కుటుంబ ద్రోహ చరిత్రలో బాబుదే రికార్డు | YSRCP Leader Narne Srinivasa Rao Interview With KSR | Sakshi
Sakshi News home page

కుటుంబ ద్రోహ చరిత్రలో బాబుదే రికార్డు

Published Wed, Mar 27 2019 12:27 AM | Last Updated on Wed, Mar 27 2019 12:27 AM

YSRCP Leader Narne Srinivasa Rao Interview With KSR - Sakshi

సభల్లో సమావేశాల్లో తరచూ తమ్ముళ్లూ, తమ్ముళ్లూ అంటూ సంబోధించే చంద్రబాబు తన సొంత తమ్ముడు ఎక్కడున్నాడో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుగు ప్రజలకు చెప్పగలడా అని జూనియర్‌ ఎన్టీఆర్‌ మామ, వైఎస్సార్‌సీపీ నాయకులు నార్నే శ్రీనివాసరావు ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. సొంత అన్న చంద్రబాబును రామ్మూర్తి ఎంతగానో ప్రేమించి, చాలీచాలని ఆదాయంతోనే ఖర్చులకు డబ్బు పంపించి ఆదుకుంటే అలాంటి తమ్ముడినే చంద్రబాబు నిలువునా ముంచేశారని వాపోయారు. సొంత తమ్ముడైన తనకు అసెంబ్లీ టికెట్‌ విషయంలో బాబు చేసిన మోసాన్ని జీర్ణించుకోలేక రామ్మూర్తి నాయుడు మతిస్థిమితం కోల్పోయారని, ఈరోజు గొలుసులు, తాళ్లతో కట్టేసి అతన్ని ఒక రూములో బంధించి ఉంచుతున్నారని నార్నే అరోపించారు. రాష్ట్రం మొత్తాన్ని తమ కుటుంబంగా భావించి సేవ చేసిన, చేస్తున్న చరిత్ర వైఎస్సార్, జగన్‌మోహన్‌ రెడ్డిలది కాగా సొంత బంధువులను శంకరగిరి మాన్యాలకు పంపించిన చరిత్ర చంద్రబాబుదన్నారు. వైఎస్‌ జగన్‌ని ఏపీ సీఎంగా చేయాలన్నదే తన ఆకాంక్ష అని అది నెరవేరాక రాజకీయాల్లోనే ఉండనంటున్న నార్నే శ్రీనివాసరావు అభిప్రాయం ఆయన మాటల్లోనే...

మీరు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడమే సంచలనం కదా?
వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజలకు అద్భుతమైన సేవ చేశారు. ఆయన తనయుడు జగన్‌మోహన్‌ రెడ్డి కూడా అలాంటి సేవే చేస్తారని నా నమ్మకం. చంద్రబాబును నేను చాలా దగ్గరగా చూశాను. తన మెంటాలిటీ ఏదో నాకు తెలుసు. స్వార్థం తప్ప మరో ఆలోచనే లేదాయనకి. తాను తన కొడుకు తప్ప మరెవరూ కనపడరు ఆయనకు. 

చంద్రబాబుతో చాలాకాలం కలిసున్నారు. ఎక్కడ తేడా వచ్చింది మీకు?
1998లోనే చంద్రబాబు పిలిచి చిలకలూరి పేట అసెంబ్లీ స్థానం ఇస్తాను. ప్రచారం చేసుకోండి అని చెబితే నమ్మి కోటిరూపాయలు పైగా ఖర్చుపెట్టి రెండేళ్లపాటు స్వంతంగా ప్రచారం చేశాను. చివరిదాకా సీటు నాకే అని చెప్పి నమ్మకద్రోహం చేసి మరొకరికి ఆ సీటు ఇచ్చారు. ఆరోజే చంద్రబాబు వ్యవహారం ఏమిటో అర్థమైపోయింది. సొంత బంధువులు ఎవరూ ఒక పొజిషన్‌లో ఉండటం బాబుకు ఇష్టముండదు. నూటికి నూరు శాతం ఇది నిజం. 

మరి చంద్రబాబు తమ్ముడు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?
చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు 1994లో రాజకీయాల్లోకి వచ్చి ఎన్టీఆర్‌ దగ్గర టికెట్‌ కోసం పోరాడితే, బాబు ఇవ్వొద్దని అడ్డుకున్నారు. అప్పుడు లక్ష్మీపార్వతి దగ్గరుండి రామ్మూర్తికి టికెట్‌ ఇప్పించి పంపిస్తేనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అదే రామ్మూర్తి నాయుడికి మరోసారి బాబు మోసం చేసి టికెట్‌ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా నిలబడి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. రామ్మూర్తి నాయుడు, బాబు సెట్‌ అవ్వకముందు కష్టపడి ఖర్చుల కోసం అతనికి డబ్బులు పంపించేవారు. అన్నను ఎంతగానో ప్రేమిస్తే, టికెట్‌ విషయంలో చేసిన మోసాన్ని జీర్ణించుకోలేక రామ్మూర్తి నాయుడు మతిస్థిమితం కోల్పోయారు. 

చంద్రబాబు తమ్ముడు ఇప్పుడు ఎలా ఉన్నారో మీకు తెలుసా?
రామ్మూర్తి నాయుడు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆంధ్రప్రదేశ్‌లో ఎవరికీ తెలియదు.  ఆయన పరిస్థితి ఈరోజు దారుణంగా ఉంది. చంద్రబాబు మైక్‌ తీసుకుంటే తమ్ముళ్లూ, నా తమ్ముళ్లూ అంటూ పాట పాడుతుంటారు. కానీ ఆయన సొంత తమ్ముడు ఎక్కడున్నాడో తెలుసా? ఈ రోజు గొలుసులు, తాళ్లతో కట్టేసి అతన్ని ఒక రూములో బంధించి ఉంచుతున్నారు. దమ్ముంటే సొంత తమ్ముడిని బయటికి తీసుకువచ్చి చూపిం చమనండి. అన్న మీద గుడ్డి నమ్మకంతో అన్నీ చేసిన తర్వాత మోసం చేయడంతో మతిస్థిమితం లేకుండా అయిపోయారు. చంద్రబాబు నాయుడు ఇటీవల ఎన్నికల అఫిడవిట్‌లో కూడా తనకు కోట్లకొద్ది ఆస్తులున్నట్టు పేర్కొన్నాడు. నారాలోకేష్‌కి అయితే 300 కోట్లు ఆస్తి ఉన్నట్లు చూపించారు కదా. అలాంటిది సొంత తమ్ముడిని తీసుకెళ్లి ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించే స్తోమత బాబుకు లేదా? సొంత తమ్ముడిని తాళ్లతో బంధించి దాచి ఉంచే ఖర్మ ఎందుకండీ?  

రామ్మూర్తినాయుడు పరిస్థితి అంత దీనంగా ఉందా.. ఎప్పటినుంచి?
ఈ విషయం బోధపడాలంటే మనం 1990లు 80ల ముందుకు వెళ్లాలి. రామ్మూర్తి అప్పట్లో చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకుంటూ అయిదువేలు పదివేల రూపాయలు సంపాదించుకుంటూ దాంట్లోంచి చంద్రబాబుకు ఖర్చులకు డబ్బు పంపిస్తూ ఉండేవాడు. ఇన్ని కష్టాలు పడి చంద్రబాబును ఈ స్థితికి తీసుకొస్తే  సొంత తమ్ముడికి అన్యాయం చేసి, టికెట్‌ ఇవ్వకుండా వేధించాడు బాబు. అన్నను నమ్ముకున్న ఏ తమ్ముడు కూడా రామ్మూర్తి అంత దారుణంగా దెబ్బతిని ఉండడు.

మొదటినుంచి తన తమ్ముడి విషయంలో బాబు అలాగే ఉండేవారా?
బంధువు అనేవాడిని ఎవరినీ దగ్గర ఉండనివ్వడు చంద్రబాబు. ఆరోజు బాబు ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడంటేనే దానికి కారణం హరికృష్ణ వేసిన భిక్ష. ఆయన, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బాలకృష్ణ కలిసి వత్తాసు ఇస్తేనే సీఎం అయ్యాడు బాబు. అలాంటి హరికృష్ణను తర్వాత ఏం చేశాడో తెలుసు కదండి. మంత్రిపదవి ఇచ్చి ఆరునెలల్లో ఇంటికి పంపించేశాడు. ఎమ్మెల్యే సీటు ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. దగ్గుబాటి టీడీపీనే వదలి వేరే పార్టీల్లో చేరాల్సిన స్థితికి బాబే కారణం కదా. 1983 నుంచి టీడీపీని అంటిపెట్టుకుని ఉన్న దగ్గుబాటిని ఎక్కడికి పంపించాడు బాబు? పురంధేశ్వరి వేరే పార్టీని వెతుక్కుంటూ పోవాల్సిన ఖర్మ ఏం పట్టిందండీ? బాబు లేకపోతే తెలుగుదేశం పార్టీ బాగుండేది. కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి వలసొచ్చి ఈ రోజు అదే కాంగ్రెస్‌ పార్టీకి తాకట్టు పెట్టాలని చూస్తున్నాడు. అతని ఎదుగుదల కోసం ఎన్ని అబద్ధాలైనా చెబుతాడు. దేనికైనా సిద్ధపడతాడు. మనుషులని వాడుకుని, వదిలేయడం అతని నైజం. బాబు ఒక మర్రి చెట్టులాంటివాడు. అతను ఎదుగుతాడు. మర్రిచెట్టు కింద గడ్డిపోచను కూడా మొలవనివ్వడు.

చంద్రబాబుకు, వైఎస్‌ రాజశేఖరరెడ్డికి తేడా ఏమిటి?
రాజశేఖరరెడ్డి అందరూ తన కుటుంబం అనుకుంటారు. కుటుంబం బాగోగులను చూసేవారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను కూడా తన కుటుం బంలాగే భావించుకుని అందరి మేలూ చూసేవారు. అదే చంద్రబాబు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నా వాళ్లు అని ఏరోజూ అనుకోలేదు. రోజుకు ఒక అబద్ధమాడతాడు. రోజుకు ఒక ట్విస్ట్‌ ఇస్తాడు. 

మోహన్‌బాబు కూడా ఈరోజు బాబుపై తిరగబడుతున్నారు కదా?
నిన్నకాక మొన్న పిల్లలతో కలిసి మోహన్‌ బాబు రోడ్డుపైకి వచ్చారు. టీడీపీ వాళ్లు మోహన్‌ బాబును బెదిరిస్తున్నారు. చంద్రబాబుది, మోహన్‌ బాబుది పక్క పక్క ఊర్లే. రామారావు దగ్గర బాబు, లక్ష్మీపార్వతి ఉన్నప్పుడు మోహన్‌ బాబు పక్కనే ఉన్నారు. ఆ సమయంలో ఏమేం జరిగిందో మొత్తం మోహన్‌ బాబుకు తెలుసు. ఒక వేళ మోహన్‌ బాబు నోరు తెరిస్తే బాబుకు తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా దిక్కుతోచని పరిస్థితి.

హరికృష్ణ కుమార్తెకి మొన్న తెలంగాణ ఎన్నికల్లో సీటిచ్చారు కదా?
హరికృష్ణ్ణకు అన్యాయం చేసాడని అందరూ అనేసరికి.. హరికృష్ణ కూతురు సుహాసినికి న్యాయం చేస్తున్నానని చెప్పి, ఆమెను తీసుకొచ్చి ఓడిపోయే కూకట్‌పల్లి సీటిచ్చారు. రాజమండ్రిలో నివసిస్తున్న అమ్మాయిని తీసుకొచ్చి హైదరాబాద్‌లో పోటీకి నిలుచోబెట్టడం ఏంటి? మంచి చేయాలనుకుంటే ఏపీలోనే టికెట్‌ ఇచ్చేవాడు కదా. ఇవన్నీ దొంగ ట్రిక్కులు. 

తన పోటీ వైఎస్‌ జగన్‌తో కాదు కేసీఆర్‌తో అంటున్నారు బాబు?
చంద్రబాబు ఈరోజు వైఎస్‌ జగన్‌తో పోటీపడలేక, ఆయన్ని ఎదుర్కోలేక, ఆయన పేరెత్తలేక, తనతో ఎన్నికల ఫైట్‌ చేయలేక పక్క రాష్ట్రం సీఎం కేసీఆర్‌ పేరు ఎందుకు తెస్తున్నాడు? ప్రధాని పేరు ఎందుకు తీసుకొస్తున్నాడు? ఈరోజు మోదీ ఏం చేయలేదు అంటున్నాడు సరే. మరి నాలుగేళ్లు మోదీతో కాపురం చేసింది చంద్రబాబా లేక జగనా?  కేసీఆర్‌తో కానీ, మోదీతో కానీ ఈ మధ్యకాలంలో జగన్‌ ఎన్నడైనా కలి శారా? ఏపీ ఎన్నికల గురించి ఎన్నడైనా వారితో మాట్లాడారా? కేసీఆర్‌ అనే బూచిని చూపి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను భయభ్రాంతులను చేయడమే చంద్రబాబు ఉద్దేశం. జనాల దగ్గర ఓట్లు పిండుకునే నాటకం కాదా ఇది. ఏపీలో ఉన్న ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక్కరు తెలంగాణలో బతుకుతున్నారు. తెలంగాణలో మూడుకోట్ల మంది ఓటర్లుంటే 60 లక్షలమంది ఆంధ్రనుంచి వచ్చినవారు. ఎన్టీఆర్‌ ఫ్యామిలీ, చంద్రబాబు ఫ్యామిలీ, చిరంజీవి ఫ్యామిలీ, నా ఫ్యామిలీ.. మీ సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ఏపీనుంచి వచ్చిన సెటిలర్లే. ఎవరికైనా ఇంతవరకు ఒక చిన్న ఇబ్బంది కలిగిందా హైదరాబాద్‌లో?

మూలాన్నే వదిలి మీరు వైఎస్‌ జగన్‌ వద్దకు వచ్చారు కారణం?
ఇన్నేళ్లుగా చంద్రబాబును చాలా సన్నిహితంగా చూశాను కాబట్టి తన తత్వం ఏమిటో నాకు తెలుసు. ఇచ్చిన మాటకు కట్టుబడడు. బంధువులనైతే అసలు నమ్మడు, ఎవరినీ ఎదగనివ్వడు. మాట మాట్లాడితే విలువల విధ్వంసం అంటుంటాడు. కానీ, కుటుంబ విలువలను నిలువునా ధ్వంసం చేయడంలో చంద్రబాబును మించిన ఘనాపాటి ఎవరూ ఉండరు. నాతోపాటూ మరో 300 మందికి రాజ్యసభ సీటిస్తా అని హామీ ఇచ్చి దగా చేశాడు. చంద్రబాబును ఎన్నో ఏళ్లుగా పక్కనుంచే చూశా. కుల పిచ్చి, గజ్జి ఉంది చంద్రబాబునాయుడుకే. వైఎస్‌ జగన్‌ చేసేదే చెబుతారు. అమలు చెయ్యలేనివి అస్సలు చెప్పరు. చంద్రబాబు అన్ని చెబుతాడు. ఏమీ చేయడు. పాలనలో తండ్రిని మించిన తనయుడు వైఎస్‌ జగన్‌ అవుతారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం మేలు జరగాలన్నా ఈసారి వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలి అనే ఒకే ఒక ఆలోచనతో నేను వైఎస్సార్‌సీపీలోకి వచ్చాను. మీరు ఎక్కడ నిలబడినా సీటు ఇస్తామని చెప్పినా వద్దన్నాను. వైఎస్‌ జగన్‌ని సీఎంగా చూడాలనే ఉద్దేశంతోటే ఇందులోకి వచ్చాను. దీనితర్వాత నేను రాజకీయాల్లో కొనసాగను. నూటికి నూరుపాళ్లు ఇది నిజం.
(ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)
https://bit.ly/2OsAouz
https://bit.ly/2Wr9JRz

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement