
ఈ వారం యూట్యూబ్ హిట్స్ హిట్స్
శృతిహాసన్ అన్‌బ్లష్‌డ్: బి ద బిచ్
నిడివి : 2 ని. 27 సె.
హిట్స్ : 5,83,133
‘బిచ్’ అనేది మంచి మాట కాదు. వదిలేసి వెళ్లిన అమ్మాయిని మగాళ్లు తిట్టే తిట్టు. బట్... ‘బి ద బిచ్’ అంటున్నారు శృతిహాసన్. అమ్మాయిలూ... బిచ్‌లా ఉండండి అని స్క్రిప్ట్ రాశారు. స్క్రీన్‌ప్లే ఇచ్చారు. ‘బ్లష్’ అనే వీడియో చానల్ దాన్ని అప్‌లోడ్ చేసింది. యూట్యూబ్‌లో ఇప్పుడొక సంచలనం ఈ వీడియో. బిచ్ అనే మాటకు మంచి నిర్వచనం ఇచ్చారు శృతి ఇందులో. అదీ తన టోన్‌లో. ‘బిచ్ ఈజ్ ఎ ప్యూర్ యాంబిషన్ విత్ హార్మోన్స్’ అని ముగించారు. బిచ్ టీచర్‌లా సొసైటీని మారుస్తుంది, బిచ్ మల్టీ టాస్కింగ్ చేస్తుంది అంటూ ఎమోషనల్‌గా సాగే శృతీ వీడియో ప్రతి అమ్మాయికీ ఒక సెల్ఫ్ ఎప్రైజల్. తప్పకుండా చూడండి. అబ్బాయిలూ మిమ్మల్నే.
రోగ్ వన్: స్టార్ వార్స్ స్టోరీ ట్రైలర్
నిడివి : 2 ని. 37 సె.
హిట్స్ : 67,48,196
స్టార్ వార్స్ సిరీస్‌లోని లేటెస్ట్ మూవీ ‘రోగ్ వన్’ రెండో ట్రైలర్ విడుదలైంది! చిత్రం ఈ డిసెంబర్ 16న రిలీజ్ అవుతోంది. విశ్వాంతరాళాల్లో పాలపుంత సామ్రాజ్యం (గెలాక్టిక్ ఎంపైర్) ఏర్పడ్డాక తిరుగుబాటు శక్తులు తలెత్తుతాయి. ఆ శక్తులు జిన్ ఎర్సో అనే యువతిని నియమించుకుని ఆమెకు క్యాసియన్ ఆండన్ అనే యువకుడిని జత కలిపి ‘డెత్ స్టార్’ ప్లాన్స్‌ని దొంగిలించడానికి పంపుతాయి. డెత్ స్టార్ అనేది పాలపుంత సామ్రాజ్యానికి చెందిన ఒక మొబైల్ స్పేస్ స్టేషన్. అందులోని సమాచారాన్ని సంగ్రహిస్తే గెలాక్టిక్ ఎంపైర్‌పై ఈ తిరుగుబాటు శక్తులు ఆధిక్యాన్ని సంపాదించవచ్చు. అదీ పథకం. తొలి స్టార్ వార్స్ చిత్రం 1977లో వచ్చింది. ఆ వరుసలో ‘రోగ్ వన్’ 9వ సినిమా. మరో 5 చిత్రాలు మేకింగ్‌లో ఉన్నాయి. ‘రోగ్ వన్’కు గ్యారెత్ ఎడ్వార్డ్స్ దర్శకత్వం వహిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్‌కి బాగా అలవాటు పడి, స్పందనలు కోల్పోయిన ఈ తరాన్ని సైతం ఎంటర్‌టైన్ చేసేలా ఈ హాలీవుడ్ ఎపిక్ స్పేస్ అపేరా ఉండబోతోంది. నమ్మలేకపోతే ట్రైలర్‌ని చూడండి.
డొనాల్డ్ ట్రంప్ అండ్ హిల్లరీ: ఐ హ్యావ్ హ్యాడ్ ది టైమ్ ఆఫ్ మై లైఫ్
నిడివి : 1 ని. 31 సె.
హిట్స్ : 35,81,825
ట్రంప్, హిల్లరీ.. ఉప్పు, నిప్పు. ప్రెసిడెన్షియల్ డిబేట్‌లలో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. సీమ టపాకాయల్లాంటి మాటలు పేల్చుకుంటున్నారు. హిల్లరీని చూసి ట్రంప్ పటపట పళ్లు కొరుకుతున్నారు. ట్రంప్‌ను చూసి హిల్లరీ మూతీ ముక్కూ విరుస్తున్నారు. ‘నేను అమెరికా ప్రెసిడెంట్ అయితే హిల్లరీని జైల్లో తోయిస్తా’ అని ట్రంప్ అంటే, ‘అమెరికన్ మహిళల చేతుల్లో తమరికి ఉంది లెండి’ అని హిల్లరీ అన్నారు. అయితే ఒక డిబేట్‌లో మాత్రం సడెన్‌గా వీళ్లు డ్యూయెట్ పాడుకున్నారు! 1987 నాటి బిల్ మెడ్లీ (గాయకుడు), జెన్నీఫర్ వార్న్స్ (గాయని)ల ప్రేమగీతం ‘ఐ హ్యావ్ హ్యాడ్ ది టైమ్ ఆఫ్ మై లైఫ్’ను వేదికపై ఆలపించి ప్రేక్షకులను అలరించారు. నమ్మలేకపోతున్నారా? అయితే ఈ వీడియో చూసి మాట్లాడండి. అప్పటికీ నమ్మలేకపోతే, మనం ఉన్న విషయమే మాట్లాడుకోవాలి. నిజానికి వీళ్లిలా ఒకళ్లపై ఒకళ్లు ప్రేమగా, ఆరాధనగా పాడుకోలేదు. ఒకవేళ పాడుకుని ఉంటే చూడ్డానికి ఎలా ఉంటుందీ అన్న ఒక అందమైన ఊహ వచ్చిన వాళ్లెవరో డిబేట్‌లో ట్రంప్, హిల్లరీల లిప్ మూవ్‌మెంట్‌కు అమరేలా ఈ లవ్ సాంగ్‌ను సెట్ చేశారు. ఈ మీమ్ (ఝ్ఛఝ్ఛ) ప్రపంచాన్ని నవ్వుల్తో షేక్ చేస్తోంది. ‘ఇప్పటికి తీరికయింది, నా జీవిత క్షణాలను నీకు అర్పించడానికి’ అనే అర్థం వచ్చే ఈ మెలడీ ఎన్ని జన్మల శత్రువులకైనా సెట్ అవుతుందేమో!