
సాక్షి, న్యూఢిల్లీ : ఫిట్‌నెస్‌పై మెట్రో నగరాల్లో రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. గురుగ్రాం, నోయిడా, ఘజియాబాద్ సిటీలు ఫిట్‌నెస్ క్రేజీ నగరాలుగా ముందువరుసలో నిలిచాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబయి, హైదరాబాద్, బెంగళూర్, చెన్నై వంటి మెట్రో సిటీల్లోనూ ప్రజలు చురుగ్గా వర్కవుట్స్ చేస్తున్నారని మొబైల్ హెల్త్ అండ్ ఫిట్‌నెస్ సంస్థ హెల్థీఫైమ్ నివేదిక పేర్కొంది. గురుగ్రాం, నోయిడా, ఘజియాబాద్‌లో 45 శాతం మంది పైగా రోజూ 4700 అడుగులు వేస్తూ పరుగులు పెడుతున్నారు. ఈ నగరాల ప్రజలు రోజుకు 340 కేలరీల వరకూ ఖర్చు చేస్తూ నెలలో పది రోజుల వరకూ వర్కవుట్లు చేస్తున్నట్టు తేలింది. అయితే కోల్‌కతా, లక్నో, అహ్మదాబాద్ మాత్రం లేజీ సిటీల జాబితాలో చేరాయి. ఇక్కడి సిటిజనులు నెలలో కనీసం నాలుగు రోజులు కూడా వర్కవుట్స్ చేయడం లేదు.
ఇతర నగరాలతో పోలిస్తే ఇక్కడి ప్రజలు తమ శరీరాల నుంచి తక్కువ కేలరీలనే ఖర్చు చేస్తున్నారని తేలింది . దేశంలోని మిగిలిన నగరాల్లో సగటున రోజుకు 4300 అడుగులు నడుస్తున్నారు.భారత్‌లోని 220 నగరాల్లో 36 లక్షల మంది వ్యాయామ, ఆహార అలవాట్లకు సంబంధించిన డేటాను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించామని హెల్థీఫైమ్ వ్యవస్థాపక సీఈఓ తుషార్ వశిష్ట్ తెలిపారు. ఇక మహిళలతో పోలిస్తే పురుషులు మరింత చురుకుగా ఉంటున్నట్టు వెల్లడైంది.
అయితే కోల్‌కతా, అహ్మదాబాద్, లక్నో నగరాల్లో మహిళలు ఇంచుమించు పురుషులకు దీటుగా వ్యాయామం, నడక వంటి యాక్టివిటీస్‌లో చురుకుగా ఉన్నారు.మొత్తంమీద పురుషులు నెలలో 14 రోజులు వర్కవుట్లు చేస్తుండగా.మహిళలు కేవలం 11 రోజులే వర్కవుట్ చేస్తున్నారు. ఇక పురుషులు అధిక కేలరీలు కరిగించే పుషప్స్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేస్తుండగా, మహిళలు యోగా, సూర్యనమస్కారాలు వంటి తేలికపాటి వ్యాయామాలతో సరిపెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment