రాధ అనన్యభక్తి
జ్యోతిర్మయం
ఓ ధనిక దంపతుల కథ చెప్తాడు సాధు వాస్వానీ. వారిద్దరికీ ఒకరి ఎడల మరొకరికి గొప్ప ప్రేమ. ఇద్దరూ ఒక స్టీమర్‌లో ప్రయాణిస్తుండగా నీటిలో మునిగింది. భార్యాభర్తలిద్దరూ వేర్వేరు గ్రామాలకు చేరారు. భార్య ఎంతగానో దుఃఖించింది. భర్త విచార గ్రస్తుడై భార్యకై వెతకనారంభించాడు.
ఓ రాత్రి భర్తకు వచ్చిన స్వప్నంలో తన భార్య కని పించాలంటే ఉత్తరం వైపు వెళ్లమని సూచన వచ్చింది. ఆ సూచనను అనుసరించి ఒక గ్రామానికి వెళితే, ఊరి వారు ఆ ఊరికి కొత్తగా వచ్చిన స్త్రీని గురించి చెప్పు కుంటున్నారు. ఆవిడ నివసిస్తున్నట్లు చెప్పిన గుడిసె వద్దకు వెళ్లి ఆ భర్త తలుపు తట్టాడు. పేరు పెట్టి పిలిచే సరికి, భర్త కంఠ స్వరాన్ని గుర్తుపట్టి, ఆమె వెంటనే తలుపు తీసి అతడితో మళ్లీ ఏకమయింది.
‘భగవంతుడు మనందరికీ శాశ్వతమైన భర్త. మన హృదయ కవాటాన్ని సతతం తట్టుతూనే ఉంటా డు. కానీ మనం లేచి, ఆ తలుపు తీయాలని అను కోము. మనమందరం వేరుపడి బతుకుతుంటాం. ప్రేమ కొద్దీ కార్చే కన్నీరు, అతడికై మనం పడే తహ తహ ఒక్కటే భగవంతుడికి దగ్గర తోవ.’ అని గద్గద స్వరంతో చెప్పేవారు వాస్వానీ.
సాధు వాస్వానీ జీవితమంతా ఈ ప్రేమ మార్గాన్ని బోధించారు. ‘చిన్ని కృష్ణుడికి జ్వర మొచ్చింది’ అనే కథ అదే. ఏమందూ ఆ జ్వరాన్ని తగ్గించలేకపోయింది. ఆందోళన చెందిన యశోద ‘కృష్ణా! నీ జ్వరమేమిటో అంతుబట్ట టం లేదు. ఇది ఎట్లా తగ్గుతుందో, త్రిలోకాల పాలకు డివైన నీవే చెప్పాలి’ అని వేడుకున్నది. ‘నన్ను అమితం గా ప్రేమించే భక్త శిఖామణి పాదధూళి నా నుదురుకు రాస్తే, తగ్గిపోతుంది’ అన్నాడు కృష్ణుడు.
ఊరినిండా కృష్ణుని ప్రేమించే గోపికలు ఉన్నారు. యశోద ఒక గోపిక ఇంటికి వెళ్లింది. ఆ గోపిక ‘ప్రాణ మైనా ఇస్తాను కానీ, పాదధూళి భగవంతుడి నుదు రుకు రాయడానికి ఇచ్చేటంతటి పాపం చేయలేను. అలాంటి వారు నేరుగా నరకానికి వెళ్తారు’ అంటుం ది. ఎవరి వద్దకు వెళ్లినా ఇలాంటి సమాధానాలే. చివ రకు యశోద, రాధ వద్దకు వెళుతుంది. రాధ, ఉత్సా హంగా ‘నాకున్నదంతా ఆ కృష్ణుడిదే. నా తల తీసు కున్నా సరే, పాదధూళి తీసుకున్నా సరే’ అంటుంది, ఆ మహా ప్రేమికురాలు.
ఆశ్చర్యపోయిన యశోద, ‘రాధా! ఈ పాదధూళి ఇచ్చిన వారు నరకానికి వెళతారని శాస్త్రాల్లో ఉంది’. అంటుంది. అయినా రాధ ‘నా కృష్ణుడికై నన్ను ఏ నర కంలోకి తోసినా సంతోషంగా వెళ్తానమ్మా. నా పాద ధూళి తీసుకువెళ్లి, కృష్ణుడికి జ్వరం తగ్గించు’ అంది.
యశోద పాదధూళి తీసుకొని బయలు దేరు తుంది. బాలకృష్ణుడప్పటికే లేచి, అల్లరిలో నిమగ్నమై ఉన్నాడు. జ్వరం కేవలం ‘లీల’ అయి ఉండాలి. ఆనాటి నుండి, కృష్ణుడికి రాధ అంత ప్రియమైన మనిషి ఎందు కయిందని ప్రశ్నించిన వారు లేరు.
నీలంరాజు లక్ష్మీప్రసాద్