైలర్
నిడివి 2 ని. 2 సె., హిట్స్ 92,01,505
బయోపిక్‌లు వెండితెర మీదికి వస్తున్నాయి. ఇప్పుడు వెబ్ చానల్స్‌లో కూడా వస్తున్నాయి. ‘జీ5’ వెబ్‌చానల్ జీ5 ఒరిజినల్స్ పేరుతో కొన్ని నిర్మాణాలు చేసి ప్రసారం చేస్తోంది. తాజాగా సన్నీలియోన్ బయోగ్రఫీని చిత్రీకరించింది. 16 జూలై నుంచి వీటిని జీ5 వెబ్ చానల్‌లో చూడవచ్చు. సన్నీలియోన్ అసలు పేరు చాలామందికి తెలియకపోవచ్చు. ఆమె పేరు ‘కరన్‌జిత్ కౌర్’. కెనడాలో స్థిరపడ్డ పంజాబీ కుటుంబం నుంచి వచ్చింది.
ఆమె బాల్యం, కుటుంబంలో ఏర్పడిన పరిస్థితులు ఏ విధంగా ఆమెను పార్న్ స్టార్‌ను చేశాయో ఈ సిరీస్‌లో చూపించనున్నారు. సన్నీలియోనే తన పాత్రను తాను ధరించింది. ఇంగ్లిష్, హిందీ రెండు అర్థమైతే తప్ప ఈ సిరీస్‌ను అర్థం చేసుకోలేకపోవచ్చు. పార్న్ స్టార్‌గా ఉండి కూడా భారతదేశానికి తిరిగి వచ్చి ఇక్కడ ఆత్మగౌరవంతో కెరీర్‌ను స్థిరపరుచుకున్న సన్నీలియోన్ కచ్చితంగా మూసను భగ్నం చేసిన మహిళే. ఆమె జీవితం పట్ల కుతూహలం ఉన్నవాళ్లు ఈ సిరీస్ చూడవచ్చు.
కార్వాన్ –ట్రైలర్
నిడివి 2 ని. 37 సె. , హిట్స్ 61,26,951
ఇర్ఫాన్ ఖాన్ అనారోగ్యంతో ఉన్నాడు. కాని అనారోగ్యానికి ముందు నటించిన సినిమాలలో ‘కార్వాన్’ ఆఖరుది. దీని తర్వాతి సినిమా అంటే అతడు కోలుకుని ఒప్పుకుని నటించబోయేదే. ఇంతకు ముందు విడుదలైన ఇర్ఫాన్ సినిమాలు ‘కరీబ్ కరీబ్ సింగిల్’, ‘బ్లాక్‌మెయిల్’ మంచి టాక్‌ను సంపాదించి విజయం సాధించాయి. ఆ వరుసలోనే ‘కార్వాన్’ కూడా ఉండొచ్చు. ఇది కూడా రోడ్ ఫిల్మ్. ఇందులో మరో ముఖ్యపాత్ర కూడా ఉంది. దీనిని అభిషేక్ బచ్చన్ నటించాల్సిందిగానీ అతడు చివరి నిమిషంలో తప్పుకోవడంతో ఆ గారెల బుట్టలో దుల్కర్ సల్మాన్ పడ్డాడు. ఇది దుల్కర్ తొలి హిందీ సినిమా.
ఇర్ఫాన్‌తో పోటీ పడి నటించే అవకాశం వచ్చిందనే చెప్పాలి. తీర్థయాత్రలకు వెళ్లిన తండ్రి హటాత్తుగా చనిపోతే ట్రావెల్ ఏజెన్సీ వాళ్లు బాడీని కార్గో చేస్తారు. అయితే ఒక శవం రావడానికి బదులు ఇంకో శవం వస్తుంది. దాని కోసం వ్యాన్ డ్రైవర్ అయిన ఇర్ఫాన్‌తో కలిసి ప్రయాణిస్తాడు దుల్కర్. ఈ మధ్యలో ఏం జరిగిందనేది కథ. ఒక దర్శకుడు బిజయ్ నంబియార్ ఈ సినిమాకు రచన చేస్తే మరో దర్శకుడు ఆకర్ష్ ఖురానా తెర రూపం ఇచ్చాడు. ఇర్ఫాన్ అభిమానులు, దుల్కర్ అభిమానులు కూడా దీని కోసం ఎదురుచూడవచ్చు.
గూఢచారి – టీజర్
నిడివి 42 సె. ,హిట్స్ 16,33,637
అడవి శేష్ గత సినిమా ‘క్షణం’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మరో థ్రిల్లర్‌తో అతడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని ఈ టీజర్ చెబుతోంది. నటించడంతో పాటు తన సినిమాలకు కథలు కూడా రాసుకుంటున్న అడవి శేష్ ఈ ‘రా’ వంటి ఇంటెలిజెన్స్ వర్గాల నేప«థ్యంలో కథను అల్లుకున్నాడు.
తండ్రి కొడుకుల సెంటిమెంట్ కూడా ఉన్నట్టుగా అనిపిస్తోంది. శోభిత ధూళిపాళ దీని కథానాయిక. వెన్నెల కిశోర్, ప్రకాశ్ రాజ్ ముఖ్యపాత్రల్లో కనిపిస్తున్నారు. ఆగస్టులో ఈ సినిమా రానుంది.
సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్ 3 – ట్రైలర్
నిడివి 2 ని. 46 సె. , హిట్స్ 101,99,227
‘సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్’ సిరీస్‌లో ఇది మూడవభాగం. మొదటి భాగం ‘సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్’, రెండవభాగం ‘సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్ రిటర్న్స్’ దాని తర్వాత ఇది మూడవ భాగం. ఒక సంపన్నమైన భర్త, అతడి చంచలమైన భార్య, వారి నడుమ వచ్చి ఆమెను ఆకర్షించిన గ్యాంగ్‌స్టర్... ఇదీ ఈ కథల వరుస ఇతివృత్తం. ఇంటిమేట్ సన్నివేశాలు ఉంటాయి. భార్యాభర్తల పాత్రలు వేసిన జిమ్మి షేర్‌గిల్, మహి గిల్ ప్రతి భాగంలో కొనసాగుతూ ఉండగా గ్యాంగ్‌స్టర్ పాత్రను వేసిన నటులు మారుతూ వస్తున్నారు.
మొదటి భాగంలో రణదీప్ హూడా, రెండో భాగంలో ఇర్ఫాన్ ఖాన్ ఈ పాత్ర చేయగా రాబోయే మూడో భాగంలో సంజయ్ దత్ నటించాడు. సంజయ్ దత్ మీద వచ్చిన ఆటో బయోగ్రఫీ ‘సంజు’ భారీ హిట్ కావడంతో జైలుకు వెళ్లగా అతడి ఆబ్సెన్స్ వల్ల ఏర్పడిన ఖాళీని ‘సంజు’ భర్తీ చేసింది. ఇక సంజయ్ దత్తే రంగంలో దిగి తన సినిమాలతో మళ్లీ పాత ప్రభావాన్ని పొందే ప్రయత్నం చేస్తాడు. ‘పాన్‌సింగ్ తోమార్’ వంటి హిట్ ఇచ్చిన తిగ్‌మన్షు ధులియా దీనికి దర్శకుడు. ఈ నెల 27న విడుదల.
Comments
Please login to add a commentAdd a comment