ది ప్రిన్సిపాల్ – కామెడీ షార్ట్ ఫిల్మ్
నిడివి 10 ని. 09 సె. , హిట్స్ 23,41,270
డైలీ టెస్టుల్లో మార్కులు తక్కువ వస్తున్నాయని ప్రిన్సిపాల్‌కి స్టూడెంట్ల మీద చిరాకు వస్తుంది. ఒక్కొక్కళ్లని ప్రవేశపెట్టమని ప్యూన్‌తో అంటాడు. ఆ తర్వాత ఏమైందనేది ఈ షార్ట్‌ఫిల్మ్. వైవా హర్ష ప్రిన్సిపాల్‌గా చేశాడు. ఎంసెట్, జెఇఇ, బిబిఎస్‌ఎఫ్, ఏబిసిడి... ఇలా రకరకాల ఎంట్రన్స్ టెస్టుల్లో ర్యాంకుల కోసం పిల్లల్ని ప్రయివేట్ కాలేజీల్లో వాటికి అనుబంధంగా ఉన్న హాస్టల్స్ పడేసి పిల్లల్ని హింసిస్తే ఆ పిల్లలు ఎందుకూ పనికి రాకుండా పోయి ప్రిన్సిపాల్‌కే జెల్ల కొట్టే పరిస్థితి ఈ షార్ట్‌ఫిల్మ్‌లో కనిపిస్తుంది.
‘పిల్లలు ఔటింగ్ అడుగుతున్నారు సార్’ అని ప్రిన్సిపాల్‌తో అసిస్టెంట్ అంటే ‘అయితే ఒకసారి తలుపులు తెరిచి వెంటనే మూసెయ్’ అని జవాబు చెప్తాడు ప్రిన్సిపాల్. ఇవాళ్టి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో పరిస్థితి ఇలాగే ఉంటుంది కదా. అన్నట్టు ఈ కాలేజ్‌లో టాయిలెట్లు సరిగా ఉండవు. అందుకని అందరూ ప్రిన్సిపాల్ రూమ్‌లోని టాయిలెట్‌ని వాడుతుంటారు. టాయిలెట్లు సరిగా లేని కాలేజీ అయితే మనకేమిటి? మనకు కావాల్సింది ర్యాంకులు. ‘ఒకటీ ఒకటీ ఒకటీ రెండూ రెండూ రెండూ’.. అని ఈ కాలేజీ ర్యాంకుల గురించి డబ్బింగ్ చెప్పే డబ్బింగ్ ఆర్టిస్టుకు అరిచి చెప్పడం వల్ల స్వర పేటిక దెబ్బ తిని వైద్యం కోసం రెండు గాజులూ అమ్ముకోవాల్సి రావడం నవ్వు తెప్పిస్తుంది. మునపటి పంచ్‌లు తగ్గినా సరదా చూసే స్థాయిలో ఉంది.
నవాబ్ – ట్రైలర్
నిడివి 2 ని. 46 సె. ,హిట్స్ 12,48,199
మణిరత్నం గతంలో మల్టిసార్టర్స్ చాలానే తీశాడు. ఇప్పుడు మరొకటి. ఈసారి ఇందులో అరవింద్ గోస్వామి, విజయ్ సేతుపతి, శింబు, అరుణ్ విజయ్ ముఖ్యపాత్రధారులు. మరో ముఖ్యపాత్ర ప్రకాష్ రాజ్. కథలు దొరకనప్పుడల్లా మణిరత్నం, రామ్‌గోపాల్‌వర్మ వంటి దర్శకులకు ‘గాడ్‌ఫాదర్’ అన్నం పెడుతూనే ఉంటుంది.
ఈ కథ కూడా మరో గాడ్‌ఫాదర్ తరహాగా కనిపిస్తూ ఉంది. గాడ్‌ఫాదర్ అయిన ప్రకాష్‌రాజ్‌కు ముగ్గురు కొడుకులైన అరవింద్, శింబు, అరుణ విజయ్‌లకు మధ్య నడిచే కథ ఇది. ఇందులో ఒక పాత్రకు మన నానిని అనుకున్నారట గాని కుదరలేదు. దాంతో మొత్తంగా తమిళ ముఖాలు నిండిన సినిమా అయ్యింది. అయినప్పటికీ మణిరత్నం మీద అభిమానంతో దీని పట్ల కుతూహలం ప్రదర్శించే అభిమానులు ఉండకుండా ఉంటారా? రెహమాన్ సంగీతం.
లవ్ సోనియా – ట్రైలర్
నిడివి 2 ని. 42 సె.,హిట్స్ 1,19,67,892
భారత దేశంలో రోజుకు 270 మంది ఆడవాళ్లు/బాలికలు/ఆడ శిశువులు మిస్సవుతున్నారట. వాళ్లంతా ఏమవుతున్నారు? దారుణమైన వ్యభిచార కూపంలో దింపబడుతున్నారు. సామాన్య మానవుల ఊహకు కూడా అందనంత కర్కశమైన చీకటి వ్యాపారాలు ఈ దేశంలోనే కాదు ప్రపంచమంతా ఉన్నాయి. వ్యభిచారం వంటి వ్యాపారాలకు అంతర్జాతీయ సంబంధాలు ఉంటాయి. ఇక్కడ మాయమైన యువతి ఏ దేశంలో తేలుతుందో చెప్పలేము.
ఇంత ‘నాగరీకమైన’ సమాజంలో, పోలీసు – నేరపరిశోధక వ్యవస్థ ఇంత అభివృద్ధి చెందిన ఈ రోజులలో కూడా ఈ స్థాయి మానవ వ్యాపారం జరుగుతుంటే మనం ఎక్కడ ఉన్నట్టు. హిందీలో ఇప్పుడు రాబోతున్న ‘లవ్ సోనియా’ వ్యభిచారంపై ఫోకస్ పెట్టింది. నిజ జీవిత ఘటనల ఆధారంగా తీసిన ఈ సినిమాలో దేశీయ హాలీవుడ్ నటీనటులు నటించారు. హాలీవుడ్ టెక్నిషియన్లు పని చేశారు. వ్యభిచార గృహానికి అమ్మివేయబడ్డ తన సోదరి కోసం మరో సోదరి చేసే వెతుకులాట ఈ కథ. బహుశా తప్పక చూసి తెలుసుకోవాల్సిన సినిమా. రాజ్‌కుమార్ రావ్, అనుపమ్ ఖేర్, రిచా చద్దా, మనోజ్ బాజ్‌పేయి తదితరులు నటించారు. ‘లైఫ్ ఆఫ్ పై’ తీసిన డేవిడ్ ఓమర్క్ నిర్మాత. తబ్రేజ్ నూరాని దర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment