ఎనీ కార్... సింగిల్ హ్యాండ్ | Any car singal hand: He drives own singal hand | Sakshi
Sakshi News home page

ఎనీ కార్... సింగిల్ హ్యాండ్

Published Tue, Dec 16 2014 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM

ఎనీ కార్... సింగిల్ హ్యాండ్

ఎనీ కార్... సింగిల్ హ్యాండ్

కొందరిని వైకల్యం కుంగదీస్తుంది.. ఇంకొందరిని విధిని జయించేలా చేస్తుంది. తాను ఎదుర్కొంటున్న సమస్య తనలాంటి వారికి ఎదురవ్వొద్దని ఆలోచించేలా చేస్తుంది

కొందరిని వైకల్యం కుంగదీస్తుంది.. ఇంకొందరిని విధిని జయించేలా చేస్తుంది. తాను ఎదుర్కొంటున్న సమస్య తనలాంటి వారికి ఎదురవ్వొద్దని ఆలోచించేలా చేస్తుంది. పరిష్కారం కనుగొంటుంది. అందుకే పోలియోతో రెండు కాళ్లు చచ్చుబడిన జానీ మియా కారు నడిపాడు. మామూలు కారునే తనూ నడిపేలా మార్చేసుకున్నాడు. సింగిల్ హ్యాండ్‌తో డ్రైవింగ్ చేయడమే కాదు.. తనలాంటి వారు కారును సొంతంగా డ్రైవ్ చేస్తూ షికారు కొట్టేలా చేస్తున్నాడు. వికలాంగులు సైతం ఈజీగా డ్రైవ్ చేసేలా కార్లను మార్చేసి.. క్యా బాత్ హై అనిపించుకుంటున్నాడు.
 - వాంకె శ్రీనివాస్
 
 ‘మా సొంతూరు ఖమ్మం జిల్లా పాటివారిగూడెం. ఖమ్మంలో సెయింట్ మేరీస్ పోలియో హోమ్‌లో చదువుకున్నా. ఐటీఐ పూర్తయ్యాక ఖమ్మంలో టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్లు రిపేర్ చేసేవాడ్ని. కువైట్‌లో రెండేళ్లు ఎలక్ట్రానిక్ చిప్ తయారీ కంపెనీలో పనిచేసి 2009లో హైదరాబాద్‌కు వచ్చేశాను. ఓసారి స్నేహితులతో కారులో విహారయాత్రకు వెళ్లినప్పుడు నేనూ డ్రైవ్ చేస్తానంటే వాళ్లు హేళన చేశారు. అప్పుడే ఎలాగైనా కారు నడపాలని నిశ్చయించుకున్నా. గతంలో మా నాన్నకు ఆటో నేర్పిన అనుభవం నాలో ధీమాను పెంచింది.  
 
 చేతినిండా పని
 మా అన్నయ్య ఖాదర్‌బాబు ఫిట్టర్‌గా పనిచేసేవాడు. ఆయన దగ్గర మెకానిక్ పని కొంత నేర్చుకున్నాను. మొదట ఒక మారుతి ఒమ్నీ వ్యాన్ కొన్నా. ఇంజిన్ ఎలా పని చేస్తుందో.. తెలుసుకునేందుకే నాకు రెండేళ్లు పట్టింది. ప్రయోగాల కోసం రూ.3 లక్షలు ఖర్చు చేశాను. క్లచ్ సిస్టమ్‌లో కాస్త మార్పులు చేసి చేత్తో తక్కువ బలంతో ప్రెస్ చేసినా పనిచేసేలా మార్చా. కుడి చేతి వైపు క్లచ్, యాక్సిలేటర్, బ్రేక్‌లను పెట్టి రెండు కాళ్లతో చేసే పనిని చేత్తో చేసేలా మార్చేశాను. కుడి చేయి సరిగా పని చేయకుండా ఒక కాలు సరిగా పని చేసే వారి కోసం అందుకు తగ్గట్టు మార్పులు చేశాను. నాలుగేళ్లు ప్రయోగాల తర్వాత డ్రైవర్ సీట్లో కూర్చుని కారు నడిపాను. మిగతా కార్లకు ఇలాంటి ఏర్పాట్లే చేశాను. ట్రాఫిక్‌లో బటన్ నొక్కి వాహనాన్ని ఆపేలా మార్పు చేశాను. అదే కారును మామూలు వ్యక్తులు నడిపినపుడు వికలాంగుల కోసం అమర్చిన వ్యవస్థను లాక్ చేసే ఏర్పాటు కూడా చేశాను.
 
 వైకల్యాన్ని బట్టి...
 వైకల్యం ప్రకారం 14 రకాలుగా కార్లను మాడిఫై చేస్తున్నా. వనస్థలిపురంలో ‘క్రియేటివ్ టెక్నాలజీస్’ పేరుతో గ్యారేజీ నిర్వహిస్తున్నా. హ్యాండ్, లెగ్, టూలెగ్, బాడీ ఫిట్‌నెస్‌లో సమస్యలున్న వారికి అనుగుణంగా డిజైన్ చేసిన కారులో టెస్ట్ డ్రైవ్ చేసి చూపెడతాను. ఇప్పటి వరకు 1,200 కార్ల డ్రైవింగ్ సిస్టమ్‌ను మార్చాను. ఎలక్ట్రికల్ ఆపరేటింగ్, హైడ్రాలిక్ ఆపరేటింగ్, మెకానికల్ ఆపరేటింగ్‌ను ఆధారంగా చేసుకొని 14 రకాల కార్లను డిజైన్ చేశాను.
 
  డెమో వెహికల్ ద్వారా డ్రైవింగ్ నేర్పుతాను. రెండు వారాల్లో వారికి డ్రైవింగ్‌లో శిక్షణిస్తాను. కాస్త పర్‌ఫెక్ట్ అయ్యాక ఇదే కారుతో ఆర్టీఏ కార్యాలయంలో టెస్ట్ డ్రైవ్ చేసి లెసైన్స్ పొందుతున్నారు. తమ వైకల్యానికి అనుగుణంగా కారు మార్చుకోవాలనుకుంటున్న వారికి రూ.6 వేల నుంచి రూ.30 వేల వరకూ ఖర్చవుతుంది. స్పెషల్ కార్లు కావాల్సిన వారు http://handicappedcar.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయితే మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. తాను చేసే పని వైకల్య బాధితుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని జానీమియా అంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement