ఛోటా భీమ్ బడా హిట్ | Chota Bhim big hit | Sakshi
Sakshi News home page

ఛోటా భీమ్ బడా హిట్

Published Fri, Aug 29 2014 12:32 AM | Last Updated on Fri, Jul 12 2019 4:28 PM

ఛోటా భీమ్ బడా హిట్ - Sakshi

ఛోటా భీమ్ బడా హిట్

‘ఛోటా భీమ్’... బుల్లితెరపై ఇది బడా హిట్. చిన్నారుల క్రేజీహీరో ఛోటా భీమ్ సృష్టికర్త రాజీవ్ చిలక తన విజయగాథతో ఆగస్ట్‌ఫెస్ట్‌లో ఔత్సాహికులకు స్ఫూర్తినివ్వనున్నారు. ఛోటాభీమ్ బుల్లితెరపైకి వచ్చేంత వరకు ఒడిదొడుకుల పయనం ఆయనది. అకుంఠితమైన ఆత్మవిశ్వాసంతో అన్ని ఆటంకాలను అధిగమించి, విజయపథంలో దూసుకుపోతున్న రాజీవ్ చిలక ‘సిటీప్లస్’తో పంచుకున్న అనుభవాలు ఆయన మాటల్లోనే...
 
ఆలోచనల్లోంచి పుట్టిన పాత్ర...
నా ఆలోచనల్లోంచి ఛోటా భీమ్ పాత్ర 2003 సెప్టెంబర్ 18న పుట్టింది. దాని చుట్టూ కథ అల్లుకుని, పైలట్ ప్రాజెక్టు చేసేసరికి ఆరు నెలలు పట్టింది. నచ్చకపోవడంతో మరో ఏడాది శ్రమించి రీడిజైన్ చేశా. తర్వాత 2005లో కార్టూన్ నెట్‌వర్క్, డిస్నీ వంటి అన్ని చానల్స్‌కూ చూపించా. ఇండియన్ మార్కెట్‌లో నడవదని వాళ్లు రిజెక్ట్ చేశారు. మరికొన్ని మార్పులతో తిరిగి ప్రెజెంట్ చేసినా, ‘నో’ అనేశారు. స్టోరీ టెల్లింగ్‌లో ఇంకొన్ని మార్పులు చేసి అప్రోచ్ అయితే ‘పోగో’ చానల్ ఓకే చేసింది.
 
అప్పుల కుప్పలు
మాకొచ్చిన ఆర్డర్‌తో కొత్త ఆఫీసు తీసుకున్నాం. ‘ఛోటా భీమ్’ మరో పదిరోజుల్లోగా పోగో చానల్‌లో కనిపిస్తుందనగా, 2008 మార్చి 26 అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆఫీసులో అగ్నిప్రమాదం జరిగింది. ఛోటా భీమ్ సక్సెస్‌ను కళ్లారా చూసుకోక ముందే అంతా బూడిదైంది. అప్పుల కుప్పలు భయపెట్టాయి. అయినా, ఒక చిన్న ఆశ... ఇంటలెక్చువల్ ప్రాపర్టీ చెక్కుచెదరలేదు కదా అని! అదే మమ్మల్ని ముందుకు నడిపింది.
 
అప్పుల వాళ్లందరినీ పిలిచి జరిగింది చెప్పాను. మరో మూడు నెలలు టైమిస్తే అణాపైసలతో సహా అప్పంతా తీర్చేస్తానన్నాను. అయితే, అప్పటి వరకు ఇంకొంచెం మెటీరియల్ సప్లయ్ చేయమని అడిగా. అంతా వింతగా చూశారు. ఏం చూసుకుని మళ్లీ అప్పు అడుగుతున్నాడని అనుకున్నారేమో! పదిరోజుల్లో టెలికాస్ట్ కాబోయే ‘ఛోటాభీమ్’ గురించి చెప్పి వాళ్లను కన్విన్స్ చేశా. ఛోటాభీమ్ స్క్రీన్‌పైకి వచ్చింది. అనుకోని రేంజ్‌లో హిట్ అయింది. అనుకున్న సమయానికే అప్పులన్నీ తీరిపోయాయి. ఆర్డర్స్ వచ్చిపడ్డాయి.
 
ఇదే ఎగ్జాంపుల్‌గా మాట్లాడతా...
ఆగస్ట్ ఫెస్ట్‌లో నాకు ఇరవై నిమిషాల సమయం కేటాయించారు. సక్సెస్‌ఫుల్ ప్రాజెక్టును ఎలా క్రియేట్ చేసుకోవాలి, కలలను నెరవేర్చుకోవడానికి ఎలా పనిచేయాలి అనే దానిపై ‘ఛోటాభీమ్’నే ఎగ్జాంపుల్‌గా మాట్లాడాలనుకుంటున్నా. నా కథలో డ్రీమ్, ఐడియా, క్రియేటివిటీ, మార్కెటింగ్, కరేజ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, అచీవ్‌మెంట్ అన్నీ ఉన్నాయి.
 
వాటినే ‘ఛోటాభీమ్’ను స్క్రీన్‌పై ప్రెజెంట్ చేస్తూ వచ్చిన వాళ్లకు ఇన్‌స్పిరేషన్‌గా చూపించదలచుకున్నా. ఈరోజు ఏ కంపెనీలోనైనా ఇండియన్ పవరే అద్భుతాలు సృష్టిస్తోంది. మైక్రోసాఫ్ట్‌ను తీసుకుంటే... విండోస్ నుంచి ప్రతి ప్రాడక్ట్‌లోనూ ఇండియన్సే ఎక్కువమంది. ఆ కంపెనీ సీఈవో కూడా ఇండియనే. మనకు ఎబిలిటీ ఉంది. దానిని కెరీర్‌గా మలచుకునే ధైర్యమే కావాలి. ఇదే మన సక్సెస్ సూత్రం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement