లవ్లీ.. లంగా ఓణీ
పదహారేళ్ల పడుచు నుంచి నాలుగు పదులు దాటిన నడివయసు మహిళల వరకు ఏ చిన్న అకేషన్ అయినా ఇటీవల ఎంచుకుంటున్న హాట్ డ్రెస్ లంగా ఓణీ. కనువిందు చేసే లంగా ఓణీలు నగర వనితలను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రావణమాసం నోములు, వ్రతాలతో ప్రతి గడప పచ్చని తోరణాలతో సింగారించుకుంటుంది. ఇంటికి మరింత కళ తెచ్చేలా లంగా ఓణీలతో ప్రతి పడతి అలంకరించుకుంటుంది. ప్రజెంట్ ట్రెండ్‌లో ఉన్న హాఫ్‌శారీస్ సెలక్షన్‌లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మీ రూపం మరింత ట్రెండీగా కనిపిస్తుంది.
ఒకప్పుడు లంగా ఓణీలను పట్టు, జార్జెట్, షిఫాన్‌తో డిజైన్ చేసేవారు. కానీ ప్రస్తుతం టిష్యూ నెట్, బెనారస్ ఫ్యాబ్రిక్‌తో లంగా ఓణీలను రూపొం దిస్తున్నారు. ఈ ఫ్యాబ్రిక్ వల్ల లుక్ కూడా చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది.
సాధారణంగా లెహంగా అంచు కలర్ ఓణీ, మధ్య కలర్ బ్లౌజ్ ఉండాలనుకునేవారు. ఇప్పుడు లంగా, బ్లౌజ్, ఓణీ... అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్‌నే ఇష్టపడుతున్నారు.
చాలా మంది గ్రాండ్‌గా అలంకరించిన బ్లౌజ్‌లనే ఎంచుకుంటున్నారు. అందుకే వీటిలో వైవిధ్యమైన డిజైన్లు ఎన్నో వచ్చాయి.
ఈ మాసం మొత్తం పండుగ వాతావరణమే ఉంటుంది కాబట్టి వ్రతాలు, నోములకు మగువలు అంతా ఒక చోట చేరుతుంటారు. ఇలాంటప్పుడు ఎక్కువగా బ్రైట్ అండ్ డార్క్ కలర్స్ లంగా ఓణీలను ఎంచుకుంటారు. వీటిలో రెడ్, పింక్, ఎల్లో.. డార్క్ కలర్స్ ముందు వరుసలో ఉంటున్నాయి. లంగా ఓణీ పైకి యాంటిక్ జ్యువెలరీ బాగా నప్పుతుంది. లంగా హెవీగా ఉంటే లైట్ జ్యువెలరీ వేసుకుంటే చాలు. లాంగ్ యాంటిక్ చెయిన్స్ మంచి కాంబినేషన్. కాలేజీ ఫ్రెషర్స్ పార్టీలు ఈ నెలలో ఎక్కువగా జరుగుతుంటాయి. అమ్మాయిలు సంప్రదాయంలోనే ఆధునికంగా కనిపించాలంటే లంగా ఓణీ ధరించినప్పుడు జ్యువెలరీని తక్కువగా ప్రిఫర్ చేయాలి. హెవీ డ్రెస్ వేసుకుంటే చెవులకు హెవీగా జుంకాలు పెట్టుకోవాలి. మెడలో ఇంకే తరహా ఆభరణాలూ వేసుకోనక్కర్లేదు.
- కమలాక్షి, ఫ్యాషన్ డిజైనర్,
శ్రీహిత బొటిక్స్, బంజారాహిల్స్