నలుపు మెరుపులు
గగనాంతర రోదసిలో దూసుకుపోతున్నా.. ఇలాతలంలో ఇంతులపై వివక్ష కొనసాగుతూనే ఉంది. పదిమందిని మెప్పించే మేధస్సు ఉన్నా.. మేని ఛాయను బట్టే మర్యాద ఇచ్చే పరిస్థితులు ఇంకా ఉన్నాయి. తెలుపులో ఉన్నవారిని వలపు తీగలని పొగిడే నోళ్లు.. నలుపు నారాయణుడు మెచ్చునన్న సంగతి మరచి వ్యవహరిస్తుంటారు. ఇలాంటి వివక్షకు చెక్ పెడుతూ ‘డార్క్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే కాన్సెప్ట్ సిటీలో షురూ అయింది.
ఒంటి రంగు బంగారు వన్నెలో తళుకులీనినా.. నీడ మాత్రం కనిపించేది నలుపులోనే. యుగయుగాల చరిత్రలోకి తొంగి చూస్తే నలుపు రంగుకు మించిన అందం లేదని తెలుస్తుంది. నారాయణుడు నలుపు.. పార్వతీదేవి నలుపు. త్రేతాయుగంలో రాముడు నీలిమేఘ శ్యాముడు. ద్వాపరానికి వస్తే శ్రీ కృష్ణుడిదే కాదు. ద్రౌపది మేనిఛాయ కూడా నలుపే. ఒకప్పుడు ఒంటిపై నిగనిగలాడిన నలుపు.. ఇప్పుడు కంట్లో నలుసులా మారుతోంది. పురాణకాలంలో ఈ రంగుపై కనిపించని వివక్ష.. నవీనయుగంలో మాత్రం కట్టలు తెంచుకుంది. మగువలు ఎన్ని రంగాల్లో దూసుకుపోతున్నా.. రంగునుబట్టే సమాజం వారికి గౌరవాన్నిస్తోంది. ఈ రుగ్మతను తగ్గించే సంకల్పంతో మొదలైందే ‘డార్క్ ఈజ్ బ్యూటిఫుల్’ క్యాంపెయిన్.
చెన్నై టు హైదరాబాద్..
ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఈ కాన్సెప్ట్ ఇండియాలో చెన్నై నుంచి మొదలైంది. కవితా ఇమ్మాన్యుయేల్ ప్రారంభించిన ఈ క్యాంపెయిన్ ‘బ్లాక్ బ్యూటీ’, నటి నందితాదాస్ సపోర్ట్‌తో మనసులకు పట్టిన నలుపును తుడిచేందుకు పనిగట్టుకుంది. చెన్నై నుంచి హైదరాబాద్‌కు పాకిన డార్క్ ఈజ్ బ్యూటిఫుల్ సిటీ స్త్రీల్లో సరికొత్త ఉత్సాహం నింపే ప్రయత్నంలో ఉంది.
చామనఛాయా చిత్రాలు..
ఫ్యాషన్ షో, సినీ ఇండస్ట్రీ, ఉద్యోగం...ఇలా ఏ రంగాల్లోనైనా కాస్త రంగు త క్కువగా ఉండే అమ్మాయిలకు అవకాశాలు తక్కువ వస్తున్నాయి. తెలివికి రంగుతో సంబంధం లేదనే కాన్సెప్ట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డార్క్ అండ్ బ్యూటీఫుల్ ఫొటో ఎగ్జిబిషన్‌కు శ్రీకారం చుట్టింది హోటల్ మారియట్ మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీ. ఈ కానె ్సప్ట్ వివరించి ఎంట్రీలను ఆహ్వానించింది. ఫేస్‌బుక్ ద్వారా సరికొత్త థీమ్‌తో మొదలైన క్యాంపెయిన్‌కు వివిధ రంగాలకు చెందిన మహిళల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. ష్యాషన్, మీడియా, సినిమా, ఐటీ.. ఇలా తాము ఎంచుకున్న మార్గంలో సక్సెస్ సాధించిన పలువురు మగువలు క్యాంపెయిన్‌లో పాలుపంచుకుంటున్నారు. యాంకర్ ఝాన్సీ, డిజైనర్ అర్చన రావ్, ఆర్టిస్టు ప్రియాంక ఏలే వంటి 50 మంది ప్రముఖులు ఉత్సాహంగా ముందుకువచ్చారు. ఇలా స్పందించిన వారి ఫొటోలను ప్రత్యేకంగా తీశారు. వాటిని ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తున్నారు. వారిలో ఉన్న ధీమాతో పాటు వారు సాధించిన విజయాలనూ ఫొటో ప్రదర్శన ద్వారా తెలియజేస్తున్నారు. ఈ నెల 13న ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ 20 వరకు కొనసాగనుంది.
బ్యూటిఫుల్ కాన్సెప్ట్
సాధారణంగా అమ్మాయిలంటేనే వివక్ష కొనసాగుతున్న రోజులివి. ఆడ శిశువు అనగానే కడుపులోనే అంతమొందిస్తున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి. దీన్ని దాటి నేలపైకి వచ్చినా అమ్మాయి తెల్లగా, బుర్రగా ఉంటే సరి. నలుపు రంగు వస్తే సమాజంలో నెగెటివ్ ఆలోచన ధోరణి పెరుగుతోంది. దీన్ని నివారించడమే డార్క్ ఈజ్ బ్యూటిఫుల్ ఉద్దేశం. ఈ కాన్సెప్ట్‌ను వివరించి ఎంట్రీలను ఆహ్వానించాం. చాలా మంది సెలబ్రిటీలు స్పందించారు. వారు సాధించిన విజయాలను వివరిస్తూ ఏడు రోజుల పాటు ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాం.
- కాళీ సుధీర్, హోటల్ మారియట్ మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీ క్యురేటర్
స్టే బ్యూటిఫుల్..
అందమనేది చూసే దృష్టి కోణంలో ఉంటుంది. నలుపు అందం కాదనే వారు నా దృష్టిలో కళ్లుండీ చూపులేనివారే. న్యాయాన్యాయాలకు పర్యాయ పదాలుగా వాడే ఫెయిర్, అన్‌ఫెయిర్ అనే పదాలను ఒంటి రంగులకు వాడటమే మేని ఛాయలపై వివక్ష ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. రంగు వ్యక్తిలో కనిపిస్తుందే కానీ వ్యక్తిత్వాన్ని చూపదు. అందుకే స్టే అన్‌ఫెయిర్, స్టే బ్యూటిఫుల్ నినాదంతో మొదలైన డార్క్ ఈజ్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్‌కు మరింత ప్రచారం కల్పించాలి. నా వరకైతే అయామ్ అన్‌ఫెయిర్, అయామ్ బ్యూటిఫుల్.
- ఝాన్సీ, యాంకర్
- త్రిగుళ్ల నాగరాజు