ప్యారా.. తిరంగా!
ఇండిపెండెన్స్ డే ఫీవర్.. సిటీని ఊపేస్తోంది. రెస్టారెంట్లు, బ్యూటీ పార్లర్లు.. ఫ్యాషన్, ట్రెడిషన్.. ఎక్కడ చూసినా యువ‘తిరంగా’లు ఎగసిపడుతున్నాయి. యువతని ఆకట్టుకునేందుకు ఈ-కామర్స్ వెబ్‌సైట్లు సహా వ్యాపార సంస్థలన్నీ మువ్వన్నెల ముస్తాబుతో కనువిందు చేస్తున్నాయి.
పంద్రాగస్టున కళ్లు చెదిరేలా మువ్వన్నెలతో కనిపించి దేశభక్తిని చాటుకొనేందుకు యువత సన్నద్ధమవుతోంది. వస్త్రధారణలో, అలంకరణలో.. ఆఖరుకు ఆహారంలోనూ అణువణువునా దేశభక్తి ప్రతిఫలించేలా వ్యాపార సంస్థలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. తమ సృజనాత్మకతకు పదునుపెట్టుకుని ముందుకొచ్చాయి. ముఖ్యంగా ఈ-కామర్స్ వెబ్‌సైట్లు యువతను ఆకట్టుకోవడంలో ముందంజలో ఉంటున్నాయి.
ఈ-ప్రపంచం.. త్రివర్ణభరితం
వోయ్‌లా డాట్ కామ్, షాప్‌క్లూస్ డాట్ కామ్, స్నాప్‌డీల్ డాట్ కామ్ వంటి పలు ఈ-కామర్స్ వెబ్‌సైట్లు కొద్దిరోజులుగా త్రివర్ణభరితంగా మారాయి. ఆన్‌లైన్ స్టోర్స్‌లో అందుబాటు ధరల్లో ‘తిరంగా’ జుయెలరీ కలెక్షన్‌ను అందిస్తున్నాయి. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లోని రంగు రాళ్లు, పూసలు వంటి వాటితో ఈ ఆభరణాలను రూపొందించాయి. అలాగే కాటన్‌తో తయారు చేసిన జాతీయ పతాకం సహా దేశభక్తిని ప్రతిబింబించేలా రూపొందించిన ఫ్యాషన్ వస్తువులను విక్రయిస్తున్నాయి.
మువ్వన్నెల ఫ్యాషన్ సందడి
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్యాషన్ బ్రాండ్స్ సరికొత్తగా రూపొందించిన దుస్తులు, యాక్సెసరీస్‌తో ముందుకొస్తున్నాయి. సంప్రదాయబద్ధంగా కనిపించే కుర్తాలు, మూడురంగుల స్టోల్స్, సల్వార్ కమీజ్‌లు, టీ-షర్టులు అందిస్తున్నాయి. అన్ని వర్గాల వారికీ, అన్ని వయసుల వారికీ అందుబాటులో పలు ఫ్యాషన్ వస్తువులను ముందుకు తెస్తున్నాయి. యువతులైతే జెండా డిజైన్‌లో నెయిల్ ఆర్ట్, కనురెప్పల మేకప్, మువ్వన్నెల కేశాలంకరణ వంటివి చేయించుకుంటూ దేశభక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇవే కాకుండా హ్యాండ్‌బ్యాగ్స్, గాజులు, గొలుసులు వంటి యాక్సెసరీస్ సైతం ‘తిరంగా’ డిజైన్లలోనే ఎంపిక చేసుకుంటున్నారు.
మూడు రంగుల్లో ముచ్చటైన రుచులు
రెస్టారెంట్లు సైతం మూడు రంగుల వంటకాలను ముచ్చటైన రుచుల్లో అందిస్తున్నాయి. చీజ్ కేక్స్, చాక్లెట్ బ్రౌనీస్, హరా కబాబ్స్, ఆచారి పనీర్ టిక్కా వంటి ప్రత్యేక వంటకాలతో దేశభక్తిని చాటకుంటూనే, భోజనప్రియులనూ అలరిస్తున్నాయి.
- శిరీష చల్లపల్లి