అది ఆయన... స్వభావం, సంస్కారం!
మరువలేని జ్ఞాపకం
పల్లవి:
పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల
నా తల్లి బంది అయిపోతుందో కనిపించని కుట్రల
చరణం: 1
కుమ్మరి వామిలొ తుమ్మలు మొలిసెను
కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను
పెద్ద బాడిస మొద్దు బారినది
సాలెల మగ్గం సడుగులిరిగినది
చేతి వృత్తుల చేతులిగిరిపాయే నా పల్లెల్లోన
అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోనపాయే ఈ దేశంలోనే
చరణం: 2
మడుగులన్ని అడుగంటి పోయినవి
బావులు సావుకు దగ్గరయ్యినవి
వాగులు వంకలు ఎండిపోయినవి
సాకలి పొయ్యిలు కూలిపోయినవి
పెద్ద బోరు పొద్దంత నడుస్తుందో బలిసీన దొరలవి
మరి పేద రైతుల బావులెందుకెండే నా పల్లెల్లోన
(మొత్తం 15 చరణాల పాట ఇది)
చిత్రం: కుబుసం (2002)
గీత రచయిత: గోరటి వెంకన్న
సంగీతం, గానం: ‘వందేమాతరం’ శ్రీనివాస్
‘పల్లె కన్నీరు పెడుతుందో’ పాట ఒక చారిత్రక సందర్భంలో రాసింది. తుప్పు పట్టిన వృత్తులు, దుమ్ము పట్టిన పల్లెలు ఈ పాట ప్రతీ చరణంలో కనిపిస్తాయి. ఈ పాట విని దర్శకుడు శ్రీనాధ్ ‘కుబుసం’ చిత్రంలో ఉపయోగించారు. తరువాత మరో సందర్భంలో కపిల్ సురవరం ఈపాటకు దృశ్యరూపం ఇచ్చాడు. అలా సామాన్యుల దగ్గర నుంచి మేధావుల వరకూ ఈ పాటతో మమేకమయ్యారు.
రాజశేఖర్‌రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో, ఆయన సన్నిహితుడు రవిచంద్ ఈ పాటను ఆయనకు పరిచయం చేశారు. పాట విన్న తరువాత రాజశేఖర్‌రెడ్డి తన భావాలను పాదయాత్ర డైరీలో ప్రత్యేకంగా రాసుకున్నారు. తరువాత తన ఎన్నికల ప్రచారంలో ఈ పాటను ఉపయోగించారు. ఇదంతా నా పరోక్షంలో జరిగింది.
రాజశేఖర్‌రెడ్డి గారు ఎన్నికలలో గెలిచి ప్రమాణ స్వీకారం చేసిన మర్నాడు నాకు కబురుపెట్టారు. మొదట నేను కొంత ఆశ్చర్యపోయాను. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నన్ను పిలవడంలో ఆంతర్యమేమిటో నాకు బోధపడలేదు. నేను మిత్రులతో కలిసి రాజశేఖర్‌రెడ్డి గారి దగ్గరకు వెళ్లాను. నన్ను చూసి ఆయన చుట్టూ వున్న వాళ్లంతా పాటను ప్రశంసిస్తున్నారు. ఆయన ఏమీ మాట్లాడకండా నన్ను చూసి సహజశైలిలో ఒక నవ్వు నవ్వి, కవి గారికి పిల్లలెంతమంది, ఆర్థిక పరిస్ధితులేమిటని ఆరా తీశారు. ఆయన ఔదార్యానికి కృతజ్ఞతలు చెప్పి వచ్చేశాను. నిజానికి మా పరిచయం అక్కడితో ముగిసిపోవలసింది. కానీ రానురాను మా అనుబంధం మరింత బలపడింది. ఆయనకు నా పాట చేసిన చిన్న ఉపకారానికి నన్ను తను ఉన్నంతకాలం ఏదో రకంగా గౌరవించారు. ‘హంస’ అవార్డు సమయంలో ఆయన దగ్గరి వాళ్లతో ఫోన్ చేయించి కవిగారు అవార్డు తీసుకుంటారో లేదోనని వాకబు చేశారు. ఆ తరువాత తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం మొదలుకొని అనేక అవార్డులతో నన్ను గౌరవించారు. ప్రతీ అవార్డు కమిటీలో నన్ను సభ్యుడిగా నియమించారు. నిజానికి ప్రత్యక్షంగా కలిసింది మూడే మూడు సార్లు. కానీ ఆయన పరోక్షంలో ఆయన ఎప్పుడూ నాకు దగ్గరగా వున్నట్టే వుండేది.
ప్రతిష్ఠాత్మక జలయజ్ఞం మీద నాతో ‘సుజలాం, సుఫలాం సస్యశ్యామలం’ పాట రాయించారు. ఆ పాటను నాతో పదే పదే పాడించుకుని మురిసిపోయారు. అసలు అంత స్థాయిలో వున్న వ్యక్తి నన్ను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆయనకు నేనంటే తెలియని అభిమానం. రాజశేఖర్‌రెడ్డి గారికి సహజంగా కృతజ్ఞతా భావం ఎక్కువ. తాను నమ్మిన వారిని, ప్రేమించిన వారిని ఆయన ఎప్పుడూ మరిచిపోలేదు. అది ఆయన స్వభావం, సంస్కారం. ఆయన ప్రేమకు, అభిమానానికి నేను పాత్రుడినవడం నిజంగా నా అదృష్టం.
- గోరటి వెంకన్న
(వై.ఎస్.ఆర్. పోయిన బాధలో పల్లె ఇంకా కన్నీరు పెడుతోంది. ఈ విషయం మీద గోరటి వెంకన్నతో మాట్లాడితే ఈ పాటను ఇచ్చారు. వై.ఎస్.ఆర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.)