చాకో ... అంటే కోటి
చవులూరించే చాక్లెట్లను నోట్లో వేసుకుంటే చప్పున కరిగిపోతాయి. ఒక్కసారి రుచి మరిగితే చిన్నారులు మొదలుకొని వయసు మళ్లిన వారు సైతం చాక్లెట్ల రుచికి దాసోహం కావలసిందే. చాక్లెట్లలో ప్రధానంగా ఉపయోగించే కోకోతోనే వాటికి ఆ రుచి వస్తుంది. చిన్నపిల్లలకు ఇచ్చేందుకు చాక్లెట్‌ను మించిన తాయిలం లేదు. సంతోషాన్ని పంచుకునే సందర్భాల్లో పెద్దలు కూడా చాక్లెట్లు ఇచ్చిపుచ్చుకోవడం మామూలే. రకరకాల బ్రాండ్లతో, రకరకాల పేర్లతో ఇప్పటికే లెక్కలేనన్ని అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు రొటీన్‌కు భిన్నమైన చాక్లెట్లు వస్తున్నాయి. ఈవెంట్‌కు తగ్గ డిజైన్లలో నోరూరిస్తున్నాయి.
- శిరీష చల్లపల్లి
చాక్లెట్ కళాఖండాలు...
పెళ్లి సందడిలో చాక్లెట్ భాగస్వామిగా మారుతోంది. విలక్షణమైన విజిటింగ్ కార్డులు చాక్లెట్‌పైనే కొలువుదీరుతున్నాయి. అందరూ చాక్లెట్లపై తెల్లని కేరమెల్‌తో అక్షరాలు మాత్రమే కాదు, ఫొటోలనూ ముద్రించి సెలబ్రేషన్స్‌కు చాకో హంగులు అద్దుతున్నారు. బర్త్ డే బాయ్స్‌కు వెరైటీ శుభాకాంక్షలు తెలియజేయడానికి ఆ చిన్నారుల ఫొటోలతో లాలిపాప్స్ ప్రిపేర్ చేయించుకోవచ్చు. రాఖీ పండుగ కోసం ఆన్నాచెల్లెల్ల ఫొటోలతో రాఖీ చాకోలు ఆర్డరిస్తే క్షణాల్లో ముందుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే మనదైన వేడుకల్లో మనసైన బహుమతి చాక్లెట్ రూపంలో దొరుకుతున్నాయి. హ్యాండ్‌మేడ్ చాక్లెట్లు, షుగర్‌ఫ్రీ చాక్లెట్లు, వైన్, రమ్ వంటి లిక్కర్స్ ఉపయోగించి తయారు చేసే లిక్కర్ చాక్లెట్ల వంటి వినూత్న రకాలు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. పలు వేడుకల్లో చాక్లెట్ ఫౌంటేన్లు అతిథులకు పసందైన రుచులు అందిస్తున్నాయి.
వెరైటీ కోరుకుంటున్నారు
ప్రస్తుతం నగరవాసులు ప్రతిదాంట్లో కొత్తదనం కోరుకుంటున్నారు. ఇంట్లో జరిగే చిన్నాపెద్దా ఫంక్షన్లకు చాక్లెట్ హంగులు దిద్దుతున్నారు. తయారీలో స్వచ్ఛత ఉన్న వాటికి ఎక్కువగా ఆదరిస్తున్నారు. వెరైటీ చాక్లెట్లకు డిమాండ్ చాలా ఉంది. అందుకే మా చాక్లెట్ హట్ సంస్థ డిఫరెంట్ డిజైన్లతో చాక్లెట్లను ప్రిపేర్ చేస్తోంది. టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎన్నికల్లో గెలుపొందిన సందర్భంగా ఆయనకు కానుకగా ఇచ్చిన గులాబీ రంగు చాక్లెట్ బొకే మా తయారీనే.
- కె.లక్ష్మి, చాక్లెట్ హట్ నిర్వాహకురాలు